వేధిస్తున్న ఎనీమియా | Anemia in Hyderabad Girl Childrens | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న ఎనీమియా

Published Fri, Dec 13 2019 10:30 AM | Last Updated on Fri, Dec 13 2019 10:30 AM

Anemia in Hyderabad Girl Childrens - Sakshi

తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం, ఆరోగ్యం పట్లఅవగాహనా రాహిత్యంతో నగర బాలికలు రక్తహీనత బారినపడుతున్నట్టు ఎన్‌ఐఎన్‌ యువ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. గ్రేటర్‌ పరిధిలోని 80 శాతంవిద్యార్థినుల్లో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు.

తార్నాక: మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజమంతా ఆరోగ్యంగా ఉంటుందంటారు. అయితే నగరంలో పేద, మధ్య తరగతి మహిళలు ముఖ్యంగా అమ్మాయి లు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో అధికంగా వేధించే జబ్బు రక్తహీనత. అందుకు వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం, అవగాహనా రాహిత్యం వల్లనే ఈ సమ స్యలు ఉత్పన్నమవుతున్నాయి. నగర బాలికల్లో ఏర్పడుతున్న రక్తహీనతపై ఎన్‌ఐఎన్‌ యువ సైంటిస్టులు చేసిన అధ్యయనంలో ఈఅంశాలు వెల్లడయ్యాయి. దేశ ంలో దాదాపు 60 శాతం మంది మహిళలు ఎనీమియా తో బాధపడుతుండగా, గ్రేటర్‌ పరిధిలో నివసిస్తున్న పాఠశాల స్థాయి బాలికలు, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులలో ఈసమస్య 80 శాతం వరకూ ఉన్నట్టు ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ సమస్యకు కారణం పోషకాహార లోపంతో పాటు విటమిన్ల లోపమే ప్రధాన కారణమని తేల్చారు. ఈసమస్యను అధిగమించడానికి సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఎనీమియాపై వారి లో అవగాహన కలిగించాలంటున్నారు. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లో జరుగుతున్న ఆల్‌ ఇండియా ఉమెన్‌ అసోసియేషన్‌ మహిళా జాతీయ సదస్సులో పలువురు శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలపై పోస్టరు ప్రదర్శన నిర్వహించారు.

పలు విద్యాసంస్థల విద్యార్థినులపై అధ్యయనం  
జాతీయ పోషకాహార సంస్థకు చెందిన యువశాస్త్రవేత్త లు నగర శివారులలోని నాలుగు ప్రభుత్వ విద్యాసంస్థలను ఎంపిక చేసుకుని అందులో చదువుతున్న విద్యార్థినులపై అధ్యయం నిర్వహించారు. పాఠశాల స్థాయి విద్యార్థినుల కోసం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న బోడుప్పల్‌ పీర్జాదిగూడలోని ఎస్టీ బాలికల హాస్టల్, మహేంద్రహిల్స్‌లోని ఎస్సీ బాలికల హాస్టళ్ల విద్యార్థినులపై అధ్యయనం చేశారు. ఇక డిగ్రీస్థాయి విద్యార్థినుల కోసం శామీర్‌పేట్‌లోని ప్రభుత్వ గురుకుల డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాల విద్యార్థులను తీసుకుని అధ్యయనం సాగించారు.

హాస్టల్‌ విద్యార్థినులలో..
ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన రెండు హాస్టళ్లలో 9 నుంచి 13 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థినులపై అధ్య యనం చేశారు. వీరిలో ఐరన్, çహిమోగ్లోబిన్, విటమిన్‌–ఏ, బీ12 ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నా యి. అలాగే వారిలో రక్తస్రావాలు అధికంగా ఉన్నట్లు పారాసైటిక్‌ వ్యాధులు, జన్యుసంబంధ వ్యాధులకు గురువుతున్నట్లు గుర్తించారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే 60 శాతం మంది మహిళలు ఎనీమియాతో బాధపడుతుండగా, ఈ ఆధ్యయనంలో పీర్జాదిగూడ హాస్టల్‌లో 81శాతం, మహేంద్రహిల్స్‌లో 56 శాతం మంది విద్యార్థినులు ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అలాగే పీర్జాదిగూడలో ఐరన్‌ లోపంతో 52 శాతం, విటబవిటమిన్‌–ఏ లోపంతో 50 శాతం మంది బాధపడుతుండగా, మహేంద్రహిల్స్‌లో ఐరన్‌ లోపం తో 46 శాతం, విటమిన్‌ ఏ లోపం ఉన్నట్లు గుర్తించారు. 

డిగ్రీ గురుకులాలలో..
శామీర్‌పేట్‌లోని రెండు డిగ్రీ గురుకులాల్లోని వివిధ కోణాల్లో 17 నుంచి 20ఏళ్ల మధ్య వయస్సు కలిగిన  523 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో 319 మంది లో హిమోగ్లోబిన్, సెరం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 61శాతం అమ్మాయిలలో ఐరన్‌ డిఫీసియన్సీ ఎనీమియా  ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. వీరి సోషియో ఎకనామిక్‌ స్టేటస్‌ను పరిశీలిస్తే 60శాతం అప్పర్, 68శాతం మిడిల్‌ అప్పర్, 65శాతం తక్కువ ఆదాయం, 80శాతం మంది బిలోపావర్టీలో ఉన్నవారిలో 80శాతం ఎనీమియా ఉన్నట్లు గుర్తించారు. మతాలవారీగా పరిశీలిస్తే హిందువుల్లో 65శాతం, క్రైస్తవుల్లో 83«శాతం ఇతరుల్లో 88శాతం ఎనీమియా లక్షణాలు కనుగొన్నారు. కులాల వారీగా పరిశీలిస్తే ఓబీసీ–60శాతం, ఎస్సీ–72శాతం, ఎస్టీలు 52శాతం, ఇతరులు 68శాతం మంది ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అలాగే ఎనీమియా ఉన్నవారిలో రుతుస్రావ సమయంలో 77.6శాతం మందిలో రక్తస్రావం అధికంగా ఉండగా, కేవలం 24శాతం మందిలో మాత్రమే సాధారణ స్థితి ఉన్నట్లు తేల్చారు.

క్లినికల్‌ ఎగ్జామ్‌తో లక్షణాలు  
ఎనీమియాతో బాధపడుతున్న వారిని క్లినికల్‌ ఎగ్జామ్‌ చేయగా, వీరిలో పాలిపోయిన నాలుక, అలాగే పెచ్చిపోయిన నోరు, పెళుసుగా, నిర్జీవంగా మారిన అరచేతు లు, తెల్లబడిన వేలి గోరు అంచులు ఉన్నట్లు గుర్తించా రు. అందుకు ప్రధాన కారణం ఎనీమియాగా తేల్చారు.

అవగాహన అవసరం  
చాలా మంది అమ్మాయిల్లో ఎనీమియాపై అవగాహన లేదని అధ్యయనంలో తెలిసింది. 523 మందిని పరీక్షించి వారికోసం ప్రత్యేకంగా ప్రశ్నావళిని రూపొందించారు. అందులో కేవలం 23 శాతం మందికి మాత్రమే ఎనిమీయాపై అవగాహన ఉన్నట్లు గుర్తించారు.

28 శాతం మందికి మాత్రమేఅవగాహన
ఎనీమియా గురించి చాలా మంది అమ్మాయిలకు అవగాహన లేదు. ఎనీమియా గురించి కేవలం 28శాతం మంది మహిళలకు మాత్రమే తెలుసు. ఎనీమియా వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి మహిళలకు అవగాహన కలిగించాలి. దీనివల్ల కొంత వరకైనా ఈవ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.– డాక్టర్‌ బ్లెస్సీ ప్రభు ప్రియాంక, ఎన్‌ఐఎన్‌

పోషకాహారాన్ని అందించాలి
బాలికల్లో ఎనీమియా సమస్యకు ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవడం. వారికి ఆహారంలో అటుకులు, బెల్లంతో తయారుచేసిన పదార్థాలు, పల్లిపట్టీలు వంటివి ఎక్కువగా ఇవ్వాలి. ఈ సమస్య సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల రెసిడెన్సీ కళాశాలల అమ్మాయిల్లో అధికంగా ఉన్నందున వారి రోజువారీ మెనులో మార్పులు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– తుల్జా, ఎన్‌ఐఎన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement