Tribesmen
-
వింత వ్యాధితో ఐదుగురు గిరిజనుల మృతి
అనంతగిరి (అరకులోయ): విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ కరకవలస, చినరాబ గ్రామాల్లో మూడు వారాలు వ్యవధిలోని వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. దీనిపై అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ స్పందించి అధికారులతో మాట్లాడారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు బుధవారం ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ గ్రామాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించి, వింత వ్యాధి (కాళ్లు, చేతుల వాపులు)కి గల కారణాలపై ఆరా తీశారు. గురువారం ఉదయం వైద్య సిబ్బంది గ్రామాలకు చేరుకుని మూడు అంబులెన్స్‌లో కరకవలస, సొట్టడివలస, చినరాభ గ్రామాలకు చెందిన 18 మంది గిరిజనులను గజపతినగరం తరలించారు. వీరందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ముందుస్తు చర్యల్లో భాగంగా వీరందరని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నిల్వ పశు మాంసమే కారణమా? నిల్వ పశు మాంసం తీసుకోవడంతో కరకవలస వాసులు అనారోగ్యం పాలవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఏ కారణంతో మరణాలు సంభవిస్తున్నాయి? కాళ్లు, చేతుల వాపులు ఎందుకు వస్తున్నాయనే దానిపై పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తే కాని చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. -
నులివెచ్చని కశ్మీరం
కశ్మీరీ పశుమినా షాల్స్ కప్పుకోవడం ఒకప్పటి ఫ్యాషన్. ఒకనాటి భాగ్యవంతుల, మేధావుల ఫ్యాషన్ స్టేట్మెంట్ అది. కశ్మీర్ వస్త్రాన్నీ, ఒరిస్సా–బెంగాల్ డిజైన్లనీ, లద్దాఖ్ గిరిజనుల కళా నైపుణ్యాలనూ కలగలిపి కనుమరుగవుతున్న పశుమినాఫాల్స్కు కొత్త సొబగులద్ది మళ్లీ వాటికి మళ్లీ ప్రాణం పోసింది ఫ్యాషన్ డిజైనర్ ‘స్టాంజిన్ పాల్మో’! రండి... ఆమెను పరిచయం చేసుకుందాం. కశ్మీర్ నుంచి యాపిల్ వస్తోంది, వాల్నట్ వస్తోంది. పశుమినా షాల్ వస్తోంది. ఇవన్నీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరిస్తున్నాయి. కానీ వాటి పేర్లతో మరెన్నో నకిలీలు కూడా రాజ్యమేలుతుంటాయి. ఒకప్పుడు కశ్మీర్ పశుమినా షాల్ ధరించడం అంటే స్టేటస్ సింబల్. రచయితలు తమ రచనల్లో సంపన్న కుటుంబంలోని మహిళ వర్ణనలో కశ్మీరీ పశుమినా షాల్ ఉండేది. ఆ పశుమినా షాల్ తెరమరుగవుతున్న టైమ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్... కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. పశుమినా మెటీరియల్‌తో ఓవర్ కోట్తోపాటు మరికొన్ని సొబగులద్ది ఈ ఏడాది ముంబయిలో జరిగిన‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో ప్రదర్శించింది. ఇరవై ఆరేళ్ల స్టాంజిన్ పాల్మో చేసిన ప్రయోగం కశ్మీర్‌లోని స్థానిక తెగల గిరిజనులకు కొత్త ఉపాధికి మార్గమైంది. స్టాంజిన్ పాల్మో ఢిల్లీ, నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేసింది. సోనాల్ వర్మ వంటి సీనియర్ డిజైనర్‌తోపాటు అనేక మంది డిజైనింగ్ ఎక్స్‌పర్ట్‌ల దగ్గర పని చేసింది. వారితోపాటు విదేశాల్లో జరిగిన ఫ్యాషన్‌షోలలో కూడా పాల్గొన్నది. ఈ క్రమంలో రెండేళ్ల కిందట లధాక్ చేనేత మగ్గాల గురించి తెలిసిన తర్వాత సొంతంగా ప్రయోగాలు మొదలు పెట్టింది. డిజైనింగ్ రంగంలో ‘జిల్జామ్’ బ్రాండ్‌తో తన మార్కును విజయవంతంగా చూపిస్తోంది. ‘‘లధాక్, లే... చేనేత గురించి తెలుసుకునే కొద్దీ... నేను వెతుకుతున్న వజ్రమేదో దొరికినట్లయింది. ‘బిట్వీన్ ద ఎర్త్ అండ్ స్కై’ కాన్సెప్ట్‌తో రూపొందించిన డిజైన్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి’’ అన్నారామె. ‘‘పశుమినా వస్త్రానికి పొట్టేలు, జడల బర్రె, ఒంటెల నుంచి సేకరించిన ఊలును ఉపయోగిస్తారు. కశ్మీర్‌లోని లధాక్‌లో నివసించే గిరిజనులు ఈ నేతలో నిపుణులు. నిజానికి పశుమినా ఫ్యాబ్రిక్‌ను నేను ప్రమోట్ చేశానని ఎవరైనా అంటే అది శుద్ధ అబద్ధం. ‘పశుమినా’ అనే పదమే ఒక బ్రాండ్. ఆ చేనేతలో దాగిన పనితనాన్ని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావు. అయితే ఇంత వరకు ఈ ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వాళ్లు తక్కువ. ఇప్పుడు కొత్త తరానికి సరికొత్త రూపంలో పరిచయం చేయగలిగాను. ఇందులో నా పాత్ర ఇంత వరకే. ఇందులో నేను తెచ్చిన కొత్తదనమంతా రెండు–మూడు రకాల కళలను మిళితం చేయడమే. కశ్మీర్లో తయారైన సంప్రదాయ పశుమినా వస్త్రం మీద ఒడిషా, బెంగాల్ సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లను వేయించాను. ఢిల్లీలో ఒడిషా, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన కారీగార్ కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్లంతా వాళ్లకు వచ్చిన సంప్రదాయ ఎంబ్రాయిడరీ పనులకు గిరాకీ లేక, ఆటో నడుపుతూ, వాచ్మెన్లుగా జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో ఆడవాళ్లందరికీ ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది. వాళ్లకు ఈ పశుమినా శాలువాల మీద ఎంబ్రాయిడరీ చేయించాను. ఈ రకంగా కశ్మీర్ చేనేతను, ఒడిషా ఎంబ్రాయిడరీని దేశమంతటికీ తెలిసేలా చేయగలిగాను. ఇక విదేశాల్లో వీటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనేది నా లక్ష్యం. అదే జరిగితే... ఈ వస్త్రాలను నేసే మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం వేయగలిగిన దాన్నవుతాను. ఈ వస్త్రాలు ఎంతటి చలినైనా అపగలుగుతాయి. ధరించిన వారికి నులివెచ్చని అనుభూతినిస్తాయి. విదేశాల్లో తయారవుతున్న ఊలుకంటే కశ్మీర్ పశుమినా వస్త్రాలు కంటికి ఇంపుగా కూడా ఉంటాయి. అందుకే మన కళను ఖండాంతరాలు దాటించడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నాను’’ అన్నారు స్టాంజిన్. లధాక్ మహిళలు ఏడాదిలో ఆరు నెలల పాటు వస్త్రాలను నేస్తారు. మిగిలిన ఆరు నెలలు నేతకు వాతావరణం సహకరించదు. ఇప్పటి వరకు వాళ్లకు ఉన్న ఏకైక మార్కెటింగ్ జోన్ పర్యాటకం మాత్రమే. ‘‘ఈ శాలువాలను కశ్మీర్ పర్యటకను వచ్చే పర్యాటకులకు అమ్ముకుంటున్నారు. సంప్రదాయ డిజైన్లకు పరిమితమైన లధాక్, లే మహిళలకు వాళ్ల చుట్టూ ఉన్న అందాలనే వస్త్రాల్లో నిక్షిప్తం చేయగలిగేలా శిక్షణ ఇచ్చాను. ఆల్రెడీ చెయ్యి తిరిగిన వాళ్లు కావడంతో నేనిచ్చిన కొత్త డిజైన్లను త్వరగా ఒంటబట్టించుకున్నారు. కశ్మీర్ మహిళల నేత నైపుణ్యం ఇప్పటి వరకు కశ్మీర్ పర్యటనకు వెళ్లి వచ్చిన వాళ్ల దగ్గర మాత్రమే కనిపించేది. నా ప్రయత్నంలో దేశంలో ప్రతి ఇంటికీ కశ్మీర్ శాలువాను చేర్చగలుగుతాను. అలాగే... ప్రతి ఒక్కరినీ కశ్మీర్‌కు తీసుకెళ్లలేను, కానీ కశ్మీర్‌ను ప్రపంచమంతటికీ విస్తరించగలుగుతాను’’ అన్నారు స్టాంజిన్ ధీమాగా. సాధికార మహిళలు స్టాంజిన్... తన డిజైనింగ్ ప్రయోగం కోసం లధాక్, లేలలో అనేక గ్రామాల్లో పర్యటించారు. ఆ సంగతులను తెలియచేస్తూ ... ‘‘ఆ మహిళలతో మాట్లాడినప్పుడు ఆధునిక ప్రపంచం ఆశ్యర్చపడే విషయాలెన్నో తెలిశాయి. పని చేయడం మాత్రమే కాదు, కుటుంబానికి తమ శ్రమ ఎంత అవసరమో వాళ్లకు తెలుసు, అలాగే కుటుంబానికి తమ అవసరంతోపాటు కుటుంబంలో తమ ప్రాధాన్యత ఎంతో కూడా వాళ్లకు బాగా తెలుసు. వాళ్లకు జీవితం పట్ల ఆందోళన లేదు, వాళ్ల మాటల్లో నిరాశనిస్పృహలు లేవు. ఊలు సేకరణ, ప్రాసెసింగ్‌తోపాటు వడకడం, వస్త్రాన్ని నేయడం వరకు అనేక దశల్లో మహిళల సేవలే కీలకం. ఇప్పుడు నాతో యాభై మంది మహిళలు పని చేస్తున్నారు. తాము తయారు చేసిన షాల్‌ను... జాకెట్, కోట్ రూపంలో చూసుకుని సంతోషిస్తున్నారు. తమ పిల్లలకు వాటిని వేసుకుని మురిసిపోతున్నారు. వాళ్లను చూసినప్పుడు నా బ్రాండ్లను అక్కడి పిల్లలు కూడా ప్రమోట్ చేస్తున్నారనే సంతోషం కలుగుతుంటుంది’’ అన్నారు స్టాంజిన్ పాల్మో. – మంజీర -
గిరిజన పిల్లల్లో రక్తహీనత!
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో గిరిజన విద్యార్థులను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. చాలా మందిని సికిల్‌సెల్ ఎనీమియా పీడిస్తోంది. ఇప్పటివరకు ఆంత్రాక్స్, టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో నానా అవస్థలు పడిన గిరిజనులు ఇప్పుడు తమ పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లలకే కాకుండా పెద్దలను కూడా సికిల్‌సెల్ ఎనీమియా చుట్టుముట్టింది. తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి, లేదా వంశపారంపర్యంగా ఉంటే తప్పకుండా ఇది పిల్లలకు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఐటీడీఏ పరిధిలో పిల్లలు చిక్కిపోతుండడంతో 11 మండలాల్లోని 40,300 గిరిజన విద్యార్థులకు సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 14,073 మంది దీనిబారిన పడినట్లు అనుమానించిన అధికారులు హెచ్‌బీ–ఎస్ ఎలక్ట్రోపోలోసిస్ పరీక్ష చేయడంతో 576 మందికి సికిల్‌సెల్ ఎనీమియా ఉన్నట్లు నిర్థారించారు. వీరిలో 315 మంది బాలురు, 261 మంది బాలికలు ఉన్నారు. ప్రాణాంతకమైన సికిల్‌సెల్ ఎనీమియా, సికిల్ తలసీమియా వ్యాధులకు శాశ్వత నివారణ లేకపోవడంతో రోగుల్లో అవగాహన పెంచడం ద్వారానే వ్యాధి తీవ్రతను తగ్గించగలమని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా అదనపు పోషకాహారం, శరీరంలో ఐరన్ శక్తి తగ్గకుండా ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి, సి మాత్రలతో పాటు విటమిన్లు ఉండే ఆహారం రోగులకు అందించాల్సి ఉంటుంది. ఆస్పత్రుల్లో మందుల్లేవు ఏజెన్సీ ఏరియాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఐరన్ ఫోలిక్ సప్లిమెంటేషన్ (ఐఎఫ్ఏ) టానిక్, ఐరన్ మాత్రలు, బీ కాంప్లెక్స్‌తో పాటు విటమిన్–సీ, కాల్షియం మాత్రలు ఆస్పత్రుల్లో లేకపోవడంతో పిల్లలకు ఇవ్వడంలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. పాడేరు ప్రాంతంలో ఉన్న అనేక గిరిజన గూడేలు ఆస్పత్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో పేద గిరిజనులకు వైద్యం అందని ద్రాక్ష అవుతోంది. పోషక విలువల ఆహారం ముఖ్యం సాధారణంగా రక్త కణాలు చంద్రాకారంలో ఉండాలి. కానీ సికిల్‌సెల్ ఎనీమియా ఉన్న వారికి అవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. రక్తకణం పూర్తిస్థాయిలో ఉండదు కాబట్టి రక్త ప్రసారంలో కణం అడ్డుపడే అవకాశం ఉందని, రక్తం చేరాల్సిన ప్రదేశాలకు చేరకపోతే మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని అలక్ష్యం చేయకూడదని, నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం తినాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మూడు శాఖలతో సమన్వయం చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన ఆహారంపై గిరిజన సంక్షేమ శాఖ.. విద్యా, వైద్య–ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో ప్రతినెలా మొదటి గురువారం నాడు ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిని ఫోకసింగ్ రిసోర్స్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ హెల్త్ (ఎఫ్ఆర్ఈఎస్హెచ్) కార్యక్రమంగా పిలుస్తారు. మొత్తం తొమ్మిది కార్యక్రమాల ద్వారా ఆదివాసీ పిల్లల ఆరోగ్యంపై నాలుగు శాఖల అధికారులు దృష్టి పెడతారు. ఇందుకు సంబంధించి స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్ ఏప్రిల్ 26న అన్ని స్కూళ్లకు సర్క్యులర్ పంపించింది. రక్తహీనత ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు మందులు, ప్రత్యేక ఆహారం ఇస్తున్నారా? లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. కాగా, మందుల కొనుగోలుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తీసుకున్న తరువాతే కొనుగోలు చేయాలనే నిబంధన ఉండటంతో వారు సహకరించడంలేదని గిరిజన సంక్షేమ శాఖ ఆరోపిస్తోంది. -
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే
మాలీ మహా సంఘం డిమాండ్ బేల : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, ఇందులో మాలీలకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే చెల్లప్ప కమిషన్ ద్వారా సర్వే చేయించి ఎస్టీల జాబితాలో చేర్చాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేట్కులే సుకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక అంతరాష్ట్ర రోడ్డుపై స్థానిక మాలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక జ్యోతి బా పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి 12శాతం రిజర్వేషన్ గిరిజనులకు కల్పిస్తామని, అందులో మాలీలకు చోటు కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఉత్తరాలు రాసిన తరుణంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హైదరాబాద్‌లో సమావేశమై 9.5శాతం రిజర్వేషన్ ఇస్తే సరిపోతుందనడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని మాలీ మహా సంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజాప్రతినిధుల తీరుకు నిరసనగా వారి ఇళ్లను ముట్టడి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్నులే సురేశ్, కోశాధికారి గుర్నులే సతీశ్, జిల్లా యువజన కార్యదర్శి రాట్గురే విజయ్, మండల అధ్యక్షులు షిండే అంబదాస్, ప్రధాన కార్యదర్శి వాడయి వివేక్, ప్రచార కార్యదర్శి నాగోసే మురళీదర్, మాలీ కులస్తులు పాల్గొన్నారు. -
వారి కోసం ఏం చేశారు?
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ రఘువీరారెడ్డి అనంతపురం సెంట్రల్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. దళితులకు, గిరిజనులకు, మైనార్టీ ప్రజలకు ఏమైనా చేశావా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. గిరిజనులు, మైనార్టీ వర్గాల వారికి మంత్రి పదవులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, ఆదివాసీ, బీసీ, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత యాత్ర (బస్సుయాత్ర) ఆదివారం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలో స్థానిక కేఎస్ఆర్ బాలికల కళాశాల ఎదుట బహిరంగసభ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు కోసం పెద్ద మాదిగను నేనవుతా అంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఏం చే శాడని ప్రశ్నించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావిస్తే బీజేపీ దాని అనుబంధ ఆర్ఎస్ఎస్ కోర్టుకు పోయి రద్దు పరిచాయని వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి దళిత, గిరిజనుల, మైనార్టీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని, సంచులతో డబ్బులు మోస్తాడని నారాయణకు, వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఆర్థిక నేరగాడుగా ముద్రపడిన సుజనాచౌదరికి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, నాగరాజరెడ్డి, ఎస్టీసెల్ రాష్ర్ట అధ్యక్షులు సుధాకర్‌బాబు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మైనార్టీ సెల్ రాష్ట అధ్యక్షులు అలీఖాన్, డీసీసీ నగర అధ్యక్షులు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కృషి
తండాలను పంచాయతీలుగా గుర్తిస్తారు ఎమ్మెల్సీ రాములునాయక్ మహేశ్వరంలో సేవాలాల్ జయంతి సభ మహేశ్వరం: గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. బంజారా సేవా సంఘం ఆధ్వర్యాన మండల కేంద్రంలోని గడికోట మైదానంలో సోమవారం సేవాలాల్ మహారాజ్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ సిద్ధాంతాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆచారాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయన్నారు. విద్య, రాజకీయ రంగాల్లో దూసుకెళ్లడంతో పాటు ఆర్థిక పరిపుష్టి సాధించాలని గిరిజనులకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. గిరిజనులకు ఆసరా, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం పథకాలను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తండాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు ఈవ్వర్నాయక్, బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజూనాయక్ను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బంజారా సేవా సంఘం కార్యదర్శి దీప్లాల్ చౌహాన్, బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు అంగోత్ కృష్ణానాయక్, నాయకులు దిప్లాల్నాయక్ బీ రవినాయక్, మోతీలాల్‌నాయక్, రాజునాయక్, జంప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పులికాట్ కేంద్రంగా... ఎర్రల దందా!
ప్రతి రోజూ రూ.500 కేజీల అక్రమ రవాణా రూ.లక్షలు సంపాదిస్తున్న దళారులు చిల్లకూరు: పులికాట్ కేంద్రంగా వానపాముల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి రోజూ సుమారు 500 కేజీల వరకు తరలిపోతున్నాయి. భూమిని తొలిచి పంటలకు ఆక్సిజన్ అందించడంలో వానపాములు(ఎర్ర లు) రైతుల కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో గిరాకీ పెరిగింది. ఇది ఎక్కవ శాతం పులికాట్‌ను ఆధారం చేసుకుని దాందా సాగుతోంది. ఎందుకు వినియోగిస్తారంటే: వానపాములు ఎక్కువగా రొయ్యలకు మేతగా వినియోగి స్తారు. ఇవి ఎంత తింటే అంత బలంగా రొయ్యలు పెరుగుతాయి. రొయ్యల గుంతలు సాగు చేసే వారు ఎర్రల కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. పులికాట్ ప్రాంతంలో దోరికే వాటికి మండి డిమాండ్ ఉండటంతో ప్రకాశం, తూర్పుగోదావరి ప్రాంతాల్లోని రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేవారు పోటీ పడిమరీ కొనుగోలు చేస్తుండటంతో వాటికి మంచి గిరాకి ఏర్పడింది. తల్లి రొయ్యకు వానపామును ఆహారంగా వేస్తే లక్ష గుడ్లు పెట్టే రొయ్య అంతకు మించి గుడ్లు పెడుతుంది. వివిధ మార్గాల్లో: సాధారణంగా దొరికే వానపాముల కంటే పులికాట్లో దొరికేవి పుష్టిగా ఉండటమే కాకుండా రొ య్యలకు మంచి బలం చేకూర్చుతుండటంతో ఆ ప్రాం తంలోనే వాటి కోసం అన్వేషణ ఎక్కువైంది. దీంతో దళారులు ఆ ప్రాంతలోని గిరిజనులను మచ్చిక చేసుకుని వారికి డబ్బు ఆశచూపి ప్రతిరోజూ వానపాములను తవ్వి తరలిస్తున్నారు. వీటిని కొంత మంది కుండల్లో, టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లలో ఉంచి బస్సు, లారీలు, ప్రైవేట్ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేజీ రూ.3 వేలు పలుకుతున్న ధర: పులికాట్ ప్రాంతంలో సేకరించిన ఎర్రలకు కేజీ రూ.3 నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. పులికాట్లో గిరిజనులు సేకరించే వాటికి మాత్రం కేజీకి రూ.40 ఇచ్చి, దళారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
మళ్లీ వస్తా...అందరితో మాట్లాడతా...
గిరిజనులు పైకొస్తున్నారు పిల్లల్ని బాగా చదివించండి గిరిజన మహిళలతో గవర్నర్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గవర్నర్ హోదాలో తొలిసారి సీతంపేటకు వచ్చిన ఈఎస్ఎల్ నరిసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ గిరిజన సంస్కృతిని చూసి ఉప్పొంగిపోయారు. గిరిజనులు, వారి పిల్లలతో మాట్లాడి వారిలో ఉత్సాహం నింపారు. కుశల ప్రశ్నలు వేస్తూ వారి భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం శ్రీకూర్మనాధుడిని దర్శించుకొన్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలందజేశారు. దేవుడి చరిత్ర అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకాకుళం నుంచి మల్లి గ్రామంలోని గురుకులాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడారు. ఆరో తరగతికి వెళ్లి ఓ విద్యార్థి పుస్తకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పి. లక్ష్మీనృసింహం ద్వారా సవర లిపిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. తరువాత అక్కడి ఐటీడీఏ పీఎంఆర్సీ భవనంలో మహిళలు, అధికారులతో మాట్లాడారు. కుశల ప్రశ్నలేసిన గవర్నర్ కిలారు గ్రామానికి చెదిన కె.వరలక్ష్మిని పిలిచి ఏం చేస్తున్నావని, ఎంత సంపాదిస్తున్నావని, మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారని గవర్నర్ అడగ్గా తమ గ్రూపులో 15 మంది ఉన్నారని, బ్యాంకు లింకేజీ ద్వారా రుణం తీసుకున్నామని, పుట్టగొడుగులు పెంచుతున్నామని చెప్పింది. మాలతి అనే మరో మహిళనుద్దేశించి గవర్నర్ కుశల ప్రశ్నలడిగారు. ఆమె మాట్లాడుతూ మేకలు, గొర్రెలు పెంచుకుంటున్నామని, జీడి, చింతపండు విక్రయిస్తుంటామని, ఉపాధి హామీ పనులకు వెళ్తుంటామని చెప్పింది. మద్యం మానేయూలి మహిళలతో గవర్నర్, కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఎంతమంది మద్యం సేవిస్తున్నారంటూ ఈ రోజు నుంచి వారంతా మద్యం మానేయాలని, మళ్లీ తాను వస్తానని, అప్పుడు మళ్లీ మాట్లాడతానన్నారు. తాగుడు మానేస్తే ఆదాయం రెండింతలు అవుతుందని, ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు పెడుతోందని, మీ పిల్లలు బాగా చదువుకోవాలని గవర్నర్ కోరారు. చదువు ఆపేయొద్దని, అలాంటి వాళ్లతో మాట్లాడొద్దని సూచించారు. మద్యం సేవించేవారిని గ్రామం నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించండంటూ హితవు పలికారు. గిరిజనులు పైకి వస్తున్నారని, బాగా మాట్లాడగలుతున్నారని, వారు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతి, గవర్నర్ కార్యదర్శి ఎస్. రమేష్‌కుమార్, జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భలే భూగోతం..!
ల్యాండ్ బ్యాంకు పేరిట భూముల గుర్తింపు-ఆపై లాక్కునేందుకు ఎత్తుగడ భూ కామందుల చేతుల్లో ఉన్న భూమి ఊసెత్తని యంత్రాంగం ఏడు విడతల్లో పంపిణీ చేసిన భూమే సింహభాగం ఫారెస్ట్ల్యాండునూ ల్యాండ్బ్యాంకులో పొందుపరిచి గందర గోళం చేస్తున్న ప్రభుత్వం మాకు దిక్కెవరంటున్న హరిజన, గిరిజనులు విజయనగరం కంటోన్మెంట్: హరిజన, గిరిజనుల సంక్షేమానికి విడుదల చేస్తున్న వందల కోట్ల రూపాయలు ఏమైపోతున్నాయో తెలియదు కానీ ఇప్పుడు వారు అనుభవిస్తున్న భూములకూ రెక్కలొస్తున్నాయి. ల్యాండు బ్యాంకు పేరుతో డిపట్టాలను లాక్కునేందుకు ప్రభుత్వమే పన్నాగం పన్ను తోంది. ఇప్పటికే భూ కామందుల ఆక్రమణలతో అల్లాడిపోతున్న నిరుపేదలపై ఏకంగా ప్రభుత్వమే ల్యాండ్ బ్యాంకును తెరిచి పేదోళ్ల భూములను పారిశ్రామిక వేత్తలకు, అభివృద్ధి కార్యక్రమాల పేరిట పందేరం చేసేందుకు పక్కా ప్రణాళికను రచించింది. అధికారులపై ఒత్తిడి భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం డిపట్టా భూములపై కన్నేసింది. ల్యాండ్‌బ్యాంకు పేరిట ఒక చోట చేర్చి ఉంచింది. ఎప్పుడైనా ఆ భూములను లాక్కునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో వేలాది మంది నిరుపేద డిపట్టాదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 37,923.17 ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకు కింద పోగేశారు. ఈ భూమిని సాగు చేస్తున్న వారికి నోటిఫికేషన్, నోటీసులు ఇచ్చి భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వ నిర్ణయం. ఇందు కోసం కలెక్టర్, రెవెన్యూ అధికారులతో పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి వారిపైనా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వ భూములతో పాటు పేదవారికిచ్చిన డిపట్టా భూములను కేటగిరీలుగా విభజించి వాటిని పార్శిళ్లుగా వర్గీకరించారు. జిల్లాలో ఒకటి నుంచి 50 ఎకరాలు ఒక కేటగిరీగా, 51 నుంచి 100 ఎకరాలు ఒక కేటగిరిగా, వంద ఎకరాలనుంచి ఆపైన ఉన్న భూములను మూడో కేటగిరీగా విభజించారు. జిల్లాలోని 34 మండలాల్లో 79 చోట్ల 818 పార్శిళ్లుగా విభజించారు. మహానేత ఆశయానికి తూట్లు: గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. సాగు చేసుకుని ఉపాధి పొందుతున్న వారికి పట్టాలు అందజేశారు. గతంలో ఏడు విడతల భూపంపిణీల్లో కలిపి 56,622 మందికి 69,476 ఎకరాలు పంపిణీ చేశారు. ఇందులో 12057 మంది ఎస్సీలకు 13959 ఎకరాలు, 22701 మందికి 33,760.52 ఎకరాలను పంపిణీ చేశారు. మిగతా భూమి బీసీలు, ఓసీలకు పంపిణీ చేశారు. అయితే ఓసీ, బీసీలు మినహా ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూముల్లో సింహభాగం ప్రస్తుతం చేతులు మారి పలువురి వద్ద ఉంది. వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయని ప్రభుత్వం పేదల చేతుల్లోని భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఇలా డి పట్టాలను పొందిన వారి భూములను కూడా లాక్కునేందుకు ల్యాండ్ బ్యాంకులో పొందుపరచడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనిపై పలు ప్రజా సంఘాలు పోరాడేందుకు నడుం బిగిస్తున్నాయి. ఫారెస్ట్ భూములు కూడా..ల్యాండ్ బ్యాంకు పేరిట ప్రభుత్వం అటవీ భూములను కూడా పొందుపరిచింది. డిపట్టాలు ఇచ్చాక వారికి భూమి ఎక్కడ ఉందో చూపించేందుకు సబ్ డివిజన్ చేయలేదు. జిల్లాలో 8 వేల ఎకరాలుంటుంది.ఎవరి భూమి ఏదో తెలియకముందే వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళిక రచించడం దారుణమని పలువురు ఆవేదన చెందుతున్నారు -
నలుగుర్ని అపహరించిన మావోయిస్టులు
ఖమ్మం జిల్లాలో నలుగురు గిరిజనుల్ని మావోయిస్టులు అపహరించుకుపోయారు. చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ పరిధిలోని చలమల గ్రామానికి చెందిన మడకం ముత్తయ్య, మడకం రాజశేఖర్, మడకం రమేష్, వాసం కన్నారావులను సాయుధులైన మావోయిస్టులు సోమవారం రాత్రి అపహరించుకు పోయినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని గ్రామస్తులను మావోయిస్టులు హెచ్చరించినట్టు సమాచారం. ఈ ఘటనని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. -
గజరాజుల హల్చల్
కొత్తూరు : ఏజెన్సీలోని గూడల్లో రోజూ ఏదో ఒక ప్రాంతంలో గజరాజులు హడావుడి చేస్తున్నాయి. గిరిజనుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కొత్తూరు మండలం లబ్బ పంచాయతీ పరిధి ఎగువ దొండమామిడిగూడలో హల్చల్ చేశాయి. గిరిజనగూడ శివారున ఉన్న సవర పంచారకు చెందిన పూరిపాక గోడను తోసి ధ్వంసం చేశాయి. ఏనుగుల ఘీంకారాలతో గ్రామం మార్మోగింది. దీంతో గిరిజనులు ఆందోళన చెంది రాత్రంతా ప్రాణాలు అరచేతపట్టుకుని జాగారం ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఇంట్లోకి చొరబడతాయేమోనని రాత్రంతా కాపలాకాశారు. అదే గ్రామానికి చెందిన సవర సన్నాయి, కుమారి, సింహాద్రి, గయారిలకు చెందిన అరటి, పైనాపిల్, కొండచీపురు పంటలను నాశనం చేశాయి. ఏనుగులు నష్టపరిచిన పంటలను, ధ్వంసం చేసిన గోడను పాతపట్నం ట్రైనీ రేంజర్ మురళీకృష్ణ శనివారం పరిశీలించారు. గిరిజనులకు జరిగిన నష్టాలను నమోదు చేసుకున్నారు. ఏనుగుల గుంపు కనిపించినప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఏనుగుల గుంపుపై రాళ్ళు విసరొద్దన్నారు. ఆయనతో పాటు ఏనుగుల ట్రాకర్స్ ఉన్నారు. రూ. 5.5 లక్షల పరిహారం ఏనుగులు నష్టపరిచిన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ.5.5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఫారెస్టు సెక్షన్ అధికారి, ట్రైనీ రేంజర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ నిధులతో హిరమండలం, సీతంపేట మండలాల్లో నష్టపరిచిన పంటలకు ముందుగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఏనుగులు గిరిజన గ్రామాల్లోకి చొరబడకుండా కందిరీగల శబ్దం వచ్చే మెషీన్లతో చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఆ శబ్దం వస్తే ఏనుగులు అటువైపు రావని చెప్పారు. గతంలో కారప్పొడితో మంటలు పెట్టామన్నారు. ఈ సారి నూతనంగా వచ్చిన కందిరీగ శబ్దాలతో ఏనుగులను అడవుల్లోకి పంపిస్తున్నామని తెలిపారు.