సాక్షి, అమరావతి : విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో గిరిజన విద్యార్థులను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. చాలా మందిని సికిల్‌సెల్ ఎనీమియా పీడిస్తోంది. ఇప్పటివరకు ఆంత్రాక్స్, టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో నానా అవస్థలు పడిన గిరిజనులు ఇప్పుడు తమ పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లలకే కాకుండా పెద్దలను కూడా సికిల్‌సెల్ ఎనీమియా చుట్టుముట్టింది.
తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి, లేదా వంశపారంపర్యంగా ఉంటే తప్పకుండా ఇది పిల్లలకు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఐటీడీఏ పరిధిలో పిల్లలు చిక్కిపోతుండడంతో 11 మండలాల్లోని 40,300 గిరిజన విద్యార్థులకు సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 14,073 మంది దీనిబారిన పడినట్లు అనుమానించిన అధికారులు హెచ్‌బీ–ఎస్ ఎలక్ట్రోపోలోసిస్ పరీక్ష చేయడంతో 576 మందికి సికిల్‌సెల్ ఎనీమియా ఉన్నట్లు నిర్థారించారు. వీరిలో 315 మంది బాలురు, 261 మంది బాలికలు ఉన్నారు.
ప్రాణాంతకమైన సికిల్‌సెల్ ఎనీమియా, సికిల్ తలసీమియా వ్యాధులకు శాశ్వత నివారణ లేకపోవడంతో రోగుల్లో అవగాహన పెంచడం ద్వారానే వ్యాధి తీవ్రతను తగ్గించగలమని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా అదనపు పోషకాహారం, శరీరంలో ఐరన్ శక్తి తగ్గకుండా ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి, సి మాత్రలతో పాటు విటమిన్లు ఉండే ఆహారం రోగులకు అందించాల్సి ఉంటుంది.
ఆస్పత్రుల్లో మందుల్లేవు
ఏజెన్సీ ఏరియాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఐరన్ ఫోలిక్ సప్లిమెంటేషన్ (ఐఎఫ్‌ఏ) టానిక్, ఐరన్ మాత్రలు, బీ కాంప్లెక్స్‌తో పాటు విటమిన్–సీ, కాల్షియం మాత్రలు ఆస్పత్రుల్లో లేకపోవడంతో పిల్లలకు ఇవ్వడంలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. పాడేరు ప్రాంతంలో ఉన్న అనేక గిరిజన గూడేలు ఆస్పత్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో పేద గిరిజనులకు వైద్యం అందని ద్రాక్ష అవుతోంది.
పోషక విలువల ఆహారం ముఖ్యం
సాధారణంగా రక్త కణాలు చంద్రాకారంలో ఉండాలి. కానీ సికిల్‌సెల్ ఎనీమియా ఉన్న వారికి అవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. రక్తకణం పూర్తిస్థాయిలో ఉండదు కాబట్టి రక్త ప్రసారంలో కణం అడ్డుపడే అవకాశం ఉందని, రక్తం చేరాల్సిన ప్రదేశాలకు చేరకపోతే మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని అలక్ష్యం చేయకూడదని, నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం తినాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
మూడు శాఖలతో సమన్వయం
చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన ఆహారంపై గిరిజన సంక్షేమ శాఖ.. విద్యా, వైద్య–ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో ప్రతినెలా మొదటి గురువారం నాడు ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిని ఫోకసింగ్ రిసోర్స్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ హెల్త్ (ఎఫ్‌ఆర్‌ఈఎస్‌హెచ్) కార్యక్రమంగా పిలుస్తారు. మొత్తం తొమ్మిది కార్యక్రమాల ద్వారా ఆదివాసీ పిల్లల ఆరోగ్యంపై నాలుగు శాఖల అధికారులు దృష్టి పెడతారు.
ఇందుకు సంబంధించి స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్ ఏప్రిల్ 26న అన్ని స్కూళ్లకు సర్క్యులర్ పంపించింది. రక్తహీనత ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు మందులు, ప్రత్యేక ఆహారం ఇస్తున్నారా? లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. కాగా, మందుల కొనుగోలుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తీసుకున్న తరువాతే కొనుగోలు చేయాలనే నిబంధన ఉండటంతో వారు సహకరించడంలేదని గిరిజన సంక్షేమ శాఖ ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment