anemia in children
-
రక్తహీనత నివారణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: రక్తహీనత (ఎనీమియా) నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆరు నెలల శిశువు నుంచి చిన్న పిల్లలు, యువత, గర్భిణులు, బాలింతలు రక్తహీనత నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వేసిన అడుగులు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపాయి. ఎనీమియా ముక్త్ భారత్ (ఏఎంబీ) కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ (ఐఎఫ్ఏ) మాత్రలు, సిరప్ పంపిణీకి సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2023–24 వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య శిశువులు, బాలింతల్లో 89 శాతం మందికి ఐఎఫ్ఏ మాత్రల పంపిణీ చేపట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 88 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో, 86.6 శాతంతో ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో, 84.8 శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచాయి. 41.8 శాతంతో కేరళ 21వ స్థానానికి పరిమితమైంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో 88 శాతంతో చండీగఢ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కాగా దేశవ్యాప్తంగా ఐఎఫ్ఏ మాత్రల పంపిణీ 58.8 శాతం మాత్రమే ఉంది. ఐఎఫ్ఏ మాత్రల పంపిణీలో దేశంలోనే ఆంధ్రపదేశ్ మొదటి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2021–22లోనూ పిల్లలు, యువత, గర్భిణులు, బాలింతల్లో 83.6 శాతం మందికి ఐఎఫ్ఏ సిరప్, మాత్రలు పంపిణీ చేసి దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ దేశంలో రక్తహీనతను నిర్మూలించే ఉద్దేశంతో ఎనీమియా ముక్త్ భారత్ (ఏఎంబీ) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య శాఖ 6 నుంచి 59 నెలల పిల్లలకు 1 ఎంఎల్ ఐఎఫ్ఏ సిరప్ వారానికి ఒకసారి చొప్పున 8 నుంచి 10 డోసులు పంపిణీ చేస్తోంది. అలాగే 5–9 ఏళ్ల పిల్లలకు ఐఎఫ్ఏ మాత్రలు నెలలో నాలుగు నుంచి ఐదు అందిస్తున్నారు. అదేవిధంగా 10–19 ఏళ్ల కౌమార పిల్లలు, యువతకు నెలకు నాలుగు ఐఎఫ్ఏ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు 180 మాత్రలు చొప్పున అందిస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాల కింద అంగన్వాడీల ద్వారా చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం కింద మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. స్కూల్ హెల్త్ యాప్‌ను రూపొందించి వైద్య శాఖ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పిల్లలందరికీ ఐఎఫ్ఏ మాత్రలు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు.. రాష్ట్ర ప్రభుత్వం రక్తహీనత నివారణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 9 లక్షల మంది మహిళలు గర్భం దాలుస్తున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 49 ఏళ్లలోపు వయసు ఉండి రక్తహీనత సమస్యతో బాధపడుతున్న గర్భిణులు 53 శాతం ఉండేవారు. కాగా, 2023 నాటికి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం 29 శాతానికి తగ్గిపోయింది. 2023–24లో 2.79 లక్షల మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య శాఖ గుర్తించింది. వీరిలో 2.37 లక్షల మందిలో స్వల్పంగా, మధ్యస్థంగా రక్తహీనత ఉంది. మరో 42,463 మందిలో తీవ్ర రక్తహీనత సమస్య ఉందని నిర్ధారించారు. దీంతో సాధారణ రక్తహీనత ఉన్న గర్భిణులందరికీ ఐఎఫ్ఏ మందులను ప్రభుత్వం అందించింది. మధ్యస్థం, తీవ్ర రక్తహీనత సమస్య ఉన్న వారిని ఫ్యామిలీ డాక్టర్‌కు రిఫర్ చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వచ్చిది. ఈ క్రమంలో వైద్యుల సూచనల మేరకు 211 మంది గర్భిణులకు రక్తాన్ని ఎక్కించారు. అదేవిధంగా 6,731 మందికి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లను చేశారు. -
కన్నీటికే కన్నీరు! రెండేళ్ల తమ్ముడు మృతి.. రెండు గంటలు జాడలేని తండ్రి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మోరేనా పట్టణంపై హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. అంబా జిల్లాలోని బాద్‌ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండేళ్ల చిన్న కుమారుడు రాజాను మోరేనా జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. ఎనిమిదేళ్ల పెద్ద కుమారుడు గుల్షన్ తండ్రి వెంట ఆస్పత్రికి వచ్చాడు. రక్తహీనత, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. పూజారామ్ చేతిలో చిల్లిగవ్వ లేదు. పసిబిడ్డ మృతదేహాన్ని తిరిగి ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియక తల్లడిల్లాడు. ఆస్పత్రి వారు ఎలాంటి వాహనం ఏర్పాటుచేయలేమన్నారు. కనిపించిన వారినల్లా సాయం కోసం అర్థించాడు. ఇక చేసేది లేక తన బిడ్డ మృతదేహాన్ని భుజానికెత్తుకొని ఆసుపత్రి బయటకు నడిచాడు. రోడ్డు పక్కన గుల్షన్‌ను కూర్చోబెట్టి ఒడిలో రాజా మృతదేహాన్ని ఉంచి, సాయం కోసం వెళ్లాడు. దాదాపు రెండు గంటల పాటు తమ్ముడి శవంతో గుల్షన్ అక్కడే తండ్రి రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడి మృతదేహంపై వాలే ఈగలను తోలుతున్న గుల్షన్‌ను చూసి అటుగా వెళ్లేవాళ్ల హృదయం ద్రవించింది. నాన్న ఎప్పుడు వస్తాడో తెలియక భయంతో కన్నీరు పెట్టాడు. తనతో కలిసి ఆడుకున్న తమ్ముడి ఇక లేడని ఏడుస్తున్న గుల్షన్‌ను చూసి స్థానిక జర్నలిస్టు ఒకరు ఆ ఫొటోలు తీశారు. ఇంతలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమికూడారు. బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసు అధికారి యోగేంద్ర సింగ్ రంగంలోకి దిగారు. రాజా చికిత్స పొందిన ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, వాహనం ఏర్పాటు చేశారు. రాజా శవాన్ని, అతడి తండ్రిని, సోదరుడిని వారి స్వగ్రామానికి పంపించారు. -
గ్రామాల్లో రక్తహీనత.. నగరాల్లో ఐరన్ లోపం.. పూర్తి పరిష్కారం?
సాక్షి, హైదరాబాద్: రక్తహీనత సమస్య గ్రామీణ ప్రాంత పిల్లలు, కౌమార వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తోందని, నగరాల్లోని పిల్లల్లో మాత్రం ఐరన్ లేమి ఎక్కువగా ఉందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో తేలింది. నగరాల్లోని పిల్లల్లో రక్త హీనత సమస్య తక్కువగానే ఉందని వెల్లడైంది. గ్రామీణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నా ఇనుము లేమి సమస్య లేదని స్పష్టమైంది. దేశంలోని పిల్లలు, కౌమార వయసున్న వారిలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు.. వ్యాధులు, పోషణ లేమితో విజయవంతం కాలేకపోతున్నాయని వెల్లడైంది. దేశంలోని మహిళలు, పిల్లలు 40–50 శాతం మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటుండగా.. పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించాల్సిన అవసరం ఈ అధ్యయనం కల్పిస్తోందని ఎన్ఐఎన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మంచి ఆహారం కీలకం.. రక్తంలో ఇనుము మోతాదు చాలా తక్కువగా ఉంటే రక్తహీనత వచ్చిందని చెబుతుంటారు. ఈ లెక్కన చూస్తే దేశంలోని దాదాపు 50 శాతం మందిలో ఈ సమస్య ఉండాలి. అయితే రక్తంలోని ఇనుము మోతాదును గుర్తించేందుకు అయ్యే పరీక్షలు చాలా ఖరీదైనవి. జనాభా స్థాయిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ఈ కారణంగానే రక్తంలోని హిమోగ్లోబిన్‌ను లెక్కించడం ద్వారా ఇనుము లోపాన్ని పరోక్షంగా గుర్తించి రక్తహీనతపై అంచనాకు వస్తారు. ‘రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు సర్వేల ద్వారా తెలిస్తే.. ఇనుము సప్లిమెంట్లు, ఇనుము కలిగిన ఆహారం ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. కానీ తాజా అధ్యయనం ప్రకారం చూస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతున్నట్లు కన్పించట్లేదు’అని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 33 వేల మంది పిల్లలు, కౌమారులపై ఈ అధ్యయనం జరిగింది. ‘రక్తంలో హిమోగ్లోబిన్ తయారయ్యేందుకు నాణ్యమైన ఆహారం చాలా కీలకం. పండ్లు, జంతు సంబంధిత ఆహారం తక్కువగా తీసుకుంటుండటం వల్ల గ్రామీణుల్లో, పేదల్లో హిమోగ్లోబిన్ తయారీ సక్రమంగా జరగట్లేదు. ఇనుముతో పాటు అనేక ఇతర పోషకాలు హిమోగ్లోబిన్ తయారీకి అవసరమవుతాయి’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ భారతీ కులకర్ణి తెలిపారు. (చదవండి: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర) -
వేధిస్తున్న ఎనీమియా
తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం, ఆరోగ్యం పట్లఅవగాహనా రాహిత్యంతో నగర బాలికలు రక్తహీనత బారినపడుతున్నట్టు ఎన్ఐఎన్ యువ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. గ్రేటర్ పరిధిలోని 80 శాతంవిద్యార్థినుల్లో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. తార్నాక: మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజమంతా ఆరోగ్యంగా ఉంటుందంటారు. అయితే నగరంలో పేద, మధ్య తరగతి మహిళలు ముఖ్యంగా అమ్మాయి లు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో అధికంగా వేధించే జబ్బు రక్తహీనత. అందుకు వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం, అవగాహనా రాహిత్యం వల్లనే ఈ సమ స్యలు ఉత్పన్నమవుతున్నాయి. నగర బాలికల్లో ఏర్పడుతున్న రక్తహీనతపై ఎన్ఐఎన్ యువ సైంటిస్టులు చేసిన అధ్యయనంలో ఈఅంశాలు వెల్లడయ్యాయి. దేశ ంలో దాదాపు 60 శాతం మంది మహిళలు ఎనీమియా తో బాధపడుతుండగా, గ్రేటర్ పరిధిలో నివసిస్తున్న పాఠశాల స్థాయి బాలికలు, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులలో ఈసమస్య 80 శాతం వరకూ ఉన్నట్టు ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ సమస్యకు కారణం పోషకాహార లోపంతో పాటు విటమిన్ల లోపమే ప్రధాన కారణమని తేల్చారు. ఈసమస్యను అధిగమించడానికి సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఎనీమియాపై వారి లో అవగాహన కలిగించాలంటున్నారు. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో జరుగుతున్న ఆల్ ఇండియా ఉమెన్ అసోసియేషన్ మహిళా జాతీయ సదస్సులో పలువురు శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలపై పోస్టరు ప్రదర్శన నిర్వహించారు. పలు విద్యాసంస్థల విద్యార్థినులపై అధ్యయనం జాతీయ పోషకాహార సంస్థకు చెందిన యువశాస్త్రవేత్త లు నగర శివారులలోని నాలుగు ప్రభుత్వ విద్యాసంస్థలను ఎంపిక చేసుకుని అందులో చదువుతున్న విద్యార్థినులపై అధ్యయం నిర్వహించారు. పాఠశాల స్థాయి విద్యార్థినుల కోసం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న బోడుప్పల్ పీర్జాదిగూడలోని ఎస్టీ బాలికల హాస్టల్, మహేంద్రహిల్స్‌లోని ఎస్సీ బాలికల హాస్టళ్ల విద్యార్థినులపై అధ్యయనం చేశారు. ఇక డిగ్రీస్థాయి విద్యార్థినుల కోసం శామీర్‌పేట్‌లోని ప్రభుత్వ గురుకుల డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులను తీసుకుని అధ్యయనం సాగించారు. హాస్టల్ విద్యార్థినులలో.. ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన రెండు హాస్టళ్లలో 9 నుంచి 13 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థినులపై అధ్య యనం చేశారు. వీరిలో ఐరన్, çహిమోగ్లోబిన్, విటమిన్–ఏ, బీ12 ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నా యి. అలాగే వారిలో రక్తస్రావాలు అధికంగా ఉన్నట్లు పారాసైటిక్ వ్యాధులు, జన్యుసంబంధ వ్యాధులకు గురువుతున్నట్లు గుర్తించారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే 60 శాతం మంది మహిళలు ఎనీమియాతో బాధపడుతుండగా, ఈ ఆధ్యయనంలో పీర్జాదిగూడ హాస్టల్లో 81శాతం, మహేంద్రహిల్స్‌లో 56 శాతం మంది విద్యార్థినులు ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అలాగే పీర్జాదిగూడలో ఐరన్ లోపంతో 52 శాతం, విటబవిటమిన్–ఏ లోపంతో 50 శాతం మంది బాధపడుతుండగా, మహేంద్రహిల్స్‌లో ఐరన్ లోపం తో 46 శాతం, విటమిన్ ఏ లోపం ఉన్నట్లు గుర్తించారు. డిగ్రీ గురుకులాలలో.. శామీర్‌పేట్‌లోని రెండు డిగ్రీ గురుకులాల్లోని వివిధ కోణాల్లో 17 నుంచి 20ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 523 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో 319 మంది లో హిమోగ్లోబిన్, సెరం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 61శాతం అమ్మాయిలలో ఐరన్ డిఫీసియన్సీ ఎనీమియా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. వీరి సోషియో ఎకనామిక్ స్టేటస్‌ను పరిశీలిస్తే 60శాతం అప్పర్, 68శాతం మిడిల్ అప్పర్, 65శాతం తక్కువ ఆదాయం, 80శాతం మంది బిలోపావర్టీలో ఉన్నవారిలో 80శాతం ఎనీమియా ఉన్నట్లు గుర్తించారు. మతాలవారీగా పరిశీలిస్తే హిందువుల్లో 65శాతం, క్రైస్తవుల్లో 83«శాతం ఇతరుల్లో 88శాతం ఎనీమియా లక్షణాలు కనుగొన్నారు. కులాల వారీగా పరిశీలిస్తే ఓబీసీ–60శాతం, ఎస్సీ–72శాతం, ఎస్టీలు 52శాతం, ఇతరులు 68శాతం మంది ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అలాగే ఎనీమియా ఉన్నవారిలో రుతుస్రావ సమయంలో 77.6శాతం మందిలో రక్తస్రావం అధికంగా ఉండగా, కేవలం 24శాతం మందిలో మాత్రమే సాధారణ స్థితి ఉన్నట్లు తేల్చారు. క్లినికల్ ఎగ్జామ్‌తో లక్షణాలు ఎనీమియాతో బాధపడుతున్న వారిని క్లినికల్ ఎగ్జామ్ చేయగా, వీరిలో పాలిపోయిన నాలుక, అలాగే పెచ్చిపోయిన నోరు, పెళుసుగా, నిర్జీవంగా మారిన అరచేతు లు, తెల్లబడిన వేలి గోరు అంచులు ఉన్నట్లు గుర్తించా రు. అందుకు ప్రధాన కారణం ఎనీమియాగా తేల్చారు. అవగాహన అవసరం చాలా మంది అమ్మాయిల్లో ఎనీమియాపై అవగాహన లేదని అధ్యయనంలో తెలిసింది. 523 మందిని పరీక్షించి వారికోసం ప్రత్యేకంగా ప్రశ్నావళిని రూపొందించారు. అందులో కేవలం 23 శాతం మందికి మాత్రమే ఎనిమీయాపై అవగాహన ఉన్నట్లు గుర్తించారు. 28 శాతం మందికి మాత్రమేఅవగాహన ఎనీమియా గురించి చాలా మంది అమ్మాయిలకు అవగాహన లేదు. ఎనీమియా గురించి కేవలం 28శాతం మంది మహిళలకు మాత్రమే తెలుసు. ఎనీమియా వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి మహిళలకు అవగాహన కలిగించాలి. దీనివల్ల కొంత వరకైనా ఈవ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.– డాక్టర్ బ్లెస్సీ ప్రభు ప్రియాంక, ఎన్ఐఎన్ పోషకాహారాన్ని అందించాలి బాలికల్లో ఎనీమియా సమస్యకు ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవడం. వారికి ఆహారంలో అటుకులు, బెల్లంతో తయారుచేసిన పదార్థాలు, పల్లిపట్టీలు వంటివి ఎక్కువగా ఇవ్వాలి. ఈ సమస్య సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల రెసిడెన్సీ కళాశాలల అమ్మాయిల్లో అధికంగా ఉన్నందున వారి రోజువారీ మెనులో మార్పులు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– తుల్జా, ఎన్ఐఎన్ -
నులి పురుగులతో పిల్లల్లో రక్తహీనత
డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు ఖమ్మం వైద్య విభాగం: కడుపులో నులి పురుగుల కారణంగా 50 శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎ.కొండల్రావు చెప్పారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై ఆయన బుధవారం నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ కొండల్రావు మాట్లాడుతూ.. 1–19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తినిపించాలన్నారు. పిల్లల కడుపులో నులి పురుగులు ఉన్నట్టయితే.. వారు తీసుకున్న ఆహారంలో సగ భాగాన్ని అవే తింటాయని అన్నారు. ఫలితంగా పిల్లలకు రక్తహీనత సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఈ నెల 10న నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేయించాలని కోరారు. పిల్లలు భోజనం చేసిన తర్వాత మాత్రమే ఈ మాత్రలు ఇచ్చి, చప్పరించేలా చూడాలని చెప్పారు. ఈ మాత్రలు 1–5 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో, 6–19 సంవత్సరాల లోపు వారికి పాఠశాలల్లో ఇవ్వాలని అన్నారు. పాఠశాలలకు వెళ్లని వారికి అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వనున్నట్టు చెప్పారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ ప్రచార పోస్టర్‌ను డిప్యూటి డీఈఓలతో కలిసి డీఎంహెచ్ఓ ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఎస్కే కో–ఆర్డినేటర్ నిర్మల్‌కుమార్, డిప్యూటి డీఈఓలు రాములు, బస్వారావు, డెమో బి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.