వారి కోసం ఏం చేశారు?
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ రఘువీరారెడ్డి
అనంతపురం సెంట్రల్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. దళితులకు, గిరిజనులకు, మైనార్టీ ప్రజలకు ఏమైనా చేశావా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. గిరిజనులు, మైనార్టీ వర్గాల వారికి మంత్రి పదవులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత యాత్ర (బస్సుయాత్ర) ఆదివారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలో స్థానిక కేఎస్‌ఆర్ బాలికల కళాశాల ఎదుట బహిరంగసభ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు కోసం పెద్ద మాదిగను నేనవుతా అంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఏం చే శాడని ప్రశ్నించారు.
మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావిస్తే బీజేపీ దాని అనుబంధ ఆర్‌ఎస్‌ఎస్ కోర్టుకు పోయి రద్దు పరిచాయని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి దళిత, గిరిజనుల, మైనార్టీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని, సంచులతో డబ్బులు మోస్తాడని నారాయణకు, వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఆర్థిక నేరగాడుగా ముద్రపడిన సుజనాచౌదరికి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, నాగరాజరెడ్డి, ఎస్టీసెల్ రాష్ర్ట అధ్యక్షులు సుధాకర్‌బాబు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మైనార్టీ సెల్ రాష్ట అధ్యక్షులు అలీఖాన్, డీసీసీ నగర అధ్యక్షులు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు.