పోస్టర్ ఆవిష్కరిస్తున్న డీఎంహెచ్‌ఓ, డిప్యూటి డీఈఓలు
-
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొండల్‌రావు
ఖమ్మం వైద్య విభాగం: కడుపులో నులి పురుగుల కారణంగా 50 శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ ఎ.కొండల్‌రావు చెప్పారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై ఆయన బుధవారం నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ కొండల్‌రావు మాట్లాడుతూ.. 1–19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్‌బెండజోల్ మాత్రలు తినిపించాలన్నారు. పిల్లల కడుపులో నులి పురుగులు ఉన్నట్టయితే.. వారు తీసుకున్న ఆహారంలో సగ భాగాన్ని అవే తింటాయని అన్నారు. ఫలితంగా పిల్లలకు రక్తహీనత సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఈ నెల 10న నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేయించాలని కోరారు. పిల్లలు భోజనం చేసిన తర్వాత మాత్రమే ఈ మాత్రలు ఇచ్చి, చప్పరించేలా చూడాలని చెప్పారు. ఈ మాత్రలు 1–5 సంవత్సరాల పిల్లలకు అంగన్‌వాడీ సెంటర్లలో, 6–19 సంవత్సరాల లోపు వారికి పాఠశాలల్లో ఇవ్వాలని అన్నారు. పాఠశాలలకు వెళ్లని వారికి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇవ్వనున్నట్టు చెప్పారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ ప్రచార పోస్టర్‌ను డిప్యూటి డీఈఓలతో కలిసి డీఎంహెచ్‌ఓ ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్‌బీఎస్‌కే కో–ఆర్డినేటర్ నిర్మల్‌కుమార్, డిప్యూటి డీఈఓలు రాములు, బస్వారావు, డెమో బి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.