కాపు రిజర్వేషన్లు సాధించే వరకూ కదనమే | Farmer reservation to Former minister mudragada | Sakshi
Sakshi News home page

కాపు రిజర్వేషన్లు సాధించే వరకూ కదనమే

Published Tue, Jul 5 2016 8:33 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

Farmer reservation to Former minister mudragada

* ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతా
* కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ
* ఉద్యమంలో గాయపడ్డ మహిళలకు పరామర్శ

పి.గన్నవరం: కాపు రిజర్వేషన్లను సాధించేవరకూ ఉద్యమాన్ని వదిలే ప్రసక్తి లేదని, ఊపిరి ఉన్నంత వరకూ పోరాటం సాగిస్తానని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన గడువు వరకూ వేచి చూద్దామని, అంతవరకూ సంయమనం పాటించాలని సామాజిక వర్గీయులకు సూచించారు.

తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన దీక్ష సందర్భంగా జరిగిన ఉద్యమంలో బోడపాటివారిపాలెంకు చెందిన ఐదుగురు మహిళలు పోలీసుల చేతిలో గాయపడ్డారు. ముద్రగడ సోమవారం బోడపాటిపాలెం వచ్చి గాయపడ్డ మహిళలను పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తాను ఆమరణదీక్ష చేసిన సమయంలో ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపించే విధంగా పోలీసు బందోబస్తుతో ఉద్యమాన్ని అపేందుకు ప్రయత్నించినా, బోడపాటివారిపాలెం మహిళలు ముందుగా రోడ్డు మీదకు వచ్చి పోరాడిన తీరును మర్చిపోలేనన్నారు.

మహిళలను, గ్రామస్తులను అభినందించారు. దీక్ష చేసిన 14 రోజులపాటు తనకు లభించిన మద్దతుకు రుణపడి ఉంటానన్నారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగిద్దామని, వారంతా తనకు మద్దతుగా నిలవాలని అన్నారు. కాపు ఉద్యమ జేఏసీ నాయకుడు మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ, ముద్రగడకు మద్దతుగా జిల్లాలోనే పి.గన్నవరం మండలంలో పెద్దఎత్తున ఉద్యమం చేశారన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ వెంటే పయనిద్దామని మోహన్ పిలుపునిచ్చారు.
 
మోహనరంగాకు నివాళి
తొలుత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహానికి ముద్రగడ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కాపు రిజర్వేషన్ పోరాటసమితి నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, జక్కంపూడి వాసు, సూదా గణపతి, నల్లా పవన్, టీబీకే నాయకులు కొమ్మూరి మల్లిబాబు, అడ్డగళ్ల వెంకటసాయిరామ్, ఉలిశెట్టి బాబీ, బీవీ పాలెం గ్రామస్తులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement