
తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీకి రూ.12 కోట్లు
- తుళ్లూరులో సమావేశాల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన స్పీకర్ కోడెల
సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు అనువుగా తాత్కాలిక భవనాల నిర్మాణానికి సుమారు రూ. 12 కోట్లు వ్యయం అవుతుందని రహదారులు, భవనాల శాఖ అధికారులు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు వివరించారు. డిసెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే కనీసం వారం పది రోజులు ముందుగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని, అంత తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి చేయటం కష్ట సాధ్యమని నివేదించారు. శనివారం స్పీకర్ కోడెల అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్‌లో తుళ్లూరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. శ్యాంబాబ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం, సెంట్రల్ బిల్డింగ్ వర్క్స్ ఈఈ మహేశ్వర్‌రెడ్డి, గుంటూరు జిల్లా ఎస్‌ఈ రాఘవేందర్‌రావు, అసెంబ్లీ తాత్కాలిక కార్యదర్శి సత్యనారాయణ, సభాపతి కోడెల ఓఎస్‌డీ గురుమూర్తి, వ్యక్తిగత కార్యదర్శి చౌదరి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు మూడు నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలిక శాసనసభ నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి సవివరంగా ఒక నివేదిక ఇవ్వాలని స్పీకర్ కోడెల నిర్ణయించారు. వివిధ సంస్థలు అందచేసిన వ్యయ వివరాలను ఇందులో పొందు పరచనున్నారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయాన్ని సీఎం నారా చంద్రబాబునాయుడుకు వదిలిపెట్టాలని నిర్ణయించారు.
సీఎం కూడా తుళ్లూరులో సమావేశాల నిర్వహణకు అంత ఆశక్తిగా లేనట్లు సమాచారం. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే నామినేషన్ పద్ధతిలో కాకుండా టెండర్ల ద్వారా పనులు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమంలో సేవలు అదించించిన కేఎంకే సంస్థ కూడా తాత్కాలిక నిర్మాణాలు తాము చేపడతామని, తమకు సభ్యులకు రవాణా సౌకర్యం కల్పన, ఆహార ఏర్పాట్లలో ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పనులను చేపడదామని సమావేశంలో స్పీకర్ సూచించారు. జర్మనీ వెళ్లనున్న వెళ్లనున్న స్పీకర్ ఏపీ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నవంబర్‌లో జర్మనీలో పర్యటించనున్నారు. నవంబర్ రెండో తే దీ నుంచి వారం రోజుల పాటు ఆయన జర్మనీలో పర్యటిస్తారని స్పీకర్ కార్యాలయవర్గాలు తెలిపాయి.