
సున్నిపెంట ఇక నగర పంచాయతీ
సున్నిపెంట ఏకంగా నగర పంచాయతీ కానుంది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ....
సీఎం సమావేశంలో నిర్ణయం?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సున్నిపెంట ఏకంగా నగర పంచాయతీ కానుంది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా శ్రీశైలంను తిరుమల తరహాలో అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో సున్నిపెంటను తిరుపతి తరహాలో మార్చాలని కూడా ఈ సమావేశంలో ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. సున్నిపెంటలోనే శ్రీశైలంలో పనిచేసే ఉద్యోగులతో పాటు అందరికీ నివాసాలు, వీఐపీలకు కాటేజీలు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో సున్నిపెంటను పంచాయతీగా కాకుండా ఏకంగా నగర పంచాయతీగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఁసాక్షి*కి తెలిపారు. ఇందుకు అనుగుణంగా త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నట్టు సమాచారం.
పంచాయతీ నుంచి నగర పంచాయతీకి..
ఇప్పటికే సున్నిపెంట జనాభా 40వేలు దాటింది. సున్నిపెంటను పంచాయతీగా గుర్తించాలని అనేక రోజులుగా ఇక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే సున్నిపెంటను గ్రామపంచాయతీగా మార్చాలని ప్రభుత్వానికి కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నివేదిక సమర్పించారు. అయితే, శ్రీశైలంతో పాటు సున్నిపెంటను కూడా తిరుమల, తిరుపతి తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు శ్రీశైలంలోని సిబ్బందికి మొత్తం సున్నిపెంటలోనే నివాస ఏర్పాట్లు చేయాలనే ఆలోచన ఉంది. ఈ పరిస్థితుల్లో ఏకంగా సున్నిపెంటను నగర పంచాయతీగా గుర్తించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.