
చుట్టూ పొలాలు.. పల్లె వాతావరణం
⇒ బయట చూస్తే బాధ కలుగుతోంది
⇒ అసెంబ్లీ, సచివాలయం లోపల ఉన్నంతవరకే సంతోషం
⇒ మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘తాత్కాలికంగా నిర్మించుకున్న సచివాలయం, అసెంబ్లీ భవనాల్లోపల ఉన్నంతవరకు అంతా బాగానే ఉంటోంది. కానీ బయటకు వచ్చి చూస్తే బాధకలుగుతోంది. చుట్టూ పొలాలు. పల్లె వాతావరణం. ఒక్క పెద్ద, మంచి భవనం కూడా కనిపించదు. రాజధానికి వచ్చే ఎమ్మెల్యేలకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కానీ ఇతర సంతోషమేదీ కనిపించడం లేదు..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల తీరులో దీన్ని అభివృద్ధి పర్చాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్‌లో పదేళ్లపాటు ఉండడానికి అవకాశమున్నా రాష్ట్ర ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు అమరావతి కేంద్రంగా రాజధానిని పెట్టి పాలన కొనసాగిస్తున్నట్లు బాబు చెప్పారు.
సోమవారం నూతన తాత్కాలిక అసెంబ్లీ భవనం కమిటీ హాలులో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. రెండంకెల అభివృద్ధి 15 ఏళ్లపాటు నిరంతరం కొనసాగితేనే రాష్టం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతుందని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చినా ఇంకా రోడ్లు వేయాల్సి ఉందని, రోడ్లు వేస్తేనే వారి భూమికి రేటు వస్తుందని అన్నారు. అందుకు రూ.14వేల కోట్లు కావాలని చెప్పారు. రాష్ట్ర పురోభివృద్ధికి దశదిశ చూపేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. 2022 నాటికి దేశంలో మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అగ్రగామిగా 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలన్నది తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ముఖ్యమని బాబు అన్నారు. అయితే కుల, మత, ప్రాంతాల పేరిట కొందరు విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాయకుడు సరిగా లేకపోతే ఏమవుతుందో, శాంతిభద్రతలు క్షీణిస్తే ఏర్పడే పరిస్థితులకు ప్రస్తుతం అమెరికా అద్దం పడుతోందని చెప్పారు.
బ్యాంకు ఖాతాదారులపై పెనాల్టీలు సరికాదు: బ్యాంకు ఖాతాల్లో కనిష్ట బ్యాలెన్సు ఆంక్షలు, నగదు లావాదేవీలపై పరిమితి విధించి ఖాతాదారులపై పెనాల్టీలు వేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. నగదు రహిత లావాదేవీల అధ్యయన కమిటీ చైర్మన్‌గా తాను సమర్పించిన నివేదికలోని సిఫారసులకు ఇది వ్యతిరేకమన్నారు. ఇలా చేస్తే ఖాతాదారులు బ్యాంకులకు దూరమవుతారని చెప్పారు. ఇలాంటి కండిషన్లు పెడితే ప్రజలు తమ డబ్బును ఇళ్లలోనే ఉంచుకోవలసి వస్తుందని, దీనివల్ల బ్యాంకులు నష్టపోతాయని పేర్కొన్నారు.