
జూన్ 15 నాటికి 4,500 మంది తరలింపు
రెండో దశలో మరో 3 వేల మందిని తరలిస్తాం: మంత్రి నారాయణ
సాక్షి, విజయవాడ బ్యూరో: హైదరాబాద్ నుంచి అమరావతికి తొలి విడతలో జూన్ 15 నాటికి 4,500 మంది ఉద్యోగులను మాత్రమే తరలిస్తున్నట్లు మంత్రి పి.నారాయణ చెప్పారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదట ఆరువేల మంది ఉద్యోగులను తరలించాలని భావించినా, సాంకేతిక కారణాల వల్ల 4,500 మందినే తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూలై చివరి నాటికి మరో 3వేల మందిని తరలించాలని సీఎం సూచించారని చెప్పారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులు వేగంగా జరుగుతున్నాయని, దీనిపై మరో రెండంతస్తులు అదనంగా నిర్మిస్తామన్నారు.
మొదట జీ+1 నిర్మాణాలు చేపట్టాలని అంతవరకే టెండర్లు పిలిచి పనులు అప్పగించామని కానీ ప్రస్తుత అవసరాల రీత్యా మరో రెండు అంతస్తులు అదనంగా నిర్మించాలని నిర్ణయించామని వివరించారు. వీటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. తాత్కాలిక అసెంబ్లీ కోసం సచివాలయ ప్రాంగణంలో నిర్మించే ఆరో భవనం ఇంటీరియర్ ప్లాన్‌ను స్పీకర్, మండలి చైర్మన్ సహా ముఖ్యులు చూసి ఆమోదించారని, దాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలను అక్కడే నిర్వహిస్తామని పేర్కొన్నారు.