
కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
నరసరావుపేట రూరల్/నరసరావుపేట వెస్ట్: బీసీలకు ఒక్క శాతం కూడా అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో శ్రీకృష్ణదేవరాయ అన్నదాన సత్రంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాపులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిటీ తొమ్మిది నెలల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కాపు కార్పోరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి ఎంతో చరిత్ర ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోటప్పకొండను పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
‘సాక్షి’పై ముఖ్యమంత్రి అక్కసు : రాజధానిలో భూకుంభకోణంపై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు యథావిధిగా తమ అక్కసు వెళ్లగక్కారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో శుక్రవారం వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు.
ముద్రగడ రమ్మంటేనే చర్చలకు వెళ్లాం: సీఎం బాబు
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం ఆహ్వానిస్తేనే ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్లి దీక్షను విరమింప చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ముద్రగడ తాజా ప్రకటనలపై చర్చించారు. ఈసారి ఉద్యమం చేస్తే పార్టీ నేతలు, కాపులు ఎవ్వరూ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కాపు ద్రోహులుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలని చంద్రబాబు సూచించారు.