కశ్మీరీ పశుమినా షాల్స్ కప్పుకోవడం ఒకప్పటి ఫ్యాషన్. ఒకనాటి భాగ్యవంతుల, మేధావుల ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అది. కశ్మీర్ వస్త్రాన్నీ, ఒరిస్సా–బెంగాల్ డిజైన్లనీ, లద్దాఖ్ గిరిజనుల కళా నైపుణ్యాలనూ కలగలిపి కనుమరుగవుతున్న పశుమినాఫాల్స్‌కు కొత్త సొబగులద్ది మళ్లీ వాటికి మళ్లీ ప్రాణం పోసింది ఫ్యాషన్ డిజైనర్ ‘స్టాంజిన్ పాల్‌మో’! రండి... ఆమెను పరిచయం చేసుకుందాం.
కశ్మీర్ నుంచి యాపిల్ వస్తోంది, వాల్‌నట్ వస్తోంది. పశుమినా షాల్ వస్తోంది. ఇవన్నీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరిస్తున్నాయి. కానీ వాటి పేర్లతో మరెన్నో నకిలీలు కూడా రాజ్యమేలుతుంటాయి. ఒకప్పుడు కశ్మీర్ పశుమినా షాల్ ధరించడం అంటే స్టేటస్ సింబల్. రచయితలు తమ రచనల్లో సంపన్న కుటుంబంలోని మహిళ వర్ణనలో కశ్మీరీ పశుమినా షాల్ ఉండేది. ఆ పశుమినా షాల్ తెరమరుగవుతున్న టైమ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్... కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. పశుమినా మెటీరియల్‌తో ఓవర్ కోట్‌తోపాటు మరికొన్ని సొబగులద్ది ఈ ఏడాది ముంబయిలో జరిగిన‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో ప్రదర్శించింది. ఇరవై ఆరేళ్ల స్టాంజిన్ పాల్‌మో చేసిన ప్రయోగం కశ్మీర్‌లోని స్థానిక తెగల గిరిజనులకు కొత్త ఉపాధికి మార్గమైంది.
స్టాంజిన్ పాల్‌మో ఢిల్లీ, నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేసింది. సోనాల్ వర్మ వంటి సీనియర్ డిజైనర్‌తోపాటు అనేక మంది డిజైనింగ్ ఎక్స్‌పర్ట్‌ల దగ్గర పని చేసింది. వారితోపాటు విదేశాల్లో జరిగిన ఫ్యాషన్‌షోలలో కూడా పాల్గొన్నది. ఈ క్రమంలో రెండేళ్ల కిందట లధాక్ చేనేత మగ్గాల గురించి తెలిసిన తర్వాత సొంతంగా ప్రయోగాలు మొదలు పెట్టింది. డిజైనింగ్ రంగంలో ‘జిల్‌జామ్’ బ్రాండ్‌తో తన మార్కును విజయవంతంగా చూపిస్తోంది. ‘‘లధాక్, లే... చేనేత గురించి తెలుసుకునే కొద్దీ... నేను వెతుకుతున్న వజ్రమేదో దొరికినట్లయింది. ‘బిట్‌వీన్ ద ఎర్త్ అండ్ స్కై’ కాన్సెప్ట్‌తో రూపొందించిన డిజైన్‌లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి’’ అన్నారామె. ‘‘పశుమినా వస్త్రానికి పొట్టేలు, జడల బర్రె, ఒంటెల నుంచి సేకరించిన ఊలును ఉపయోగిస్తారు. కశ్మీర్‌లోని లధాక్‌లో నివసించే గిరిజనులు ఈ నేతలో నిపుణులు.
నిజానికి పశుమినా ఫ్యాబ్రిక్‌ను నేను ప్రమోట్ చేశానని ఎవరైనా అంటే అది శుద్ధ అబద్ధం. ‘పశుమినా’ అనే పదమే ఒక బ్రాండ్. ఆ చేనేతలో దాగిన పనితనాన్ని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావు. అయితే ఇంత వరకు ఈ ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వాళ్లు తక్కువ. ఇప్పుడు కొత్త తరానికి సరికొత్త రూపంలో పరిచయం చేయగలిగాను. ఇందులో నా పాత్ర ఇంత వరకే. ఇందులో నేను తెచ్చిన కొత్తదనమంతా రెండు–మూడు రకాల కళలను మిళితం చేయడమే. కశ్మీర్‌లో తయారైన సంప్రదాయ పశుమినా వస్త్రం మీద ఒడిషా, బెంగాల్ సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్‌లను వేయించాను. ఢిల్లీలో ఒడిషా, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన కారీగార్ కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్లంతా వాళ్లకు వచ్చిన సంప్రదాయ ఎంబ్రాయిడరీ పనులకు గిరాకీ లేక, ఆటో నడుపుతూ, వాచ్‌మెన్‌లుగా జీవిస్తున్నారు.
వారి కుటుంబాల్లో ఆడవాళ్లందరికీ ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది. వాళ్లకు ఈ పశుమినా శాలువాల మీద ఎంబ్రాయిడరీ చేయించాను. ఈ రకంగా కశ్మీర్ చేనేతను, ఒడిషా ఎంబ్రాయిడరీని దేశమంతటికీ తెలిసేలా చేయగలిగాను. ఇక విదేశాల్లో వీటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనేది నా లక్ష్యం. అదే జరిగితే... ఈ వస్త్రాలను నేసే మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం వేయగలిగిన దాన్నవుతాను. ఈ వస్త్రాలు ఎంతటి చలినైనా అపగలుగుతాయి. ధరించిన వారికి నులివెచ్చని అనుభూతినిస్తాయి. విదేశాల్లో తయారవుతున్న ఊలుకంటే కశ్మీర్ పశుమినా వస్త్రాలు కంటికి ఇంపుగా కూడా ఉంటాయి. అందుకే మన కళను ఖండాంతరాలు దాటించడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నాను’’ అన్నారు స్టాంజిన్.
లధాక్ మహిళలు ఏడాదిలో ఆరు నెలల పాటు వస్త్రాలను నేస్తారు. మిగిలిన ఆరు నెలలు నేతకు వాతావరణం సహకరించదు. ఇప్పటి వరకు వాళ్లకు ఉన్న ఏకైక మార్కెటింగ్ జోన్ పర్యాటకం మాత్రమే. ‘‘ఈ శాలువాలను కశ్మీర్ పర్యటకను వచ్చే పర్యాటకులకు అమ్ముకుంటున్నారు. సంప్రదాయ డిజైన్‌లకు పరిమితమైన లధాక్, లే మహిళలకు వాళ్ల చుట్టూ ఉన్న అందాలనే వస్త్రాల్లో నిక్షిప్తం చేయగలిగేలా శిక్షణ ఇచ్చాను. ఆల్రెడీ చెయ్యి తిరిగిన వాళ్లు కావడంతో నేనిచ్చిన కొత్త డిజైన్‌లను త్వరగా ఒంటబట్టించుకున్నారు. కశ్మీర్ మహిళల నేత నైపుణ్యం ఇప్పటి వరకు కశ్మీర్ పర్యటనకు వెళ్లి వచ్చిన వాళ్ల దగ్గర మాత్రమే కనిపించేది. నా ప్రయత్నంలో దేశంలో ప్రతి ఇంటికీ కశ్మీర్ శాలువాను చేర్చగలుగుతాను. అలాగే... ప్రతి ఒక్కరినీ కశ్మీర్‌కు తీసుకెళ్లలేను, కానీ కశ్మీర్‌ను ప్రపంచమంతటికీ విస్తరించగలుగుతాను’’ అన్నారు స్టాంజిన్ ధీమాగా.
సాధికార మహిళలు
స్టాంజిన్... తన డిజైనింగ్ ప్రయోగం కోసం లధాక్, లేలలో అనేక గ్రామాల్లో పర్యటించారు. ఆ సంగతులను తెలియచేస్తూ ... ‘‘ఆ మహిళలతో మాట్లాడినప్పుడు ఆధునిక ప్రపంచం ఆశ్యర్చపడే విషయాలెన్నో తెలిశాయి. పని చేయడం మాత్రమే కాదు, కుటుంబానికి తమ శ్రమ ఎంత అవసరమో వాళ్లకు తెలుసు, అలాగే కుటుంబానికి తమ అవసరంతోపాటు కుటుంబంలో తమ ప్రాధాన్యత ఎంతో కూడా వాళ్లకు బాగా తెలుసు. వాళ్లకు జీవితం పట్ల ఆందోళన లేదు, వాళ్ల మాటల్లో నిరాశనిస్పృహలు లేవు.
ఊలు సేకరణ, ప్రాసెసింగ్‌తోపాటు వడకడం, వస్త్రాన్ని నేయడం వరకు అనేక దశల్లో మహిళల సేవలే కీలకం. ఇప్పుడు నాతో యాభై మంది మహిళలు పని చేస్తున్నారు. తాము తయారు చేసిన షాల్‌ను... జాకెట్, కోట్ రూపంలో చూసుకుని సంతోషిస్తున్నారు. తమ పిల్లలకు వాటిని వేసుకుని మురిసిపోతున్నారు. వాళ్లను చూసినప్పుడు నా బ్రాండ్‌లను అక్కడి పిల్లలు కూడా ప్రమోట్ చేస్తున్నారనే సంతోషం కలుగుతుంటుంది’’ అన్నారు స్టాంజిన్ పాల్‌మో.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment