కొత్తూరు : ఏజెన్సీలోని గూడల్లో రోజూ ఏదో ఒక ప్రాంతంలో గజరాజులు హడావుడి చేస్తున్నాయి. గిరిజనుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కొత్తూరు మండలం లబ్బ పంచాయతీ పరిధి ఎగువ దొండమామిడిగూడలో హల్‌చల్ చేశాయి. గిరిజనగూడ శివారున ఉన్న సవర పంచారకు చెందిన పూరిపాక గోడను తోసి ధ్వంసం చేశాయి. ఏనుగుల ఘీంకారాలతో గ్రామం మార్మోగింది. దీంతో గిరిజనులు ఆందోళన చెంది రాత్రంతా ప్రాణాలు అరచేతపట్టుకుని జాగారం ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఇంట్లోకి చొరబడతాయేమోనని రాత్రంతా కాపలాకాశారు.
అదే గ్రామానికి చెందిన సవర సన్నాయి, కుమారి, సింహాద్రి, గయారిలకు చెందిన అరటి, పైనాపిల్, కొండచీపురు పంటలను నాశనం చేశాయి. ఏనుగులు నష్టపరిచిన పంటలను, ధ్వంసం చేసిన గోడను పాతపట్నం ట్రైనీ రేంజర్ మురళీకృష్ణ శనివారం పరిశీలించారు. గిరిజనులకు జరిగిన నష్టాలను నమోదు చేసుకున్నారు. ఏనుగుల గుంపు కనిపించినప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఏనుగుల గుంపుపై రాళ్ళు విసరొద్దన్నారు. ఆయనతో పాటు ఏనుగుల ట్రాకర్స్ ఉన్నారు.
రూ. 5.5 లక్షల పరిహారం
ఏనుగులు నష్టపరిచిన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ.5.5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఫారెస్టు సెక్షన్ అధికారి, ట్రైనీ రేంజర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ నిధులతో హిరమండలం, సీతంపేట మండలాల్లో నష్టపరిచిన పంటలకు ముందుగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఏనుగులు గిరిజన గ్రామాల్లోకి చొరబడకుండా కందిరీగల శబ్దం వచ్చే మెషీన్‌లతో చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఆ శబ్దం వస్తే ఏనుగులు అటువైపు రావని చెప్పారు. గతంలో కారప్పొడితో మంటలు పెట్టామన్నారు. ఈ సారి నూతనంగా వచ్చిన కందిరీగ శబ్దాలతో ఏనుగులను అడవుల్లోకి పంపిస్తున్నామని తెలిపారు.
గజరాజుల హల్‌చల్
Published Sun, Jun 28 2015 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement