Vimala Narasimhan
-
దుఃఖం ఆపుకోలేకపోయారు...
సాక్షి, హైదరాబాద్ : ఎవరినీ నొప్పించని మనస్తత్వం, అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వభావం గవర్నర్ నరసింహన్ సొంతం. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన... ఇక బై..బై అంటూ చెన్నైకి పయనమయ్యారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం ప్రగతిభవన్‌లో గవర్నర్ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, విమలా నరసింహన్, సీఎం కేసీఆర్ ఉద్విగ్నానికి లోనయ్యారు. దుఃఖం ఆపుకోలేకపోయారు. మరోవైపు తమకు లభించిన ఆదరాభిమానాలకు చలించిన గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కంటతడి పెట్టారు. కాగా అంతకు ముందు గవర్నర్ దంపతులను సీఎం దంపతులతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. (చదవండి: నా పేరు నరసింహన్) -
వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన గవర్నర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ ఉద్యోగులకు నిర్వహించే వార్షిక క్రీడాపోటీలను గవర్నర్ దంపతులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ షటిల్ ఆడారు. ఆయన సతీమణి విమలా నరసింహన్ మహిళాఉద్యోగులతో కలసి క్యారమ్స్ ఆడారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్– 2018లో భాగంగా ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ రాజ్‌భవన్ ఉన్నతా«ధికారులు, ఉద్యోగులతో కలసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గవర్నర్ సలహాదారు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి పాల్గొన్నారు. -
మళ్లీ వస్తా...అందరితో మాట్లాడతా...
గిరిజనులు పైకొస్తున్నారు పిల్లల్ని బాగా చదివించండి గిరిజన మహిళలతో గవర్నర్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గవర్నర్ హోదాలో తొలిసారి సీతంపేటకు వచ్చిన ఈఎస్ఎల్ నరిసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ గిరిజన సంస్కృతిని చూసి ఉప్పొంగిపోయారు. గిరిజనులు, వారి పిల్లలతో మాట్లాడి వారిలో ఉత్సాహం నింపారు. కుశల ప్రశ్నలు వేస్తూ వారి భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం శ్రీకూర్మనాధుడిని దర్శించుకొన్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలందజేశారు. దేవుడి చరిత్ర అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకాకుళం నుంచి మల్లి గ్రామంలోని గురుకులాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడారు. ఆరో తరగతికి వెళ్లి ఓ విద్యార్థి పుస్తకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పి. లక్ష్మీనృసింహం ద్వారా సవర లిపిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. తరువాత అక్కడి ఐటీడీఏ పీఎంఆర్సీ భవనంలో మహిళలు, అధికారులతో మాట్లాడారు. కుశల ప్రశ్నలేసిన గవర్నర్ కిలారు గ్రామానికి చెదిన కె.వరలక్ష్మిని పిలిచి ఏం చేస్తున్నావని, ఎంత సంపాదిస్తున్నావని, మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారని గవర్నర్ అడగ్గా తమ గ్రూపులో 15 మంది ఉన్నారని, బ్యాంకు లింకేజీ ద్వారా రుణం తీసుకున్నామని, పుట్టగొడుగులు పెంచుతున్నామని చెప్పింది. మాలతి అనే మరో మహిళనుద్దేశించి గవర్నర్ కుశల ప్రశ్నలడిగారు. ఆమె మాట్లాడుతూ మేకలు, గొర్రెలు పెంచుకుంటున్నామని, జీడి, చింతపండు విక్రయిస్తుంటామని, ఉపాధి హామీ పనులకు వెళ్తుంటామని చెప్పింది. మద్యం మానేయూలి మహిళలతో గవర్నర్, కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఎంతమంది మద్యం సేవిస్తున్నారంటూ ఈ రోజు నుంచి వారంతా మద్యం మానేయాలని, మళ్లీ తాను వస్తానని, అప్పుడు మళ్లీ మాట్లాడతానన్నారు. తాగుడు మానేస్తే ఆదాయం రెండింతలు అవుతుందని, ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు పెడుతోందని, మీ పిల్లలు బాగా చదువుకోవాలని గవర్నర్ కోరారు. చదువు ఆపేయొద్దని, అలాంటి వాళ్లతో మాట్లాడొద్దని సూచించారు. మద్యం సేవించేవారిని గ్రామం నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించండంటూ హితవు పలికారు. గిరిజనులు పైకి వస్తున్నారని, బాగా మాట్లాడగలుతున్నారని, వారు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతి, గవర్నర్ కార్యదర్శి ఎస్. రమేష్‌కుమార్, జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సత్యసాయి విద్యాసంస్థలు గ్రామాలకు విస్తరించాలి
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచన సాక్షి, విశాఖపట్నం/రాజాం(శ్రీకాకుళం): నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, అలాంటి విద్య సత్యసాయి విద్యా సంస్థల ద్వారా అందుతోందని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్యసాయి విద్యాసంస్థలు విస్తరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి పాఠశాలల ఐదో జాతీయ స్థాయి సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సత్యసాయి కూడా విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. మానవ విలువలు విద్యలో భాగంగా ఉండాలని, విలువల్లేని విద్య శూన్యమని చెప్పారు. 1970లో పుట్టపర్తిలోనే ఉద్యోగ జీవితాన్ని ఆరంభించానని, అప్పట్నుంచే సత్యసాయిబాబాతో తన అనుబంధం మొదలైందని గుర్తుచేసుకున్నారు. సత్యసాయి విద్యా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండ్యా మాట్లాడుతూ ప్రశాంతి నిలయంలో ఇంటర్నేషనల్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. దేశం గర్వించేలా ఎదగండి.. దేశం గర్వించదగ్గ శక్తిలా ఎదగాలని విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉద్బోధించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్‌ఐటీ కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి భావాలతో పాటు ఆధ్యాత్మికత, యోగశక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని గవర్నర్ కోరారు. ఆరోగ్యం, విద్య ప్రధానాంశాలుగా విలువలతో కూడిన విద్యను ప్రాథమిక స్థాయి నుంచే అభ్యసించి బలమైన పునాదులు వేసుకోవాలని ఆకాంక్షించారు. గురువులను గౌరవించడం, తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చడం వంటి విషయాలను కూడా విద్యాలయాల్లో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు, మాజీ డీజీపీ హెచ్‌జె దొర, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సీఈవో రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు.