అభయం!
భూమా-శిల్పా మధ్య ముసలం
ఉద్యోగుల బదిలీ తప్పదనే ప్రచారం
ధైర్యం చెప్పే ప్రయత్నంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు
భూమాకు మంత్రి పదవి రాకుండా మోకాలడ్డు
నంద్యాల, ఆళ్లగడ్డల్లోని అధికారుల్లో
గందరగోళం సమన్వయం’ ఎన్నటికో...
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో భూమా-శిల్పాల మధ్య రేగిన ముసలం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మంత్రి పదవి విషయంలో వివాదం రాజుకుంటుండగానే.. తాజాగా అధికారుల బదిలీల విషయంలో కొత్త సమస్య తెరమీదకొచ్చింది. అన్నకు మంత్రి పదవి రాగానే అధికారులపై వేటు తప్పదనే ప్రచారం ఇప్పటికే అటు ఆళ్లగడ్డ, ఇటు నంద్యాలలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఏ ఒక్కరిపై బదిలీ వేటు పడకుండా చూస్తానని అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ధైర్యం చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు అసలు మంత్రి పదవి ఆయనకు వచ్చే అవకాశమే లేదని కూడా
చెబుతుండటం గమనార్హం. డీఎస్పీపై వేటు తప్పదు
నంద్యాల డీఎస్పీని బదిలీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఈ విషయమై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భూమా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ నేతలు మాత్రం ఆయన బదిలీ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. కేవలం నియోజకవర్గ ఇన్‌చార్జీల మాటే చెల్లుబాటు అవుతుందని ఇప్పటికే శిల్పా ధైర్యం చెప్పే ప్రయత్నం
చేస్తున్నారు.
ఆళ్లగడ్డలోనూ వార్ షురూ
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ ఇదే తరహా యుద్ధానికి తెరలేసింది. నియోజకవర్గంలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా పలువురు అధికారులను నియమించుకున్నారు. వీరందరిపైనా ఇప్పుడు వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నియోజకవర్గంలోని ఒక మండలంలో రెగ్యులర్ తహశీల్దారును కాదని.. డిప్యూటీ తహశీల్దారునే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈయన స్థానానికి కూడా ఎసరు తప్పదనే ప్రచారం ఉంది. ఇదే జరిగితే తాడోపేడో తేల్చుకుంటామని గంగుల వర్గీయులు సవాల్ విసురుతున్నారు. తాజా చేరికలతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుతోంది.
కమిటీ వచ్చేదెన్నడో..
పార్టీలో విపక్ష ఎమ్మెల్యేల చేరిక నేపథ్యంలో పాత నేతలు, కొత్త నేతలకు మధ్య సమన్వయం చేసేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ, జిల్లా అధ్యక్షులతో కూడిన కమిటీని పార్టీ నియమించింది. అయితే, ఈ కమిటీ ఇప్పటివరకు కనీసం ఇరువురితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. కమిటీ వచ్చెదెన్నడో.. నేతల మధ్య సమన్వయం సాధించేదెన్నడో అనే చర్చ అధికారపార్టీలో జరుగుతోంది.