
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
మనుబోలు: తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. మనుబోలులో పార్టీ నాయకుడు దేశిరెడ్డి హరనాథ్‌రెడ్డి నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రజాస్వామ్య వాదులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. చంద్రబాబు తన కుర్చీని కాపాడుకునేందుకు ఎంతకైనా దిగజారుతారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిన్నతనం నుంచే కులపిచ్చి ఉందని, వర్సిటీ స్థాయిలోనే రౌడీ రాజకీయాలు చేసిన ఘనత ఆయనదని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఏపీలో తమ పార్టీ నాయకులను ప్రలోభపెట్టి చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ లో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే సంతలో పశువుల్లా బేరమాడుతున్నారని కేసీఆర్‌ను దుమ్మెత్తిపోసిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు ఏపీలో చేసిన దానికి ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
2009లో తనను కాంగ్రెస్‌లోకి రమ్మని ఎవరూ పిలవలేదని, వైఎస్సార్ పరిపాలన నచ్చి తానే వెళ్లానని గుర్తుచేశారు. తాను రూ.10 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్‌లో చేరానని గోబెల్స్ ప్రచారం చేసిన టీడీపీ నాయకులు కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని తాను సవాల్ విసరడంతో తోకముడిచారన్నారు. ఇప్పుడు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో గౌరవించారని, వారు చేసిన పని సరికాదన్నారు. వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మలు పెట్టుకొని గెలిచిన వీరు దమ్ముంటే రాజీనామా చేసి టీడీపీ తరఫున గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఇచ్చే డబ్బు, పదవులకు ఆశపడి వారు పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. 22 నెలల పాలనలో చంద్రబాబు చేసింది శూన్యమని, ప్రజల దృష్టిని మరల్చేందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ పతనం మొదలైందని, అందుకే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ నాయకులు దండు చంద్రశేఖర్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్ గౌడ్, అంకయ్య గౌడ్ పాల్గొన్నారు.