ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు తన కాళ్ల మీద తాను నిలబడి.. ఊరు కాని ఊళ్లో చెమటోడ్చి పెళ్లాం పిల్లలను పోషించుకుంటున్నాడని తలచి స్థిమితపడ్డ తల్లి, ఒక్కసారిగా తన ఆలోచనలు తలకిందులయ్యేసరికి తట్టుకోలేకపోయింది. మూడు పదులు దాటిన వయస్సులో కుమారుడు మతి తప్పిన తీరులో స్వస్థలానికి చేరుకోవడంతో ఆమె అతలాకుతలమైంది. కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాక.. కృష్ణారామా అనుకోవాల్సిన వయస్సులో.. మీదపడ్డ సమస్య ఆమెను నైరాశ్యం వైపు నెట్టింది. తన బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వస్తుందేమోనన్న బాధతో.. భయంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. పురుగు మందు తాగి ప్రాణాలు విడిచింది. అదే సమయంలో తనయుడు కూడా విషం మింగి.. ఆపై భీతిల్లి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వెంటనే చికిత్స అందించినా అతిడిని కూడా మృత్యువు వెంటాడింది. విధిలీల అర్థం కాదని వ్యథ చెందడం అందరి వంతైంది.
కొత్తూరు: కొత్తూరులోని కొత్తపేట కాలనీకి చెందిన కనపాకల చిన్నమ్మడు (70), ఆమె కుమారుడు శ్రీనివాసరావు (35)లు శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ముందు చిన్నమ్మడు చనిపోగా తర్వాత శ్రీనివాసరావుకు వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నమ్మడుకు కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి.
శ్రీనివాసరావుకు పదేళ్ల కిందట కొత్తూరుకే చెందిన శ్రీదేవితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లిపోయారు. అక్కడే శ్రీనివాసరావు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఐదు రోజుల కిందట శ్రీనివాసరావు ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు కనిపించింది. అర్థం లేకుండా మాట్లాడడం, పిల్లలను ఊరికే కొట్టడం, గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ విడిచి పెట్టడం వంటి పనులు చేసేవాడు.
దీంతో భయపడిన అతని భార్య అక్కడే ఉన్న బంధువులకు విషయం చెప్ప డంతో వారు పరిస్థితిని గమనించి రాత్రుళ్లు కాప లా కాయడం కూడా మొదలుపెట్టారు. అయినా శ్రీనివాసరావు ప్రవర్తన అంతు చిక్కేది కాదు. ఒక క్షణం బాగానే ఉన్నా.. మరుక్షణానికి మారిపోయేవాడు. ఈ నెల 25న శ్రీనివాసరావు అక్కడ ఎవరికీ చెప్పకుండా కొత్తూరు వచ్చేశాడు. ఇక్కడ కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వీధుల్లో తిరిగేవాడు. కొడుకు పరి స్థితి చూసి తల్లి చిన్నమ్మడు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇలాగే చనిపోతాడేమో అని బెంగ పెట్టుకుంది. దెయ్యం పట్టిందేమోనని అతడిని కుటుంబ సభ్యులంతా కలిపి ఓ గిరిజన గ్రామానికి కూడా తీసుకెళ్లారు. కానీ వారు ఆదివారం పూజ చేస్తామని చెప్పి వీరిని పంపించేశారు.
శనివారం ఇంటిలో ఉన్న వారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. తల్లీ కొడుకులు మాత్రం కొత్తూరు నాలుగు రోడ్ల కూడలికి వచ్చి గడ్డి మందును కొన్నారు. వారి ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి ఇద్దరూ ఆ పురుగు మందు తాగేశారు. అయితే పురుగు మందు తాగాక శ్రీనివాసరావు పరుగులు పెడుతూ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. తల్లి అక్కడే పడిపోవడంతో అటుగా వెళ్తున్న ఉపాధి వేతనదారులు ఆమెను గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీ కొడుకులకు స్థానిక సీహెచ్‌సీ వైద్యాధికారి దీప్తి వైద్యం అందించారు.
తల్లి పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆమె అక్కడే చనిపోయారు. శ్రీనివాసరావును కూడా పాలకొండ తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అర్థరాత్రి తర్వాత ఆయన కూడా తనువుచాలించాడు. చిన్నమ్మడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ వై.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలకు పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనతో కొత్తూరులో విషాదం అలముకుంది.
Comments
Please login to add a commentAdd a comment