sriakakulam
-
లాటరీలో రూ.కోటికి పైగా ప్రైజ్‌మనీ: ఆ టికెట్ నకిలీదట!
శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిబ్రవరి 8న తీసుకున్న టికెట్‌కు రూ.కోటీ పాతిక లక్షల ప్రైజ్‌మనీ తగిలినట్లు డ్రా ఫలితాల్లో వచ్చింది. అయితే, ఆ టికెట్ తాము విక్రయించలేదని సదరు వ్యాపారి చెప్పేశాడు. అసలా టికెట్టే నకిలీ అని తేల్చి పారేశారు. లాటరీ డబ్బును ఇచ్చేది లేదని మొండికేశాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు, గత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపాలని డీఎస్పీ మహేంద్రను ఆదేశించారు. కొన్నాళ్లు అంతర్గత విచారణ చేపట్టి ఒకే రోజు నగరంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసేసరికి లాటరీల గుట్టు రట్టయ్యింది. చెప్పాలంటే ఇదొక పెద్ద రాకెట్. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఒక్కసారిగా లక్షాధికారి కావాలనే ఆశతో పేద, బడుగు వర్గాలకు చెందిన ప్రజలు లాటరీలకు బానిసలుగా మారుతున్నారు. నిత్యం లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ నష్టాల్లో కూరుకుపోతున్నారు. బోడోల్యాండ్, తమిళనాడు, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, గోవాలతో పాటు ఇతర దేశాలైన భూటాన్, నేపాల్ టికెట్లు విక్రయిస్తుంటారు. వాటిపై మన రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు. శ్రీకాకుళం కేంద్రంగా చేసుకుని కొందరు వ్యాపారులు ఈ దందాను మూడు పూలు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి టికెట్లు సరఫరా చేస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని ఏజెంట్లకు ముందస్తుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ రూపంలో చెల్లించి ఆ కంపెనీల లాటరీ టికెట్లను బల్క్‌లో తెప్పించుకుంటున్నారు. విక్రయించిన వాటిలో లాటరీ ప్రైజ్‌మనీ తగలగానే రెండో రోజు వ్యాపారి ఖాతాలో నగదు జమ అవుతుంది. అందులో 5 నుంచి 10 శాతం వ్యాపారి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని లాటరీ తగిలిన వ్యక్తికి అందజేస్తున్నారు. టిక్కెట్ల విక్రయాల దగ్గర నుంచి నగదు పంపిణీ వరకు ఒక ప్రణాళికా బద్ధంగా చేపడుతున్నారు. వ్యూహాత్మకంగా నకిలీ లాటరీలు.. ఇతర రాష్ట్రాల లాటరీల ముసుగులో నకిలీ లాటరీలు కూడా నడుపుతున్నారు. సొంతంగా వెబ్సైట్ తయారు చేసుకుని, పలు పేర్లతో లాటరీ టికెట్లు ముద్రించి విక్రయాలు జరుపుతున్నారు. ఏఆర్ డైమండ్, సిక్కిం డాటా, ఏఆర్ లక్ష్మీ, సిక్కిం సూపర్ తదితర పేర్లతో టిక్కెట్లు ముద్రించి విక్రయిస్తున్నారు. అంతా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. ఎవరికెంత ప్రైజ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుని ఆ మేరకు డ్రా తీస్తారు. తక్కువ మొత్తం ప్రైజ్‌ను టికెట్లు కొనుగోలు చేసినోళ్లకి ప్రకటిస్తారు. ఎక్కువ మొత్తం ప్రైజ్ టికెట్లను తమ వద్దే అట్టి పెట్టుకుని ఉంచుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా లాటరీ విక్రయాలు, డ్రా తీయడం చేస్తారు. కొనుగోలు చేసిన వారికి ప్రైజ్ వస్తున్నట్టుగా విజేతలను ప్రకటిస్తారు. పెద్ద మొత్తంలో ప్రైజ్‌లను తమ వద్ద ఉంచుకుని, చిన్న మొత్తం ప్రైజ్‌లను ప్రకటిస్తారు. ఇక్కడ చదవండి: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు.. రూ.20 నుంచి రూ.500 వరకు.. మార్కెట్లో విక్రయించే నిషేధిత లాటరీ టికెట్ ఒక్కొక్కటి రూ.20 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. కుయల్, రోసా, తంగం, నల్లనేరమ్, కుమరన్, విష్ణు పేర్లతో లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. వీటికి లక్షల్లో, కోట్లలో లాటరీ బహుమతులు ఉన్నట్టు చెప్పి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. బహుమతి తమకే తగులుతుందన్న ఆశతో ప్రజలు నిత్యం టికెట్లు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. పలు కంపెనీల లాటరీలకు సంబంధించి నంబర్లను వ్యాపారులు తెల్ల స్లిప్పులపై రాసి విక్రయిస్తున్నారు. డ్రా తేదీకి వారం ముందు నుంచే విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఇదొక పెద్ద రాకెట్.. లాటరీ టికెట్ల వ్యాపారం పెద్ద రాకెట్‌గా నడుస్తోంది. ఇటీవల దొరికిన 16 మందే కాదు...ఆ జాబితా ఇంకా పెద్దదే. ఒక్క శ్రీకాకుళం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే ముసుగులో నకిలీ లాటరీల చెలామణి కూడా జరుగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు జిల్లా వ్యాప్తంగా నిఘా పెడితే లాటరీల గుట్టు మరింత బయటపడనుంది. -
జవాన్ ఉమా మహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
సాక్షి, శ్రీకాకుళం: సరిహద్దులో విధి నిర్వహణలో మృతి చెందిన వీర జవాన్ లావేటి ఉమా మహేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.50లక్షల చెక్కును డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లడూతూ ఆర్మీ జవాన్ ఉమా మహేశ్వరరావు మృతి తీరని లోటుని అన్నారు. ఆయన ప్రాణాలను ఫణంగా పెట్టి దెశాన్ని కాపాడారాని.. ప్రతి ఒక్కరూ వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రూ.50 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ద్వారా వారి కుటుంబానికి అందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అమ్మ కడుపు నుంచి ముళ్ల పొదల మధ్యకు..
సాక్షి,ఇచ్ఛాపురం: నిశ్శబ్దంగా శ్మశానం. గాలి తప్ప ఇంకో అలికిడి లేని వాతావరణం. ఇంకా వెలుతు రు పరుచుకోని సమయం. ఎవరు వదిలి వెళ్లారో.. ఎందుకు వదిలి వెళ్లిపోయారో.. అమ్మ కడుపు గడప దాటి అప్పుడే బయటకు వచ్చిన ఓ మగ శిశువు ఏడుపు శ్మశానాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముళ్ల పొదల మధ్య ఒళ్లంతా చీమలు కుడుతూ ఉంటే ఏడవడం తప్ప ఇంకేం చేయలేని ఆ పసి వాడి రోదన ఇచ్ఛాపురం పరిధిలోని కండ్రవీధి శ్మశానంలో అలజడి రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బుధవారం వేకువ జామున కండ్రవీధికి చెందిన చంద్రమణి బెహరా బహిర్భూమి కోసం శ్మశానం సమీపానికి వెళ్లారు. అక్కడ ముళ్ల పొద ల మధ్య నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడకు వెళ్లి చూడగా.. బ్యాగ్‌లో అప్పుడే పుట్టి న మగ శిశువు కనిపించాడు. బాబును పరిశీలిస్తే శరీరమంతా చీమలు కనిపించాయి. వెంటనే ఆయన బాబును ముళ్ల పొదల నుంచి బయటకు తీసి శరీరాన్ని శుభ్రం చేశారు. చుట్టుపక్కల ఎవ రూ కనిపించకపోవడంతో ఎవరో కావాలనే వది లి వెళ్లిపోయారని నిర్ధారించుకుని ఆ పసివాడిని ఇంటికి తీసుకెళ్లారు. చంద్రమణి బెహరా దంపతులకు వివాహమై 30 ఏళ్లయినా సంతానం లేదు. దీంతో ఈ మగ శిశువును పెంచుకోవచ్చని ఆశ పడ్డారు. బాబుకు స్నానం చేయించి వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది చంద్రమణి బెహరా దంపతుల నుంచి శిశువును స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం శ్రీకాకుళంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే బాబును చంద్రమణి బెహరా దంపతులకే ఇచ్చేయాలని స్థానికులంతా అధికారులను కోరినా వారు ఒప్పుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రీకాకుళంలోని శిశు సంరక్షణ కేంద్రం నుంచి తెచ్చుకోవాలని గెస్ట్ చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ జాస్మిన్ వారికి సూచించారు. -
నకిలీ ఉద్యోగాలు కు c/o సుధాకర్
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో పలాస కేంద్రంగా కార్యాలయం పెట్టి.. రూర్బన్ పేరుతో నకిలీ అపా యింట్మెంట్లు ఇచ్చి, ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖపట్నం సుధాకర్ తెరవెనుక ఉండి పెద్ద కథే నడుపుతున్నాడు. రూర్బన్ పేరుతో జరిగిన మోసాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవ్వడంతో సుధాకర్ అక్రమార్జన కథ అడ్డం తిరిగింది. దీనితో అసలుకే ఎసరు వస్తోందని భావించిన సుధాకర్ కొత్త ఎత్తుగడల్ని సిద్ధం చేసుకున్నాడు. తీగ దొరికినా డొంక కదలకుండా అడ్డుకుంటున్నాడు. విచారణకు దొరక్కుండా ఎత్తులు వేస్తున్నాడు. మీడియాలో రాకుండా మూడో వ్యక్తుల ద్వారా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. అధికార వర్గాలకు కూడా కొంతమందితో ఫోన్ చేయించి విషయం బయటకు రాకుండా చూడాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ►పలాస, అంబుగాంలోని తన నకిలీ కార్యాలయాల బోర్డులు తీసేశాడు. నకిలీ ఉద్యోగాల జిల్లా కోఆర్డినేటర్‌ను బయటకు కనిపించకుండా దాచిపెట్టాడు. ►విచారణ ముందుకు సాగనీయకుండా తనదైన శైలిలో రెండురోజులుగా జిల్లాలో తిష్ట వేసి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ►నకిలీ అపాయింట్మెంట్లు పొందిన నిరుద్యోగుల్ని అంతర్గతంగా బెదిరింపులకు గురి చేయడంతో వారు నేరుగా ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. అక్రమమని తెలిసినా... జిల్లాలో నకిలీ అపాయింట్మెంట్లతో నిరుద్యోగులను మోసగిస్తున్న సుధాకర్ గురించి యంత్రాంగం తూతూమంత్రంగానే వ్యవహరిస్తోంది. సాక్షాత్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ నేరుగా నకిలీ అపాయింట్మెంట్లు జారీ అవుతున్నాయని నోట్ విడుదల చేశారు. మరో వైపు పాలకొండ పోలీస్ స్టేషన్లో అక్కడి ఎంపీడీఓ ఫిర్యాదు కూడా చేశారు. పలాస కేంద్రంగా వ్యవహారాలు నడుపతున్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. అక్కడ కార్యాలయంలో రూర్బన్ మిషన్‌కు సంబంధించిన మెటీరియల్ పోలీసులకు కనిపించింది. ఇన్ని ఉన్నా విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. ►పోలీసుల వద్ద సుధాకర్ నంబర్ ఉన్నా ట్రేస్ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సందేహాలెన్నో.. ఈ నకిలీ బాగోతం వెనుక ఏమీ లేనప్పుడు అక్కడి కార్యాలయాల్లో రూర్బన్ మిషన్, కేంద్ర గ్రామీణ అభి వృద్ధిశాఖ బోర్డులు వంటివి ఎందుకు ఉన్నట్లు.. అక్కడి ఉద్యోగులు ఏం చేస్తున్నారో.. అధికారులు తెలుసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ►నకిలీ అపాయింట్మెంట్ పొందిన నిరుద్యోగులు నేరుగా ఫిర్యాదు చేయలేదనే ఒకే ఒక్క కారణంగా అధికారులు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అంబుగాం, పలాసలో బోర్డులు కూడా తీసేయడంతో నిరుద్యోగులు నిండా మునిగినట్లు కనిపిస్తోంది. ►పలాసలో పోలీసులు కొంతమందిని విచారించారు. విచారణ తూతూ మంత్రంగా సాగినట్లు సమాచారం. గతంలో మోసాలివే... ►మూడేళ్ల క్రితం రాజాం, తాలాడ, మందరాడ కేంద్రాలుగా ఓ యువకుడు ఇండీట్రేడ్ పేరుతో షేర్‌మార్కెట్ పెట్టి, రూ.లక్షకు ప్రతి నెలా రూ.10 వేల అధిక ఆదాయాన్ని చూపించి వందలాదిమందిని నమ్మించాడు. తొలుత ఈ యువకునిపై ఒకరిద్దరు ఫిర్యాదులు చేసిన అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ►ఏడాదిన్నర క్రితం పొందూరులో ఓ వ్యాపారి మినీ స్కీమ్ పేరుతో పెద్ద స్కామ్‌కే తెరలేపాడు. వస్తువు ధరలో 33 శాతం చెల్లిస్తే చాలు నెలరోజుల్లో ఆ వస్తువు ఇస్తామని నమ్మబలికాడు. 300 మందిని చేర్పించుకుని రూ.కోటి వరకూ వసూలయ్యాక రాత్రికిరాత్రే బోర్డు తిప్పేశాడు. అధికారులు పట్టించుకోలేదు. నేరుగా ఫిర్యాదు రాలేదని వదిలేశారు. ►తాజాగా రూర్బన్ మిషన్ పేరుతో సుధాకర్ నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చి నిరుద్యోగుల్ని మోసగించాడు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. నేరుగా బాధితుల ఫిర్యాదు లేదని పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా వేలాదిమంది నిరుద్యోగులు, పేదలు నష్టపోతున్నారు. కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. ఇకనైనా అధికారులు ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
Covid: కోలుకున్న స్పీకర్ తమ్మినేని దంపతులు
సాక్షి, శ్రీకాకుళం: కరోనా వైరస్ బారిన పడిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు పూర్తి చికిత్స అనంతరం సంపూర్ణంగా కోలుకున్నారు. శ్రీకాకుళంలో మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు క్రిటికల్ ట్రీట్మెంట్ అందించి త్వరంగా కోలుకునేట్టు కృషి చేశారు. శ్రీకాకుళంలో క్రిటికల్ ట్రీట్మెంట్ అందించిన వైద్యులకు కృతజ్ఞతలు స్పీకర్ తెలియచేశారు. కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్‌గా తనకు ఎటువంటి వైద్యం అందించారో, ఆరోగ్య శ్రీ లబ్దిదారునికి కూడా ఇదే తరహా వైద్యం అందించడాన్ని అభినందించారు. కరోనా కష్టకాలంలో రాజకీయ లబ్ది కోసం మాట్లాడటం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రజలకు భరోసా ఇవ్వాలి గానీ భయాందోళనలు కలిగించడం మానుకోవాలన్నారు. చదవండి: ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేస్తేనే అంబులెన్స్‌ల అనుమతి -
విషాదం: ఐదు రోజుల్లోనే అంతా తల్లకిందులు
ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు తన కాళ్ల మీద తాను నిలబడి.. ఊరు కాని ఊళ్లో చెమటోడ్చి పెళ్లాం పిల్లలను పోషించుకుంటున్నాడని తలచి స్థిమితపడ్డ తల్లి, ఒక్కసారిగా తన ఆలోచనలు తలకిందులయ్యేసరికి తట్టుకోలేకపోయింది. మూడు పదులు దాటిన వయస్సులో కుమారుడు మతి తప్పిన తీరులో స్వస్థలానికి చేరుకోవడంతో ఆమె అతలాకుతలమైంది. కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాక.. కృష్ణారామా అనుకోవాల్సిన వయస్సులో.. మీదపడ్డ సమస్య ఆమెను నైరాశ్యం వైపు నెట్టింది. తన బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వస్తుందేమోనన్న బాధతో.. భయంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. పురుగు మందు తాగి ప్రాణాలు విడిచింది. అదే సమయంలో తనయుడు కూడా విషం మింగి.. ఆపై భీతిల్లి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వెంటనే చికిత్స అందించినా అతిడిని కూడా మృత్యువు వెంటాడింది. విధిలీల అర్థం కాదని వ్యథ చెందడం అందరి వంతైంది. కొత్తూరు: కొత్తూరులోని కొత్తపేట కాలనీకి చెందిన కనపాకల చిన్నమ్మడు (70), ఆమె కుమారుడు శ్రీనివాసరావు (35)లు శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ముందు చిన్నమ్మడు చనిపోగా తర్వాత శ్రీనివాసరావుకు వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నమ్మడుకు కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. శ్రీనివాసరావుకు పదేళ్ల కిందట కొత్తూరుకే చెందిన శ్రీదేవితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లిపోయారు. అక్కడే శ్రీనివాసరావు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఐదు రోజుల కిందట శ్రీనివాసరావు ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు కనిపించింది. అర్థం లేకుండా మాట్లాడడం, పిల్లలను ఊరికే కొట్టడం, గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ విడిచి పెట్టడం వంటి పనులు చేసేవాడు. దీంతో భయపడిన అతని భార్య అక్కడే ఉన్న బంధువులకు విషయం చెప్ప డంతో వారు పరిస్థితిని గమనించి రాత్రుళ్లు కాప లా కాయడం కూడా మొదలుపెట్టారు. అయినా శ్రీనివాసరావు ప్రవర్తన అంతు చిక్కేది కాదు. ఒక క్షణం బాగానే ఉన్నా.. మరుక్షణానికి మారిపోయేవాడు. ఈ నెల 25న శ్రీనివాసరావు అక్కడ ఎవరికీ చెప్పకుండా కొత్తూరు వచ్చేశాడు. ఇక్కడ కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వీధుల్లో తిరిగేవాడు. కొడుకు పరి స్థితి చూసి తల్లి చిన్నమ్మడు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇలాగే చనిపోతాడేమో అని బెంగ పెట్టుకుంది. దెయ్యం పట్టిందేమోనని అతడిని కుటుంబ సభ్యులంతా కలిపి ఓ గిరిజన గ్రామానికి కూడా తీసుకెళ్లారు. కానీ వారు ఆదివారం పూజ చేస్తామని చెప్పి వీరిని పంపించేశారు. శనివారం ఇంటిలో ఉన్న వారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. తల్లీ కొడుకులు మాత్రం కొత్తూరు నాలుగు రోడ్ల కూడలికి వచ్చి గడ్డి మందును కొన్నారు. వారి ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి ఇద్దరూ ఆ పురుగు మందు తాగేశారు. అయితే పురుగు మందు తాగాక శ్రీనివాసరావు పరుగులు పెడుతూ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. తల్లి అక్కడే పడిపోవడంతో అటుగా వెళ్తున్న ఉపాధి వేతనదారులు ఆమెను గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీ కొడుకులకు స్థానిక సీహెచ్‌సీ వైద్యాధికారి దీప్తి వైద్యం అందించారు. తల్లి పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆమె అక్కడే చనిపోయారు. శ్రీనివాసరావును కూడా పాలకొండ తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అర్థరాత్రి తర్వాత ఆయన కూడా తనువుచాలించాడు. చిన్నమ్మడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ వై.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలకు పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనతో కొత్తూరులో విషాదం అలముకుంది. -
లాక్డౌన్: ఆగని పడవ ప్రయాణం..
సాక్షి, ఇచ్ఛాపురం: బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లిన వారుకష్టకాలంలో మళ్లీ స్వగ్రామాలకు వచ్చే స్తున్నారు. శనివారం రాత్రి ఒడిశా స్వర్ణాపురం గ్రామానికి చెందిన వలస మత్స్యకారులతో కలసి డొంకూరుకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారు లు ఒడిశా రేవుకు చేరుకోగా అక్కడ అధికారులు కేవిటి స్వర్ణాపురం క్వారంటైన్‌కు తరలించగా, సోమవారం మధ్యాహ్నం డొంకూరు గ్రామానికి చెందిన మరో ఐదుగురు మత్స్యకారులు డొంకూ రు సముద్ర తీరానికి బోటు గుండా చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న రూరల్ ఎస్ఐ కె.లక్ష్మి వారిపై కేసు నమోదుచేసి స్థానిక మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఒడిశా రాష్ట్రం గోపాలపట్నం, స్వర్ణాపురం, రామయ్యపట్నానికి చెందిన 29 మందితో కలసి వీరంతా ఈ నెల 23న చెన్నైలో లక్షా 80వేల రూపాయలకు కొనుగోలు చేసి వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. సముద్రంలో దూకి.. కవిటి: మండలంలోని పెద్దకర్రివానిపాలెం తీరంలో సోమవారం మధ్యాహ్నం ముగ్గురు మత్స్యకారులు మర పడవపై చెన్నై నుంచి రాగా.. వారిని పోలీసులు, రెవెన్యూ అధికారులు అదుపులోకి తీ సుకున్నారు. చెన్నై నుంచి ఈ నెల 22 రాత్రి వీరు మరబోటుపై ఇచ్ఛాపురం మండలానికి చెందిన ఐ దుగురితోపాటు బయలుదేరారు. పుక్కళ్లపాలెం కొత్తపాలెం తీరాల మధ్య ప్రదేశం వద్ద పహారా కా స్తున్న పోలీసులు బైనాక్యులర్ సాయంతో వీరిని గమనించారు. తీరంలో పోలీసులు ఉన్నారని గు ర్తించిన మత్స్యకారులు పెద్దకర్రివానిపాలెం వద్ద దిగాల్సిన వారిని పడవ నుంచి దూకి ఈతకొడుతూ వెళ్లిపోవాలని చెప్పడంతో.. ముగ్గురు తీరానికి కిలోమీటర్ దూరంలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. అప్పటికే సిబ్బందితో అక్కడున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రాజపురంలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఫ్లాష్.. ఫ్లాష్.. సోమవారం రాత్రి పొద్దుపోయాక చెన్నై నుంచి బోటపై వచ్చిన 18మంది మత్స్యకారులు పెద్దకర్రివానిపాలెం తీరంలో దిగారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి బీసీ హాస్టల్లోని క్వారంటైన్‌కు తరలించారు. -
ఉలిక్కిపడ్డ సిక్కోలు.. అసలు ఏం జరిగింది?
ఆశలు నీరుగారిపోయాయి.. స్క్రీనింగ్ పరీక్షల్లో వచ్చిన అనుమానాలు నిజమయ్యాయి. కరోనా బారిన పడకుండా ఇన్నాళ్లూ జిల్లాను కంటికి రెప్పలా చూసుకున్న అధికారుల శ్రమ నిష్ఫలమయ్యింది. ట్రూనాట్ కిట్ పరీక్షల్లో ‘డిటెక్టెడ్ వెరీ లో’ అని వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో వ్యక్తికి సంబంధించిన ఫలితం రావాల్సివుంది. పాతపట్నం మండలంలో తొలిసారి కరోనా వెలుగు చూసింది. సేఫ్ జోన్‌గా ఉన్న సిక్కోలు కరోనా ప్రభావిత జిల్లాగా మారిపోయింది. ఒకేసారి మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లావాసులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు 18 గ్రామాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి, 96మందిని క్వారంటైన్‌కు పంపారు. సాక్షి, శ్రీకాకుళం: కరోనా లక్షణాల్లేకుండానే ఆ మహమ్మారి ఆవహించింది. తొలి అనుమానితునికి నెగిటివ్ వచ్చినా.. అతని బంధువులకు పాజిటివ్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్–19 వైరస్ అనూహ్యంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి ట్రూనాట్ కిట్ పరీక్షల్లో ‘డిటెక్టెడ్ వెరీ లో’ అని వచ్చినప్పటికీ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వైరాలజీ ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో నెగి టివ్ రావడంతో శుక్రవారం జిల్లా ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. ఆయనకే నెగిటివ్ వచ్చినప్పుడు కు టుంబ సభ్యులకు తప్పనిసరిగా నెగిటివ్ వస్తుందని అంతా ఊహించారు. కానీ అంచనాలకు భిన్నంగా ఒకే ఇంట్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వీరికెటువంటి లక్షణాల్లేవు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా రు. కానీ పాజిటివ్ రావడం చూసి వైద్య వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారానే వీరికి వైరస్ సంక్రమించిందని అధికారులు నిర్ధారణకొచ్చారు. ఆయనకు నెగిటివ్ రావడం చూస్తే వైరస్ సోకినా తెలియకుండా ఆయనకు తగ్గిపోయిందని భావిస్తున్నారు. తనకు తెలియకుండానే కుటుంబ సభ్యులకు వైరస్ సోకిందని అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిదని అతనికి మరోసారి పరీక్షలు చేశారు. ఫలితం రావలసివుంది. పాతపట్నం: రాష్ట్ర సరిహద్దును పరిశీలించిన కలెక్టర్ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి, డీపీవో రవికుమార్ అనుమానితుడి ప్రయాణ చరిత్ర.. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాడు. మెట్రో రైల్వేలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. మార్చి 17వ తేదీన ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్ నెంబర్ 4లోని 24 నెంబర్ బెర్త్‌లో వి జయవాడ వరకు పయనించాడు. 19న అక్కడి నుంచి గుంటూరు–విశాఖపట్నం రైలులో విశాఖ ప్రయాణించాడు. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా తలారీ రైల్వే స్టేషన్ వరకు గుణుపూర్ పాసింజర్లో పయనించాడు. తలారీ స్టేషన్ నుంచి తన అత్తవారి గ్రామమైన కాగువాడకు బస్సులో బయలుదేరి వెళ్లా డు. ఈ వ్యక్తి ఢిల్లీలో నివసిస్తున్న జహింగీర్పూరి ఏరియాలో 40కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆయన ప్రయాణించిన రైళ్లలో మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన వారు ఉన్నారు. ఆయన ఉన్న కంపార్ట్‌మెంట్‌కు పక్కనున్న కంపార్ట్మెంట్లో ప్రయాణించిన వారిలో కొందరికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సంక్రమణ చరిత్ర ఉందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. క్వారంటైన్లో 96మంది.. శుక్రవారం 29మందిని, శనివారం మరో 67మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో తొమ్మిది మందిని ప్రైమరీ కాంటాక్ట్‌గా, 51మందిని సెకండరీ కాంటాక్ట్‌గా గుర్తించారు. మిగతా వారిని సాధారణంగా కలిసిన వ్యక్తులుగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 23న వీరఘట్టం మండలం మొట్ట వెంకటాపురంలో ఒకాయన చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకని అనుమానితుడు వ చ్చాడు. అక్కడికి పెద్ద సీదికి చెందిన వారు వెళ్లారు. దీంతో అ గ్రామానికి చెందిన ఐదుగుర్ని అనుమానంతో క్వారంటైన్‌కు తరలించారు. ఎవరెవర్ని కలిశారు... ఏం జరిగింది? ఢిల్లీ యువకుడు తన అత్తవారింటికి కాగువాడకు వచ్చాక భార్య, 10 నెలల కుమారుడు, మామ, అత్త, మరదలిని కలిశాడు. అదే రోజు సాయంత్రం తన స్వగ్రామమైన పెద్ద సీదికి బైక్‌పై వెళ్లాడు. తండ్రిని కలిశాడు. మార్చి 20వ తేదీన తన ఇరుగుపొరుగు వారిని కూడా కలిశాడు. 21న పెద్ద సీది నుంచి బైక్‌పై కాగువాడ వచ్చాడు. జ్వరం, వాంతులు రావడంతో ఒక డాక్టర్ని సంప్రదించాడు. ఆ డాక్టర్ రాసిన మందులను ఒక మెడికల్ షాపులో కొన్నాడు. అప్పటి నుంచి హోం క్వారంటైన్లో ఉంటున్నాడు. ఏప్రిల్ 14వ తేదీన తన భార్య అమ్మమ్మను, పిల్లాడ్ని కలిశాడు. 16న కాగువాడ నుంచి తన స్వగ్రామమైన పెద్ద సీదికి బైక్‌పై తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. 18న మాకివలసలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆరుగుర్ని కలిశాడు. 20న పెద్ద సీది నుంచి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై అత్తవారి గ్రామమైన కాగువాడకు వచ్చాడు. ఇంతలో తాను పనిచేస్తున్న ఢిల్లీ మెట్రో రైల్వే అధికారుల నుంచి ఒక సమాచారం వచ్చింది. ఢిల్లీ నుంచి వెళ్లిన కారణంగా స్వగ్రామంలో క్వారంటైన్లో ఉన్నట్టు... కరోనా లేదని నిర్ధారణ చేసుకునేలా పరీక్షలు చేసి, కలెక్టర్ ద్వారా మెడికల్ సరి్టఫికేట్ తీసుకుని విధుల్లో చేరాలని ఆదేశాలు రావడంతో.. 22న పాతపట్నం సీహెచ్‌సీకి వెళ్లాడు. ఆశా కార్యకర్త, మండల స్పెషలాఫీసర్, కోవిడ్ ఆఫీసర్, వలంటీర్ సాయంతో వెళ్లిన ఆయన అదే రోజున శాంపిల్స్ ఇచ్చి పెద్ద సీదికి వెళ్లిపోయాడు. మొత్తంగా ఈ వ్యక్తి 29మందిని కలిశాడు. వీరందర్నీ ఎచ్చెర్ల క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వీరు కొరసవాడ, కాగువాడ, పెద్ద సీధి, మాకివలసకు చెందిన వారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి తన స్నేహితులతో రొంపివలసలో వాలీబాల్ ఆడాడు. వారితో కలిసి పెద్దసీదిలో పార్టీ చేసుకున్నాడు. సరుకులు కొనుగోలు చేసేందుకు పాతపట్నం మార్కెట్‌కు వచ్చాడు. పెద్ద సీదిలో ఆయన హాజరైన వివాహ కార్యక్రమానికి విజయనగరం జిల్లాకు చెందిన వారు కూడా హాజరయ్యారని సమాచారం. అలాగే పెద్ద సీదిలో ఒకరు చనిపోతే అక్కడికి పరామర్శకు వెళ్లాడు. ఆ కార్యక్రమానికి మాకివలస గ్రామానికి చెందిన వారు వచ్చారు. అధికారులు అప్రమత్తం కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కాగువాడకు 3 కిలోమీటర్ల పరిధిలో గల పాతపట్నంతోపాటు కా గువాడ, సీది, కొరసవాడ, చుట్టుపక్కల 18 గ్రామాలను పూర్తిగా లాక్డౌన్ చేశారు. కంటైన్మెంట్ జోన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తారు. పాతపట్నంతోపాటు ఇతర గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. 23మంది వైద్యులు, 200మంది ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉంచారు. ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై దృష్టి మార్చి 20వ తేదీ తర్వాత ఢిల్లీ నుంచి 211మంది జిల్లాకు వచ్చారు. ట్రైన్ చార్ట్, టెలిఫోన్ సిగ్నల్ ఆధారంగా వీరంతా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. వారందర్ని హోం ఐసోలేషన్‌లో పెట్టారు. ఢిల్లీ, ముంబాయి తదితర ఇతర ప్రాంతాల 13,500మంది వ్యక్తి వచ్చారు. వారందర్నీ హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వారిపై కూడా తాజా పరిణామంతో దృష్టి సారించారు. కరోనాను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం ఇక మీదట ఇళ్లల్లోనే ఉండాలి. కరోనా లక్షణాలు ఉంటే స్థానిక ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలకు తక్షణమే తెలియజేయాలి. ప్రస్తుతం తేలిన కేసును పరిశీలిస్తే ఎక్కువమందికి కరోనా వైరస్ సోకే అవకాశం లేదని భావిస్తున్నాం. మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఇక్కడే ఉంటారు. ఆర్డీవో పర్యవేక్షణ చేస్తారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉండాలి. పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఇంట్లో ఉంటేనే భద్రంగా ఉంటారు. స్వీయ నియంత్రణ పాటించండి. భౌతిక దూరం ఎంతో ముఖ్యం. ఎవరూ అధైర్యపడొద్దు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. –జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం -
హోమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన వివాహిత ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదును అందజేసేందుకు వచ్చిన వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన వాసుపల్లి సునీత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 2013 సంవత్సరంలో రూ.లక్షా 50వేలు అప్పు తీసుకుంది. నూటికి రూ.10 చొప్పున నెలకు రూ.15 వేలు చొప్పున వడ్డీ చెల్లించేది. గతేడాది సెప్టెంబర్ వరకు వడ్డీ చెల్లించింది. ఆమెకు ఆరోగ్యం బాగులేకపోవడంతో మూడు నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి బెదిరిం చాడు. ఇంటి డాక్యుమెంట్లు ఇటీవల తీసుకుపోయాడు. ఈ విషయంపై ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 5న ఆమె ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. సివిల్ కేసని, కోర్టును ఆశ్రయించాలని పోలీసు అధికారులు తెలపడంతో ఎస్పీ ఆఫీసు ముందు నిద్రమాత్రలు, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె భర్త శ్రీను తెలిపారు. ఆమెకు శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఓఎస్డీ కె.తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన వినతుల్లో నాలుగు పరిష్కరించగా, మిగిలినవి వాయిదా వేశారు. కార్యక్రమంలో మహిళా పీసీ డీఎస్పీ వి.సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఎస్ఐ పి. రాజేశ్వరరావు, న్యాయవాది టి.వరప్రసాదరావు, జ్యోతి, సిటిజన్ ఫొరం ప్రతినిధి బరాటం కామేశ్వరరావులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌సెల్‌కు తగ్గిన వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు, ఫిర్యాదులు తగ్గాయి. గతవారం గ్రీవెన్సుసెల్‌ను రద్దు చేయడంతో ఈ వారం కూడా గ్రీవెన్స్‌సెల్ ఉండదని ఫిర్యాదుదారులు హాజరుకాలేదు. వినతులు, ఫిర్యాదులను జేసీ–2 పి.రజనీకాంతారావు స్వీకరించారు. వినతుల్లో కొన్ని.. ఏ అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ లోక్ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ జేసీ–2కు విన్నవించారు. హెల్త్సెంటర్లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కోరారు. ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చిన భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని చేపలు చెరువులు తవ్వారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన అలుపాన శంకర్, ఆయన భార్య సూరమ్మ తదితరులు జేసీకి గోడు వినిపించారు. తమ భూములను తమకు అప్పగించాలంటూ తమ వద్ద ఉన్న పట్టాలను చూపించారు. ఏ ఇల్లు నిర్మించి అప్పగించాలంటూ మెళియాపుట్టిలోని కుమ్మర వీధికి చెందిన కళావతి పట్నాయక్ విన్నవించింది. అలాగే, భామిని మండలంలోని సింగిడి గ్రామ ఎస్సీ కాలనీ వంశధార బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సమీపంలో ఉందని, దీనిని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలంటూ ఆ కాలనీకి చెందిన ఎస్సీ కుటుంబాలు జేసీ–2కు విజ్ఞప్తి చేశాయి. 78 కుంటుంబాలను ఆదుకోవాలంటూ సీపీఎం సీనియర్ నేత చౌదరి తేజేశ్వరరావు, పి.జయకృష్ణ, కాంతారావు, కృష్ణారావు, ఎస్.ఝాన్సీరాణిలు కోరారు. -
రహదారి కోసం తగాదా
జి.సిగడాం:రహదారి విషయమై ఇరువర్గాల మధ్య తలెత్తిన స్వల్ప వివాదం కొట్లాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, పెంకులతో దాడి చేసుకోవడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని పెంట పంచాయతీ పరిధి దళిత వాడలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు పికెట్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో పాత కాలనీకి వెళ్లే రహదారి విషయమై స్థానికుల మధ్య కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయి. ఈ దారి కేవలం నడవడానికే తప్ప.. ఇతర అవసరాలకు వాడకూడదని కాలనీకి చెందిన వంపూరు కృష్ణయ్య, వంపూరు అసిరయ్యలతోపాటు మరో 30 మంది అడ్డుతగులుతున్నారు. అయితే ఈ దారిపై నాటు బళ్లు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని పొందూరు పాపారావు, టొంపల స్వాములుతోపాటు మరో 15 మంది డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఉదయం కూడా ఇదే విషయమై వీరి మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు, పెంకులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ కొట్లాటలో ఒకవర్గానికి చెందిన వంపూరు వెంకటరమణ, గెడ్డాపు లోకేష్, గెడ్డాపు త్రినాథరావు, మరోవర్గానికి చెందిన పొందూరు సూరయ్య, పొందూరు వెంకయ్య, బిల్లాడ శ్రీనువాసరావు, టొంపల పుష్పలు గాయపడ్డారు. కొట్లాట విష యం స్థానికుల ద్వారా తెలుసుకున్న జి.సిగడాం పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. క్షతగాత్రులను రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గెడ్డాపు త్రినాథరావు, బిల్లాడ శ్రీనివాసరావులను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు వైద్యులు రిఫర్ చేశారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎస్ఐ జి.భాస్కరరావు తెలిపారు. అల్లర్లు సృష్టిస్తే చర్యలు:సీఐ గ్రామాల్లో ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజాం సీఐ ఎం.వి.రమణమూర్తి హెచ్చరించారు. పెంట దళిత వాడలో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షాంచారు. దాడులకు ఉపయోగించిన రాళ్లు, పెంకులు, కర్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా తప్పుడు ఫిర్యాలతో పోలీసులను తప్పుదారి పట్టించాలని చూస్తే సహించమన్నారు. కొత్తవ్యక్తులు సంచరిస్తే వెంటనే తమకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట జి.సిగడాం, సంతకవిటి ఎస్సైలు భాస్కరరావు, సురేష్‌బాబు, ఏఎస్ఐలు లక్ష్మునాయుడు, శ్రీనివాసులరాజు ఉన్నారు. పొలీస్ పికెట్ ఏర్పాటు ఇరువర్గాల మధ్య కొట్లాట నేపథ్యంలో కాలనీలో పోలీసు పికెట్‌ను అధికారులు ఏర్పాటు చేసినట్టు సీఐ రమణమూర్తి చెప్పారు. ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు, 20 మంది పొలీస్ సిబ్బందిలు విధుల్లో ఉంటారన్నారు. శాంతిభద్రతులు అదుపులోకి వచ్చేవరకు పికెట్ ఉంటుందని స్పష్టం చేశారు. -
ఓటరు నమోదు వేగవంతం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటరు నమోదు దరఖాస్తులను ఈనెల 10వ తేదీ లోగా పరిశీలించి, ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ‘ఓటరు నమోదు కార్యక్రమం’పై జిల్లా కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 17.79 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయని..కేవలం 18 శాతం మాత్రమే పరిష్కరించామన్నారు. ఈవీఎంలలో పాడైన వాటి వివరాలు తెలి యజేయాలని, ఈవీఎంల భవనాలను త్వరితగతితన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. విచారణను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్వో నూర్భాషా ఖాసిం, ఈఆర్వోలు పి. రజనీకాంతారా వు, జి. గణేష్‌కుమార్, వి.విశ్వేశ్వరరావు, ఎన్.తేజ్‌భరత్, టి.కైలాస్ గిరీశ్వర్, ఎం. వెంకటేశ్వరరావు, కె.సాల్మన్‌రాజ్, జె.సీతారామమూర్తి, హెచ్.వరప్రసాదరావు, ఆర్.గున్నయ్య తదితరులు పాల్గొన్నారు. 10న జిల్లాలో ‘యువచైతన్యం’ జిల్లాలో ఈనెల 10న ‘యువచైతన్యం’ నిర్వహిస్తున్నామని కలెక్టర్ సౌరభ్‌గౌర్ చెప్పారు. కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఇచ్ఛాపురం నియోజకవర్గానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ, పలాసకు జిల్లా పరిషత్ సీఈవో, టెక్కలికి టెక్కలి ఆర్డీవో, పాతపట్నంకు ముఖ్యప్రణాళిక అధికారి, శ్రీకాకుళంకు మెప్మా పీడీ, ఆమదాలవలసకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, ఎచ్చెర్లకు శ్రీకాకుళం ఆర్డీవో, నరసన్నపేటకు డీఆర్డీఏ పీడీ, రాజాంకు పాలకొండ ఆర్డీవో, పాల కొండకు సీతంపేట ఐటీడీఏ పీవోలను ప్రత్యేకాధికారులుగా నియమించామని చెప్పారు. వీరితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. యువజనులకు వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, వారిని భాగస్వాములను చేయడం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం, మంచి పనితీరు కనబరిచిన వారిని సన్మానించడం వంటి పనులు చేపడతామన్నారు. నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయకర్త కేవీ రమణ మాట్లాడుతూ ‘యువచైతన్యం’ కార్యక్రమంలో రక్తదాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. యువజన సంఘాలు తాము చేపట్టిన పనుల వివరాలు, ఛాయా చిత్రాలతో సహా యువ చైతన్యం కార్యక్రమంలో ప్రదర్శించుటకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులందరూ పాల్గొన్నారు. -
సర్కారు సిబ్బందికి.. ఏసీబీ వణుకు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తుపాను వర్షాలు, చలిగాలులతో జిల్లా ప్రజలు, రైతులు వణుకుతుంటే.. ప్రభుత్వ సిబ్బంది మాత్రం ఏసీబీ భయంతో వణికిపోతున్నారు. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో ఇటీవలి కాలంలో ఏసీబీ పంజా విసురుతోంది. మున్సిపల్ కమిషనర్లు, పోలీసులు సైతం దాని దెబ్బకు విలవిల్లాడుతున్నారు. మూడు నెలల్లోనే నాలుగు దాడులు.. ఏడు అరెస్టులతో మిగతా సిబ్బంది ఠారెత్తిపోతున్నారు. ఫార్మాలిటీస్ చెల్లించనిదే పనులు జరగని పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చి చేయి తడిపేందుకు ప్రయత్నించే సాధారణ ప్రజలను ‘మీకో దండం’.. అంటూ వెనక్కి పంపేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతితో విసిగిపోయిన వారికి ప్రస్తుతం ఏసీబీ ఆపద్బాంధవిగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. శుక్రవారం సీడీపీవోపై వల పన్ని పట్టుకున్న ఉదంతమే దీనికి నిదర్శనం. జిల్లాలో ఇటీవలి కాలంలో ఇది నాలుగో దాడి కాగా.. మూడు నెలల క్రితం దాడుల పరంపర మొదలైంది. ఆగస్టు 20న.. స్థానిక వైఎస్ఆర్ కల్యాణ మండపం పాత లీజుదారు నుంచి లంచం తీసుకుంటూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ పట్టుబడ్డారు. అవినీతిలో మునిగి తేలుతున్న మున్సిపాలిటీలో ఏకంగా కమిషనరే దొరికిపోవడం, అతనితోపాటు సీని యర్ అసిస్టెంట్ పద్మనాభం కూడా అరెస్టు కావడంతో ఉద్యోగులు అదిరిపోయారు. ఒక మున్సిపల్ కమిషనర్ దొరికిపోవడం జిల్లాలో ఇదే ప్రథమం కావడంతో ప్రజల్లోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అక్కడికి నెలన్నర వ్యవధిలో.. సెప్టెంబర్ 30న ఏసీబీ మళ్లి వల వేసింది. ఈసారి ఏకంగా రక్షక భటులే వలలో చిక్కుకున్నారు. యాక్సిడెంట్‌కు గురైన ఒక వాహనాన్ని విడుదల చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ ఇన్స్పెక్టర్ ఆజాద్‌ను ఆశ్రయించాడు. దాంతో వల పన్నారు. శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుంటుండగా స్టేషన్ రైటర్‌తోపాటు మరో కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులే ఇలా చిక్కుకోవడం సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్లలో జరిగే అక్రమాలను బట్టబయలు చేసింది. 20 రోజుల తర్వాత..నవంబర్ 20న సీన్ పాలకొండకు మారింది. ఈసారి వంతు పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌ది. ఇంటి ప్లాన్ ఆమోదానికి లంచం తీసుకుంటూ ఆయన దొరికిపోయారు. ఇటీవలే నగర పంచాయతీగా మారిన పాలకొండకు తొలి కమిషనర్‌గా నియమితుడైన నాగభూషణరావు ఇలా అరెస్టు కావడం విశేషం. 3 నెలల వ్యవధిలో ఇద్దరు మున్సిపల్ కమిషనన్లు పట్టుబడటం మున్సిపాలిటీల్లో జరుగుతున్న అవినీతి గుట్టు విప్పింది. తాజాగా.. నవంబర్ 22.. శుక్రవారం.. పిల్లలకు పౌష్టికాహారం సరఫరా చేసే ఐసీడీఎస్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ నుంచి లంచం తీసుకుంటున్న కోటబొమ్మాళి సీడీపీవో కె.ఉమాదేవి, అందుకు సహకరించిన ఆమె భర్త ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు. రవాణా బిల్లు మంజూరుకు సునీల్‌కుమార్ అనే ఆపరేటర్ నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటూ శ్రీకాకుళంలోని తన ఇంట్లోనే ఆమె ఏసీబీకి దొరికిపోయారు. ఇలా ఏసీబీ దాడులు, అరెస్టుల పర్వం కొనసాగిస్తుండటంతో ప్రభుత్వ సిబ్బంది హడలిపోతున్నారు. ఇవాళ వీరు.. రేపెవరో.. అని చర్చించుకుంటూ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ‘ఫార్మాలిటీస్’ పూర్తి చేయనిదే ఏ పనీ జరగదు.. ఏ ఫైలూ కదలదు. దీనికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అదే అలవాటుతో ఎవరైనా చేయి తడపడానికి ప్రయత్నిస్తే.. బాబూ.. మీకో దండం.. మీ పని చేసిపెడతాంగానీ ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండని సిబ్బంది బతిమాలుతున్నారు. ఇది మంచి మార్పే అయినా.. ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది.. ఏసీబీ దాడుల పరంపర కొనసాగడం.. పట్టుబడినవారిపై చర్యలు తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది.