Temporary assembly
-
వాన కురుస్తుంది....గాలి విరుస్తుంది!!
అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంతా డొల్లేనని మరోసారి రుజువైంది. స్వల్ప వర్షానికే పలుమార్లు చిల్లుపడ్డ కుండల్లా అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం మారింది. తాజాగా బుధవారం కేవలం అరగంటపాటు వీచిన ఈదురుగాలులకు అమరావతి చిగురుటాకులా వణికిపోయింది. ఉధృతంగా వీచిన గాలులకు సచివాలయంలోని టెంట్లు, స్మార్ట్ పోల్ నేలకొరిగాయి. ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సచివాలయంలోని భవనాలకు పైన వేసిన రేకులు గాలి ధాటికి ఎగిరిపోయాయి. కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేకుండా నిర్మించిన భవనాలపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి బ్యూరో మంత్రుల చాంబర్లు.. చిల్లులు పడ్డ కుండలే.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ప్రపంచం గర్వించదగ్గ సచివాలయాన్ని నిర్మించామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఇప్పటికే బట్టబయలైంది. గతంలో రెండుసార్లు కురిసిన వర్షానికి సచివాలయంలోని 4, 5 బ్లాకుల్లో ఉన్న మంత్రుల చాంబర్లలో చిల్లులు పడ్డ కుండలా నీరు కారింది. బ్లాకుల్లో సీలింగ్ ఊడి పడి.. ఫర్నీచర్ తడిసిపోయి.. ఏసీల్లోకి వర్షపు నీరు చేరడంతో సిబ్బంది విధులకు సైతం ఆటంకం ఏర్పడింది. నిర్మాణ సంస్థపై చర్యలేవి? అతి తక్కువ కాలంలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నారాయణ చెబుతూ వస్తున్నారు. అయితే.. వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలోని బ్లాకులకు చిల్లులు పడటంతో నిర్మాణాల్లోని డొల్లతనం రుజువైంది. వందల కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణం ఇలా కళ్లెదుటే స్వల్ప వర్షానికే కారుతూ ఉండడాన్ని చూస్తూ అక్కడి అధికారులే పెదవి విరుస్తున్నారు. 2017లో తొలిసారి చిల్లులు పడినప్పటి నుంచి ఇప్పటివరకు సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వం.. నిర్మాణ సంస్థపై చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజధాని గ్రామాల రోడ్లు బురదమయం రాజధానిలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కొన్ని గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం గమనార్హం. చిన్నపాటి వర్షానికే రాజధాని గ్రామాల రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు ఇళ్లలోకి చేరుతోంది. గతేడాది కురిసిన వర్షానికి రాయపూడిలోని ముస్లిం కాలనీ నీటమునిగింది. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే ప్రతిపక్ష నేత జగన్ చాంబర్లో ఊడిపడిన సీలింగ్‌ను శుభ్రం చేస్తున్న సిబ్బంది (ఫైల్) హైకోర్టు నిర్మాణంలోనూ అంతే.. ఆగమేఘాల మీద తాత్కాలిక హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సరైన భద్రతా, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. మంగళవారం కురిసిన వర్షానికి హైకోర్టు భవనంపైన ఏర్పాటు చేసిన ఇనుప షీట్లు గాలికి కొట్టుకుపోయాయి. గోడలకు అమర్చిన టైల్స్ విరిగిపోయాయి. సమీపంలోని అన్న క్యాంటీన్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. గాలికి ఎగిరిపడిన రేకులు తగలడంతో అక్కడే పనిచేస్తున్న మహిళా కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో హైకోర్టుకు సెలవులు కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హైకోర్టు పనివేళల్లో జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికంగా పనిచేస్తున్న కూలీలు చెబుతున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే నష్టం వాటిల్లిందని అధికారులు కూడా స్పష్టం చేశారు. కమీషన్ల కక్కుర్తితోనే లీకులు సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలతోపాటు తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనుల అంచనాలను ప్రభుత్వం పెంచుతూ పోయింది. సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసింది. హైకోర్టుకు తొలుత రూ.98 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టగా ఆ మొత్తాన్ని రూ.150 కోట్లకు పెంచింది. కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం భారీగా పెంచిందని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలకు ప్రస్తుత సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పాటించకుండా, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2017లో ప్రతిపక్ష నేత చాంబర్లోకి నీరు 2017, జూన్‌లో కురిసిన వర్షానికి సచివాలయం నిర్మాణంలో డొల్లతనం మొదటిసారిగా బయటపడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి సచివాలయం చిల్లులు పడ్డ కుండలా కారడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్లో లీకేజీతో భారీగా నీరు చేరింది. చాంబర్లో సీలింగ్ ఊడిపడడంతో ఫర్నీచర్, ఫైళ్లు తడిసిముద్దయ్యాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి వర్షపు నీరు కారడంతో అక్కడి సిబ్బంది ఆ నీటిని బకెట్లతో ఎత్తి బయటపోశారు. ఈ ఘటన తర్వాత నిర్మాణాల్లోని లోపాలు బయటపడ్డాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేసింది. -
చుట్టూ పొలాలు.. పల్లె వాతావరణం
⇒ బయట చూస్తే బాధ కలుగుతోంది ⇒ అసెంబ్లీ, సచివాలయం లోపల ఉన్నంతవరకే సంతోషం ⇒ మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: ‘తాత్కాలికంగా నిర్మించుకున్న సచివాలయం, అసెంబ్లీ భవనాల్లోపల ఉన్నంతవరకు అంతా బాగానే ఉంటోంది. కానీ బయటకు వచ్చి చూస్తే బాధకలుగుతోంది. చుట్టూ పొలాలు. పల్లె వాతావరణం. ఒక్క పెద్ద, మంచి భవనం కూడా కనిపించదు. రాజధానికి వచ్చే ఎమ్మెల్యేలకు ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఇతర సంతోషమేదీ కనిపించడం లేదు..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల తీరులో దీన్ని అభివృద్ధి పర్చాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్‌లో పదేళ్లపాటు ఉండడానికి అవకాశమున్నా రాష్ట్ర ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు అమరావతి కేంద్రంగా రాజధానిని పెట్టి పాలన కొనసాగిస్తున్నట్లు బాబు చెప్పారు. సోమవారం నూతన తాత్కాలిక అసెంబ్లీ భవనం కమిటీ హాలులో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. రెండంకెల అభివృద్ధి 15 ఏళ్లపాటు నిరంతరం కొనసాగితేనే రాష్టం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతుందని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చినా ఇంకా రోడ్లు వేయాల్సి ఉందని, రోడ్లు వేస్తేనే వారి భూమికి రేటు వస్తుందని అన్నారు. అందుకు రూ.14వేల కోట్లు కావాలని చెప్పారు. రాష్ట్ర పురోభివృద్ధికి దశదిశ చూపేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. 2022 నాటికి దేశంలో మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అగ్రగామిగా 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలన్నది తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ముఖ్యమని బాబు అన్నారు. అయితే కుల, మత, ప్రాంతాల పేరిట కొందరు విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాయకుడు సరిగా లేకపోతే ఏమవుతుందో, శాంతిభద్రతలు క్షీణిస్తే ఏర్పడే పరిస్థితులకు ప్రస్తుతం అమెరికా అద్దం పడుతోందని చెప్పారు. బ్యాంకు ఖాతాదారులపై పెనాల్టీలు సరికాదు: బ్యాంకు ఖాతాల్లో కనిష్ట బ్యాలెన్సు ఆంక్షలు, నగదు లావాదేవీలపై పరిమితి విధించి ఖాతాదారులపై పెనాల్టీలు వేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. నగదు రహిత లావాదేవీల అధ్యయన కమిటీ చైర్మన్‌గా తాను సమర్పించిన నివేదికలోని సిఫారసులకు ఇది వ్యతిరేకమన్నారు. ఇలా చేస్తే ఖాతాదారులు బ్యాంకులకు దూరమవుతారని చెప్పారు. ఇలాంటి కండిషన్లు పెడితే ప్రజలు తమ డబ్బును ఇళ్లలోనే ఉంచుకోవలసి వస్తుందని, దీనివల్ల బ్యాంకులు నష్టపోతాయని పేర్కొన్నారు. -
కొత్త అసెంబ్లీకి మకిలి అంటకుండా చూడండి
-
ప్రజాస్వామ్యం నవ్వులపాలు
శాసన సభ స్పీకర్‌కు వైఎస్ జగన్ ఘాటు లేఖ ⇒ తాత్కాలిక అసెంబ్లీ భవనంలోకి అడుగు పెడుతున్న శుభ సమయంలో మా నుంచి దొంగిలించిన ఎమ్మెల్యేలను సీఎం తీసుకెళ్తారా? ⇒ కొత్త అసెంబ్లీకి మకిలి అంటకుండా చూడండి.. అది మీ చేతుల్లోనే ఉంది సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ నుంచి వందల కోట్ల రూపాయలు వెచ్చించి టీడీపీలో చేర్చు కున్న ఎమ్మెల్యేలతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న ఈ శుభ సమ యంలో దొంగిలించిన ఎమ్మెల్యేలను తీసు కెళ్లడం ఏమిటని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. ఇలా దొంగ సొత్తుతో చంద్రబాబు అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించాల్సిన బాధ్యత స్పీకర్ చేతుల్లోనే ఉందని అన్నారు. జగన్ సోమవారం ఈ మేరకు ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు ఒక ఘాటైన బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖను పార్టీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, ఆదిమూలపు సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారికి అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీలోకి వెళ్లబోతున్న ఈ సమయంలో, ఎమ్మెల్యేలు కొత్త ఇంటిలోకి కాలు పెడుతున్న ఈ శుభ సందర్భంలో.. ఇందుకు దారితీసిన పరిస్థితులను మీకు గుర్తు చేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవడం వల్లే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిన విషయం మీకు తెలుసు. తన పార్టీకి చెందని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దొంగతనమే కదా? ► హెదరాబాద్లో అసెంబ్లీ ఉండగా ఆయన చేసిన మరో దొంగతనం మా పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు తన పార్టీ కండువాలు కప్పటం, ఇందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించటం. ► ఈ 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం దొంగ సొత్తే. వీరిని అనర్హులుగా ప్రక టించండి అని ఏనాడో అడిగినా ఇంతవరకూ మీరు నిర్ణయం తీసుకోకపోవటంగానీ, వారిని సభలోకి అనుమతించడంగానీ ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేయడమే. ► ఒక దొంగతనంలో దొరికి హైదరాబాద్ అసెంబ్లీని ఖాళీ చేసిన ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు రెండో దొంగతనం సొత్తుతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించటం అన్నది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ► ఇది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య బద్ధంగా స్పీకర్ పదవికి ఉన్న గౌరవం దృష్ట్యా మీ బాధ్యత. మీ బాధ్యతను తక్షణం మీరు నిర్వర్తించి, పార్టీ మారిన 21 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను అనర్హులను చేసి కొత్త రాజధానిలో కొత్త సభకు మకిలి అంటకుండా ఆపాలని ఈ బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నాం. ► మీరు ఎంత తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యులు అయినా రాజ్యాంగానికి, ప్రజల తీర్పునకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అభినందనలతో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు నీతులు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీలో మంత్రిగా చేరాలను కున్నప్పుడు కనీసం రాజీనామా చేయాలి... ... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నీ కేబెనెట్లో మంత్రిగా ఉండటం నీకు బాధగా లేదా? (తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరుతున్న సంద ర్భంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు) వెంకయ్య మాటలు : ఒక పార్టీ గుర్తుతో గెలిచిన వాళ్లు వేరే పార్టీలోకి వెళ్లి కూర్చుంటున్నారు. దర్జాగా వేరే పార్టీ కండువాలు కప్పుకొంటున్నారు. బహిరంగ వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారు. వేరే పార్టీలోకి వెళ్లి మంత్రి పదవి చేపడుతున్నారు. ఇంత చేస్తున్నా.. వారిపై అనర్హత వేటు పడటంలేదు. అందుకే ఈ ఫిరాయింపుల చట్టంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. (ఫిరాయింపులపై పార్లమెంటు వద్ద విలేకరులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు) -
జూన్ 15 నాటికి 4,500 మంది తరలింపు
రెండో దశలో మరో 3 వేల మందిని తరలిస్తాం: మంత్రి నారాయణ సాక్షి, విజయవాడ బ్యూరో: హైదరాబాద్ నుంచి అమరావతికి తొలి విడతలో జూన్ 15 నాటికి 4,500 మంది ఉద్యోగులను మాత్రమే తరలిస్తున్నట్లు మంత్రి పి.నారాయణ చెప్పారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదట ఆరువేల మంది ఉద్యోగులను తరలించాలని భావించినా, సాంకేతిక కారణాల వల్ల 4,500 మందినే తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూలై చివరి నాటికి మరో 3వేల మందిని తరలించాలని సీఎం సూచించారని చెప్పారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులు వేగంగా జరుగుతున్నాయని, దీనిపై మరో రెండంతస్తులు అదనంగా నిర్మిస్తామన్నారు. మొదట జీ+1 నిర్మాణాలు చేపట్టాలని అంతవరకే టెండర్లు పిలిచి పనులు అప్పగించామని కానీ ప్రస్తుత అవసరాల రీత్యా మరో రెండు అంతస్తులు అదనంగా నిర్మించాలని నిర్ణయించామని వివరించారు. వీటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. తాత్కాలిక అసెంబ్లీ కోసం సచివాలయ ప్రాంగణంలో నిర్మించే ఆరో భవనం ఇంటీరియర్ ప్లాన్‌ను స్పీకర్, మండలి చైర్మన్ సహా ముఖ్యులు చూసి ఆమోదించారని, దాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలను అక్కడే నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీకి రూ.12 కోట్లు
- తుళ్లూరులో సమావేశాల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన స్పీకర్ కోడెల సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు అనువుగా తాత్కాలిక భవనాల నిర్మాణానికి సుమారు రూ. 12 కోట్లు వ్యయం అవుతుందని రహదారులు, భవనాల శాఖ అధికారులు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు వివరించారు. డిసెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే కనీసం వారం పది రోజులు ముందుగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని, అంత తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి చేయటం కష్ట సాధ్యమని నివేదించారు. శనివారం స్పీకర్ కోడెల అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్లో తుళ్లూరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. శ్యాంబాబ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం, సెంట్రల్ బిల్డింగ్ వర్క్స్ ఈఈ మహేశ్వర్‌రెడ్డి, గుంటూరు జిల్లా ఎస్ఈ రాఘవేందర్రావు, అసెంబ్లీ తాత్కాలిక కార్యదర్శి సత్యనారాయణ, సభాపతి కోడెల ఓఎస్డీ గురుమూర్తి, వ్యక్తిగత కార్యదర్శి చౌదరి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు మూడు నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలిక శాసనసభ నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి సవివరంగా ఒక నివేదిక ఇవ్వాలని స్పీకర్ కోడెల నిర్ణయించారు. వివిధ సంస్థలు అందచేసిన వ్యయ వివరాలను ఇందులో పొందు పరచనున్నారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయాన్ని సీఎం నారా చంద్రబాబునాయుడుకు వదిలిపెట్టాలని నిర్ణయించారు. సీఎం కూడా తుళ్లూరులో సమావేశాల నిర్వహణకు అంత ఆశక్తిగా లేనట్లు సమాచారం. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే నామినేషన్ పద్ధతిలో కాకుండా టెండర్ల ద్వారా పనులు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమంలో సేవలు అదించించిన కేఎంకే సంస్థ కూడా తాత్కాలిక నిర్మాణాలు తాము చేపడతామని, తమకు సభ్యులకు రవాణా సౌకర్యం కల్పన, ఆహార ఏర్పాట్లలో ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పనులను చేపడదామని సమావేశంలో స్పీకర్ సూచించారు. జర్మనీ వెళ్లనున్న వెళ్లనున్న స్పీకర్ ఏపీ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నవంబర్‌లో జర్మనీలో పర్యటించనున్నారు. నవంబర్ రెండో తే దీ నుంచి వారం రోజుల పాటు ఆయన జర్మనీలో పర్యటిస్తారని స్పీకర్ కార్యాలయవర్గాలు తెలిపాయి.