రక్తహీనత నివారణలో ఏపీ భేష్‌ | Andhra Pradesh ranks first in country in anemia control Prevention | Sakshi
Sakshi News home page

రక్తహీనత నివారణలో ఏపీ భేష్‌

Published Fri, Mar 22 2024 5:40 AM | Last Updated on Fri, Mar 22 2024 5:53 AM

Andhra Pradesh ranks first in country in anemia control Prevention - Sakshi

ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, సిరప్‌ పంపిణీలో దేశంలోనే అగ్రస్థానం 

చిన్న పిల్లల, బాలింతల్లో 89 శాతం మందికి పంపిణీ 

రెండో స్థానంలో తమిళనాడు

జాతీయ సగటు 58.8 శాతం

ఎనీమియా ముక్త్‌ భారత్‌ 2023–24 నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: రక్తహీనత (ఎనీమియా) నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆరు నెలల శిశువు నుంచి చిన్న పిల్లలు, యువత, గర్భిణులు, బాలింతలు రక్తహీనత నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వేసిన అడుగులు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపాయి. ఎనీమియా ముక్త్‌ భారత్‌ (ఏఎంబీ) కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ (ఐఎఫ్‌ఏ) మాత్రలు, సిరప్‌ పంపిణీకి సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2023–24 వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది.

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య శిశువులు, బాలింతల్లో 89 శాతం మందికి ఐఎఫ్‌ఏ మాత్రల పంపిణీ చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 88 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో, 86.6 శాతంతో ఛత్తీస్‌గఢ్‌ మూడో స్థానంలో, 84.8 శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచాయి. 41.8 శాతంతో కేరళ 21వ స్థానానికి పరిమితమైంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో 88 శాతంతో చండీగఢ్‌ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కాగా దేశవ్యాప్తంగా ఐఎఫ్‌ఏ మాత్రల పంపిణీ 58.8 శాతం మాత్రమే ఉంది. ఐఎఫ్‌ఏ మాత్రల పంపిణీలో దేశంలోనే ఆంధ్రపదేశ్‌ మొదటి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2021–22లోనూ పిల్లలు, యువత, గర్భిణులు, బాలింతల్లో 83.6 శాతం మందికి ఐఎఫ్‌ఏ సిరప్, మాత్రలు పంపిణీ చేసి దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 

రాష్ట్రంలో సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ 
దేశంలో రక్తహీనతను నిర్మూలించే ఉద్దేశంతో ఎనీమియా ముక్త్‌ భారత్‌ (ఏఎంబీ) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య శాఖ 6 నుంచి 59 నెలల పిల్లలకు 1 ఎంఎల్‌ ఐఎఫ్‌ఏ సిరప్‌ వారానికి ఒకసారి చొప్పున 8 నుంచి 10 డోసులు పంపిణీ చేస్తోంది. అలాగే 5–9 ఏళ్ల పిల్లలకు ఐఎఫ్‌ఏ మాత్రలు నెలలో నాలుగు నుంచి ఐదు అందిస్తున్నారు.

అదేవిధంగా 10–19 ఏళ్ల కౌమార పిల్లలు, యువతకు నెలకు నాలుగు ఐఎఫ్‌ఏ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు 180 మాత్రలు చొప్పున అందిస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాల కింద అంగన్‌వాడీల ద్వారా చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం కింద మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. స్కూల్‌ హెల్త్‌ యాప్‌ను రూపొందించి వైద్య శాఖ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పిల్లలందరికీ ఐఎఫ్‌ఏ మాత్రలు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకుంది.  

రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు.. 
రాష్ట్ర ప్రభుత్వం రక్తహీనత నివారణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 9 లక్షల మంది మహిళలు గర్భం దాలుస్తున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 49 ఏళ్లలోపు వయసు ఉండి రక్తహీనత సమస్యతో బాధపడుతున్న గర్భిణులు 53 శాతం ఉండేవారు. కాగా, 2023 నాటికి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం 29 శాతానికి తగ్గిపోయింది. 2023–24లో 2.79 లక్షల మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య శాఖ గుర్తించింది. వీరిలో 2.37 లక్షల మందిలో స్వల్పంగా, మధ్యస్థంగా రక్తహీనత ఉంది.

మరో 42,463 మందిలో తీవ్ర రక్తహీనత సమస్య ఉందని నిర్ధారించారు. దీంతో సాధారణ రక్తహీనత ఉన్న గర్భిణులందరికీ ఐఎఫ్‌ఏ మందులను ప్రభుత్వం అందించింది. మధ్యస్థం, తీవ్ర రక్తహీనత సమస్య ఉన్న వారిని ఫ్యామిలీ డాక్టర్‌కు రిఫర్‌ చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వచ్చిది. ఈ క్రమంలో వైద్యుల సూచనల మేరకు 211 మంది గర్భిణులకు రక్తాన్ని ఎక్కించారు. అదేవిధంగా 6,731 మందికి ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్‌లను చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement