పోలవరం :పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మరింత జాప్యం చోటుచేసుకుంటోంది. 2018 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గడువులోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం అసాధ్యమని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. పనులు జరుగుతున్న తీరు, కొలిక్కిరాని పునరావాస కార్యక్రమాలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ప్రస్తుతం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనుల్లో భాగంగా స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ నిర్మాణాలకు సంబంధించి ఎర్త్ వర్క్ పనులు జరుగుతున్నారుు. మొత్తం 10 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పనులు చేయాల్సి ఉంది. వీటిని 2014 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ పూర్తి కాలేదు.
దీంతో గడువును డిసెంబర్ 2015 వరకు పెంచారు. 2013 మార్చి 2న ఎర్త్ వర్క్ పనులను ప్రారంభించిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ గడచిన 20 నెలల కాలంలో కేవలం 10 శాతం మాత్రమే చేయగలిగింది. రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పనులు చేయాలన్నది లక్ష్యం కాగా, ప్రస్తుతం 60 వేల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే చేయగలుగుతోంది. పనులను వేగవంతంగా చేయడానికి మరో అడ్డంకి కూడా ఉంది. ముంపు గ్రామాల్లో మొదటి విడతగా ఏడు గ్రామాలను ఖాళీ చేస్తే తప్ప పనులు ముందుకు సాగేలా లేవు. ప్రధానంగా రామయ్యపేట, చేగొండపల్లి, పైడిపాక గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఈ గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అమలు కాలేదు. వీరంతా తాము ఇళ్లు నిర్మించుకోలేమని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వమే పునరావాస కేంద్రాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీనికి ఆమోదం లభించి ఇళ్లు నిర్మించి ఇస్తే తప్ప ఈ గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు.
ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన స్పిల్ వే కాంక్రీట్ పనులు ప్రారంభించాలంటే ఇంకా 90 శాతం ఎర్త్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు కావాలంటే రామయ్యపేట, చేగొండపల్లి గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంది. అలాగే స్పిల్‌వే కాంక్రీట్ పనులు పూర్తయితే తప్ప మరో ప్రధాన కట్టడమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించే పరిస్థితి లేదు. స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లు అనుబంధ కట్టడాలు కావడంతో ఈ పరిస్థితి నెల కొంది. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణానికి సంబంధించి సీడబ్ల్యూసీ అనుమతి కూడా పొందాల్సి ఉంది. అన్నిటికంటే మరో పెద్ద సమస్య డంపింగ్ యార్డు కోసం భూ సేకరణ. ఎర్త్ వర్క్ పనుల్లో వచ్చే వృథా మట్టిని నిల్వ చేసేందుకు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇన్ని అడ్డంకుల మధ్య పోలవరం ప్రాజెక్టు పనులను గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందన్న ఆలోచనతోనే గోదావరి నీటిని ముందుగానే కృష్ణా డెల్టాకు తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి.
పోల‘వరమెన్నటికో’..
Published Fri, Jan 16 2015 11:52 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement