చెప్పింది వినాల్సిందే!
► ఆక్వా ఫుడ్ పార్క్‌ను అడ్డుకోవద్దన్న సీఎం చంద్రబాబు
►‘ఏరువాక’లో రైతులకు వాత పెట్టేలా ప్రసంగం
► ప్రజల మనోభావాలకు పాతర
►కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ
► పరిశ్రమల్ని అడ్డుకుంటే ఎలాగని నిలదీత
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘రైతన్న సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తాం. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రైతులు సాగు ప్రారంభించింది మొదలు పంటలను మార్కెట్‌లో విక్రయించే వరకూ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది..’ అంటూ రైతులను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ధాన్యానికి మద్దతు ధర పెంచే విషయంలో మాత్రం నోరు మెదపలేదు. కనీసం మద్దతు ధరపై రాష్ట్రం తరఫున బోనస్ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించలేదు. ధాన్యం పంట ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీపై స్పందించలేదు. పైగా తాను చెప్పిందే వేదమన్నట్టు.. ఏది చెబితే అది రైతు లు వినాల్సిందే అన్నట్టు అన్నదాతల నెత్తిన ఆక్వా పార్క్ పిడుగు వేశారు. పంటల్ని మింగేసే ఆక్వా పార్క్ నిర్మాణాన్ని తుందుర్రులో చేపట్టవద్దని.. తప్పదంటే సముద్ర తీరంలో భూములు కేటాయించి అక్కడకు తరలించాలని రైతులు కోరుతుంటే.. ‘తప్పదు భరించాల్సిందే’నంటూ హితబోధ చేశారు.
భారీ ఉద్యమం సాగినా..
డెల్టా ప్రాంతంలో భారీ ఉద్యమానికి కారణమైన ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అనుకూలంగా ముఖ్యమంత్రి మరోసారి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. రూ. 200 కోట్ల వ్యయంతో భీమవరం మండలం తుందుర్రు గ్రామ పరిసరాల్లో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు, ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదంటూ గతంలో ఒకసారి ముఖ్యమంత్రి ప్రకటన చేయగా, ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల ప్రజలు మరోసారి ఉద్యమాలకు పూనుకున్నారు. తాత్కాలికంగా పనులు నిలిచిపోవడంతో ప్రజలు కొంత శాంతించారు. ఈ నేపథ్యంలో సోమవారం నరసాపురం మండలం చిట్టవరంలో ఏరువాక కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మళ్లీ ఫుడ్‌పార్క్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫుడ్‌పార్క్‌ను అడ్డుకోవద్దని కోరారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందాలని, పరిశ్రమలు వస్తే అడ్డుకోవడం తగదని హితబోధ చేశారు. ‘కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుందాం. అందులో వచ్చిన నీటిని ప్రాసెసింగ్ చేసి నేరుగా సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకుందాం. దీన్ని అడ్డుకోవద్దు’ అని సీఎం కోరారు. లక్షలాది ప్రజలు వ్యతిరేకిస్తున్న ఈ పరిశ్రమపై ముఖ్యమంత్రి అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జనం ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..
గ్రామాల మధ్య ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల జల, వాయు కాలుష్యాలు అధికమై తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందని భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల రైతులు, ప్రజలు ఏడాది కాలంగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. భీమవరం మండలం తుందుర్రులో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ పనులకు టీడీపీకి చెందిన కొందరు నేతలు గత ఏడాది శ్రీకారం చుట్టారు. ప్రజల జీవనానికి తీవ్ర విఘాతం కల్పించే ఆక్వా ఫుడ్‌పార్క్‌ను నిలిపివేయాలని, గ్రామాలకు దూరంగా దీనిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల డిమాండ్‌ను పార్క్ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో తుందుర్రుతోపాటు జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల ప్రజలతోపాటు భీమవరం, నరసాపు రం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని సుమారు 40గ్రామాల ప్రజలు పనులు నిలిపివేయాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు.
పార్క్ అవసరాలకు నీటిని విపరీతంగా వినియోగిం చడం వల్ల పరిసర ప్రాంతాల్లో సాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని, రొయ్యల శుభ్రతకు ఉపయోగించే కలుషిత నీరు డ్రెయిన్స్‌లో కలవడం వల్ల అందులో ఉండే చేపలు చనిపోయి మత్య్సకారులకు ఇబ్బందులు ఏర్పడతాయనేది వారి ఆందోళన. ఫుడ్ పార్క్‌లో నిత్యం టన్నులకొద్దీ అమోనియా వాడతారని, దానిని నీటిలోకి వదలడం వల్ల జల వనరులు ఎందుకూ పనికిరావని ఆ ప్రాంత ప్రజ లు చెబుతున్నారు. దీనిపై హైదరాబాద్‌కు చెందిన ప్రేరణ ఫౌండేషన్ మాన వ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిం చింది. దీనిని ఆపడం కోసం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గతంలో సీఎంను కలిసి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాధవనాయుడి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఫుడ్‌పార్క్‌ను అడ్డుకోవద్దని కోరడం చర్చనీయాంశం అయ్యింది.