ముహూర్తం మారింది
29న 5వ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్ ప్రారంభం
సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయం నుంచి పాలనా కార్యకలాపాల ముహూర్తం మారింది. ఈ నెల 27 నుంచి పాలన ప్రారంభిస్తామని గతంలో చెప్పడం తెలిసిందే. అనుకున్న సమయంలో..పనులు పూర్తి కాకపోవడంతో ముహూర్తాన్ని సీఎం మార్చారు. మరో రెండురోజులు వాయిదా వేశారు. ఈ నెల 29న ఐదవ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభిస్తామని, అదేరోజు పాలన మొదలుపెడతామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పనుల్ని ఆయన శనివారం పరిశీలించారు.
ఐదో బ్లాక్‌ను పరిశీలించి.. పనుల పురోగతి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జూలై 6న ఐదవ బ్లాక్‌లోని మొదటి అంతస్తు, 15న 2, 3, 4 బ్లాక్‌ల్లోని గ్రౌండ్‌ఫ్లోర్లు, 21వ తేదీ 2, 3, 4 బ్లాక్‌ల్లోని మొదటి అంతస్తులను ప్రారంభించి పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కుంగిన బ్లాక్‌ను పరిశీలించకుండానే వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వద్ద రెండో బ్లాక్‌లోని కుంగిన ఫ్లోర్‌ను పరిశీలించకుండానే ముఖ్యమంత్రి అక్కడ నుంచి వెనుదిరిగారు.
కుంగిన నిర్మాణంపై ప్రముఖంగా పత్రికలు రాయటం, ప్రసారం చేయడంపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అయితే దాన్ని తాజాగా ‘‘ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్నచిన్న పొరబాట్లు సహజం. అదేదో జరిగిందని భూతద్దంలో చూపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకోవటం పొరబాటు. ఏదైనా ఉంటే చెబితే సరిచేసుకుంటాం’’ అని అన్నారు. అలా అంటూనే ఆయన సాక్షిపైన, ప్రతిపక్షపార్టీపైన అక్కసును వెళ్లగక్కారు. శనివారం పనులు పరిశీలించిన సీఎం కుంగిన రెండో బ్లాక్‌లోని ఫ్లోర్‌ను పరిశీలించకుండానే వెనుదిరిగి వెళ్లిపోవటం గమనార్హం.