Farmer reservation
-
కాపు రిజర్వేషన్లు సాధించే వరకూ కదనమే
* ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతా * కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ * ఉద్యమంలో గాయపడ్డ మహిళలకు పరామర్శ పి.గన్నవరం: కాపు రిజర్వేషన్లను సాధించేవరకూ ఉద్యమాన్ని వదిలే ప్రసక్తి లేదని, ఊపిరి ఉన్నంత వరకూ పోరాటం సాగిస్తానని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన గడువు వరకూ వేచి చూద్దామని, అంతవరకూ సంయమనం పాటించాలని సామాజిక వర్గీయులకు సూచించారు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన దీక్ష సందర్భంగా జరిగిన ఉద్యమంలో బోడపాటివారిపాలెంకు చెందిన ఐదుగురు మహిళలు పోలీసుల చేతిలో గాయపడ్డారు. ముద్రగడ సోమవారం బోడపాటిపాలెం వచ్చి గాయపడ్డ మహిళలను పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తాను ఆమరణదీక్ష చేసిన సమయంలో ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపించే విధంగా పోలీసు బందోబస్తుతో ఉద్యమాన్ని అపేందుకు ప్రయత్నించినా, బోడపాటివారిపాలెం మహిళలు ముందుగా రోడ్డు మీదకు వచ్చి పోరాడిన తీరును మర్చిపోలేనన్నారు. మహిళలను, గ్రామస్తులను అభినందించారు. దీక్ష చేసిన 14 రోజులపాటు తనకు లభించిన మద్దతుకు రుణపడి ఉంటానన్నారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగిద్దామని, వారంతా తనకు మద్దతుగా నిలవాలని అన్నారు. కాపు ఉద్యమ జేఏసీ నాయకుడు మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ, ముద్రగడకు మద్దతుగా జిల్లాలోనే పి.గన్నవరం మండలంలో పెద్దఎత్తున ఉద్యమం చేశారన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ వెంటే పయనిద్దామని మోహన్ పిలుపునిచ్చారు. మోహనరంగాకు నివాళి తొలుత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహానికి ముద్రగడ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కాపు రిజర్వేషన్ పోరాటసమితి నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, జక్కంపూడి వాసు, సూదా గణపతి, నల్లా పవన్, టీబీకే నాయకులు కొమ్మూరి మల్లిబాబు, అడ్డగళ్ల వెంకటసాయిరామ్, ఉలిశెట్టి బాబీ, బీవీ పాలెం గ్రామస్తులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. -
సలహాలు చాలు, ఆచరణకు సిద్ధం కండి!
కాపు రిజర్వేషన్ల పోరాట సమితి పిలుపు సాక్షి, హైదరాబాద్: కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మేధావుల నుంచి తాము ఇప్పటికే గణనీయంగా సూచనలు,సలహాలు స్వీకరించామని ఇకపై సూచనలు, సలహాలతో కాలయాపన చేయకుండా ఆచరణ దిశగా అడుగులు వేయాలని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి తమ మేధావులు, క్రియాశీల కార్యకర్తలు, ఐటీ, న్యాయవాద రంగ ప్రముఖులకు పిలుపునిచ్చింది. బీసీ కమిషన్ చైర్మన్ మంజూనాధ్తో పాటు కమిషన్ సభ్యులు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నందున తమ జాతి సమాచారాన్ని అక్షర బద్ధం చేసి సమర్పించేందుకు సిద్ధంగా ఉంచాలని విజ్ఞప్తి చేసింది. బీసీ కమిషన్‌కు సమర్పించాల్సిన నివేదికల తయారీకి రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీని నియమించనున్నట్టు ప్రకటించింది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం- భవిష్యత్ కార్యాచరణపై గత రెండు మూడు నెలలుగా వివిధ వర్గాలను సంప్రదించిన అనంతరం తామీ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. ఈమేరకు పోరాట సమితి తరఫున ఎ.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి నరసరావుపేట రూరల్/నరసరావుపేట వెస్ట్: బీసీలకు ఒక్క శాతం కూడా అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో శ్రీకృష్ణదేవరాయ అన్నదాన సత్రంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాపులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిటీ తొమ్మిది నెలల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కాపు కార్పోరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి ఎంతో చరిత్ర ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోటప్పకొండను పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘సాక్షి’పై ముఖ్యమంత్రి అక్కసు : రాజధానిలో భూకుంభకోణంపై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు యథావిధిగా తమ అక్కసు వెళ్లగక్కారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో శుక్రవారం వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. ముద్రగడ రమ్మంటేనే చర్చలకు వెళ్లాం: సీఎం బాబు సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం ఆహ్వానిస్తేనే ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్లి దీక్షను విరమింప చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ముద్రగడ తాజా ప్రకటనలపై చర్చించారు. ఈసారి ఉద్యమం చేస్తే పార్టీ నేతలు, కాపులు ఎవ్వరూ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయనతో పాటు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని కాపు ద్రోహులుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలని చంద్రబాబు సూచించారు.