గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే
మాలీ మహా సంఘం డిమాండ్
బేల : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, ఇందులో మాలీలకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే చెల్లప్ప కమిషన్ ద్వారా సర్వే చేయించి ఎస్టీల జాబితాలో చేర్చాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేట్కులే సుకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక అంతరాష్ట్ర రోడ్డుపై స్థానిక మాలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక జ్యోతి బా పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి 12శాతం రిజర్వేషన్ గిరిజనులకు కల్పిస్తామని, అందులో మాలీలకు చోటు కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఉత్తరాలు రాసిన తరుణంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హైదరాబాద్‌లో సమావేశమై 9.5శాతం రిజర్వేషన్ ఇస్తే సరిపోతుందనడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని మాలీ మహా సంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
ప్రజాప్రతినిధుల తీరుకు నిరసనగా వారి ఇళ్లను ముట్టడి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్నులే సురేశ్, కోశాధికారి గుర్నులే సతీశ్, జిల్లా యువజన కార్యదర్శి రాట్గురే విజయ్, మండల అధ్యక్షులు షిండే అంబదాస్, ప్రధాన కార్యదర్శి వాడయి వివేక్, ప్రచార కార్యదర్శి నాగోసే మురళీదర్, మాలీ కులస్తులు పాల్గొన్నారు.