సచివాలయం ఐదో బ్లాకు మొదటి అంతస్తులో ఊడి పడిన సీలింగ్ (ఫైల్) , అసెంబ్లీలోని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లో ఊడిపడిన సీలింగ్(ఫైల్)
అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంతా డొల్లేనని మరోసారి రుజువైంది. స్వల్ప వర్షానికే పలుమార్లు చిల్లుపడ్డ కుండల్లా అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం మారింది. తాజాగా బుధవారం కేవలం అరగంటపాటు వీచిన ఈదురుగాలులకు అమరావతి చిగురుటాకులా వణికిపోయింది. ఉధృతంగా వీచిన గాలులకు సచివాలయంలోని టెంట్లు, స్మార్ట్ పోల్ నేలకొరిగాయి. ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సచివాలయంలోని భవనాలకు పైన వేసిన రేకులు గాలి ధాటికి ఎగిరిపోయాయి. కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేకుండా నిర్మించిన భవనాలపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి, అమరావతి బ్యూరో
మంత్రుల చాంబర్లు.. చిల్లులు పడ్డ కుండలే..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ప్రపంచం గర్వించదగ్గ సచివాలయాన్ని నిర్మించామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఇప్పటికే బట్టబయలైంది. గతంలో రెండుసార్లు కురిసిన వర్షానికి సచివాలయంలోని 4, 5 బ్లాకుల్లో ఉన్న మంత్రుల చాంబర్లలో చిల్లులు పడ్డ కుండలా నీరు కారింది. బ్లాకుల్లో సీలింగ్ ఊడి పడి.. ఫర్నీచర్ తడిసిపోయి.. ఏసీల్లోకి వర్షపు నీరు చేరడంతో సిబ్బంది విధులకు సైతం ఆటంకం ఏర్పడింది.
నిర్మాణ సంస్థపై చర్యలేవి?
అతి తక్కువ కాలంలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నారాయణ చెబుతూ వస్తున్నారు. అయితే.. వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలోని బ్లాకులకు చిల్లులు పడటంతో నిర్మాణాల్లోని డొల్లతనం రుజువైంది. వందల కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణం ఇలా కళ్లెదుటే స్వల్ప వర్షానికే కారుతూ ఉండడాన్ని చూస్తూ అక్కడి అధికారులే పెదవి విరుస్తున్నారు. 2017లో తొలిసారి చిల్లులు పడినప్పటి నుంచి ఇప్పటివరకు సీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వం.. నిర్మాణ సంస్థపై చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రాజధాని గ్రామాల రోడ్లు బురదమయం
రాజధానిలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కొన్ని గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం గమనార్హం. చిన్నపాటి వర్షానికే రాజధాని గ్రామాల రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు ఇళ్లలోకి చేరుతోంది. గతేడాది కురిసిన వర్షానికి రాయపూడిలోని ముస్లిం కాలనీ నీటమునిగింది. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చిన్నపాటి వర్షానికే ప్రతిపక్ష నేత జగన్ చాంబర్‌లో ఊడిపడిన సీలింగ్‌ను శుభ్రం చేస్తున్న సిబ్బంది (ఫైల్)
హైకోర్టు నిర్మాణంలోనూ అంతే..
ఆగమేఘాల మీద తాత్కాలిక హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సరైన భద్రతా, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. మంగళవారం కురిసిన వర్షానికి హైకోర్టు భవనంపైన ఏర్పాటు చేసిన ఇనుప షీట్లు గాలికి కొట్టుకుపోయాయి. గోడలకు అమర్చిన టైల్స్ విరిగిపోయాయి. సమీపంలోని అన్న క్యాంటీన్‌లో అద్దాలు ధ్వంసమయ్యాయి. గాలికి ఎగిరిపడిన రేకులు తగలడంతో అక్కడే పనిచేస్తున్న మహిళా కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో హైకోర్టుకు సెలవులు కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హైకోర్టు పనివేళల్లో జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికంగా పనిచేస్తున్న కూలీలు చెబుతున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే నష్టం వాటిల్లిందని అధికారులు కూడా స్పష్టం చేశారు.
కమీషన్ల కక్కుర్తితోనే లీకులు
సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలతోపాటు తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనుల అంచనాలను ప్రభుత్వం పెంచుతూ పోయింది. సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసింది. హైకోర్టుకు తొలుత రూ.98 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టగా ఆ మొత్తాన్ని రూ.150 కోట్లకు పెంచింది. కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం భారీగా పెంచిందని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలకు ప్రస్తుత సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పాటించకుండా, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
2017లో ప్రతిపక్ష నేత చాంబర్‌లోకి నీరు
2017, జూన్‌లో కురిసిన వర్షానికి సచివాలయం నిర్మాణంలో డొల్లతనం మొదటిసారిగా బయటపడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి సచివాలయం చిల్లులు పడ్డ కుండలా కారడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్‌లో లీకేజీతో భారీగా నీరు చేరింది. చాంబర్‌లో సీలింగ్ ఊడిపడడంతో ఫర్నీచర్, ఫైళ్లు తడిసిముద్దయ్యాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి వర్షపు నీరు కారడంతో అక్కడి సిబ్బంది ఆ నీటిని బకెట్లతో ఎత్తి బయటపోశారు. ఈ ఘటన తర్వాత నిర్మాణాల్లోని లోపాలు బయటపడ్డాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేసింది.
Comments
Please login to add a commentAdd a comment