గిరిజనుల అభ్యున్నతికి సీఎం కృషి
తండాలను పంచాయతీలుగా గుర్తిస్తారు
ఎమ్మెల్సీ రాములునాయక్
మహేశ్వరంలో సేవాలాల్
జయంతి సభ
మహేశ్వరం: గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. బంజారా సేవా సంఘం ఆధ్వర్యాన మండల కేంద్రంలోని గడికోట మైదానంలో సోమవారం సేవాలాల్ మహారాజ్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ సిద్ధాంతాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆచారాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయన్నారు.
విద్య, రాజకీయ రంగాల్లో దూసుకెళ్లడంతో పాటు ఆర్థిక పరిపుష్టి సాధించాలని గిరిజనులకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. గిరిజనులకు ఆసరా, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్‌రూం పథకాలను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తండాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు ఈవ్వర్‌నాయక్, బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజూనాయక్‌ను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బంజారా సేవా సంఘం కార్యదర్శి దీప్‌లాల్ చౌహాన్, బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు అంగోత్ కృష్ణానాయక్, నాయకులు దిప్‌లాల్‌నాయక్ బీ రవినాయక్, మోతీలాల్‌నాయక్, రాజునాయక్, జంప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.