
పశువుల్లా ఎమ్మెల్యేల కొనుగోలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి ధ్వజం
కోడుమూరు రూరల్: సంతలో పశువుల బేరం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోబాలకు గురిచేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్)వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డబ్బున్నోడిదే రాజ్యమైందని చెప్పారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట సాధనే లక్ష్యంగా చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా బెరైడ్డి రాజశేఖరరెడ్డి మంగళవారం కోడుమూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సమర్థమైన పాలన అందించలేక ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, కోట్లరూపాయాలు ఎరగా వేస్తున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి వ్యవహర తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఏదో ఓ రోజు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజా పాలన మరిచి రాజధాని పేరుతో ఇప్పటికే కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. రుణమాఫీ హామీని బాబు నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగిపోయాయన్నారు. విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ నుంచి పాలన సాగించాలని ఉన్నా, రియల్‌ఎస్టేట్ వ్యాపారం కోసం బాబు రాజధానిని అమరావతికి మార్చరన్నారు.
ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ధి
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంతోనే సీమ అభివృద్ధి సాధ్యమని ఆర్‌పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి అన్నారు. చైతన్య యాత్రలో భాగంగా బైరెడ్డి బస్సు యాత్ర మంగళవారం మండలంలోని ప్యాలకుర్తి, కొత్తూరు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాల్లో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. చెంతనే నీరున్నా వినియోగించుకోలేని దురదృష్టం మనదన్నారు. దీనికంతంటికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కార్యక్రమంలో రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు కృష్ణయ్య, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.