మళ్లీ వస్తా...అందరితో మాట్లాడతా... | Comes back again | Sakshi
Sakshi News home page

మళ్లీ వస్తా...అందరితో మాట్లాడతా...

Published Tue, Feb 16 2016 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

మళ్లీ వస్తా...అందరితో మాట్లాడతా...

మళ్లీ వస్తా...అందరితో మాట్లాడతా...

గిరిజనులు పైకొస్తున్నారు
పిల్లల్ని బాగా చదివించండి
గిరిజన మహిళలతో గవర్నర్

    
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గవర్నర్ హోదాలో తొలిసారి సీతంపేటకు వచ్చిన ఈఎస్‌ఎల్ నరిసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ గిరిజన సంస్కృతిని చూసి ఉప్పొంగిపోయారు. గిరిజనులు, వారి పిల్లలతో మాట్లాడి వారిలో ఉత్సాహం నింపారు. కుశల ప్రశ్నలు వేస్తూ వారి భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం శ్రీకూర్మనాధుడిని దర్శించుకొన్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలందజేశారు. దేవుడి చరిత్ర అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకాకుళం నుంచి మల్లి గ్రామంలోని గురుకులాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడారు. ఆరో తరగతికి వెళ్లి ఓ విద్యార్థి పుస్తకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పి. లక్ష్మీనృసింహం ద్వారా సవర లిపిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. తరువాత అక్కడి ఐటీడీఏ పీఎంఆర్‌సీ భవనంలో మహిళలు, అధికారులతో మాట్లాడారు.


 కుశల ప్రశ్నలేసిన గవర్నర్
కిలారు గ్రామానికి చెదిన కె.వరలక్ష్మిని పిలిచి ఏం చేస్తున్నావని, ఎంత సంపాదిస్తున్నావని, మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారని గవర్నర్ అడగ్గా తమ గ్రూపులో 15 మంది ఉన్నారని, బ్యాంకు లింకేజీ ద్వారా రుణం తీసుకున్నామని, పుట్టగొడుగులు పెంచుతున్నామని చెప్పింది. మాలతి అనే మరో మహిళనుద్దేశించి గవర్నర్ కుశల ప్రశ్నలడిగారు. ఆమె మాట్లాడుతూ మేకలు, గొర్రెలు పెంచుకుంటున్నామని, జీడి, చింతపండు విక్రయిస్తుంటామని, ఉపాధి హామీ పనులకు వెళ్తుంటామని చెప్పింది.


 మద్యం మానేయూలి
మహిళలతో గవర్నర్, కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఎంతమంది మద్యం సేవిస్తున్నారంటూ ఈ రోజు నుంచి వారంతా మద్యం మానేయాలని, మళ్లీ తాను వస్తానని, అప్పుడు మళ్లీ మాట్లాడతానన్నారు. తాగుడు మానేస్తే ఆదాయం రెండింతలు అవుతుందని, ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు పెడుతోందని, మీ పిల్లలు బాగా చదువుకోవాలని గవర్నర్ కోరారు. చదువు ఆపేయొద్దని, అలాంటి వాళ్లతో మాట్లాడొద్దని సూచించారు. మద్యం సేవించేవారిని గ్రామం నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించండంటూ హితవు పలికారు. గిరిజనులు పైకి వస్తున్నారని, బాగా మాట్లాడగలుతున్నారని, వారు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతి, గవర్నర్ కార్యదర్శి ఎస్. రమేష్‌కుమార్, జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement