ముళ్ల పొదల్లో లభ్యమైన శిశువుని చేరదీసిన చంద్రమణి బెహరా దంపతులు
సాక్షి,ఇచ్ఛాపురం: నిశ్శబ్దంగా శ్మశానం. గాలి తప్ప ఇంకో అలికిడి లేని వాతావరణం. ఇంకా వెలుతు రు పరుచుకోని సమయం. ఎవరు వదిలి వెళ్లారో.. ఎందుకు వదిలి వెళ్లిపోయారో.. అమ్మ కడుపు గడప దాటి అప్పుడే బయటకు వచ్చిన ఓ మగ శిశువు ఏడుపు శ్మశానాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముళ్ల పొదల మధ్య ఒళ్లంతా చీమలు కుడుతూ ఉంటే ఏడవడం తప్ప ఇంకేం చేయలేని ఆ పసి వాడి రోదన ఇచ్ఛాపురం పరిధిలోని కండ్రవీధి శ్మశానంలో అలజడి రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బుధవారం వేకువ జామున కండ్రవీధికి చెందిన చంద్రమణి బెహరా బహిర్భూమి కోసం శ్మశానం సమీపానికి వెళ్లారు.
అక్కడ ముళ్ల పొద ల మధ్య నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడకు వెళ్లి చూడగా.. బ్యాగ్‌లో అప్పుడే పుట్టి న మగ శిశువు కనిపించాడు. బాబును పరిశీలిస్తే శరీరమంతా చీమలు కనిపించాయి. వెంటనే ఆయన బాబును ముళ్ల పొదల నుంచి బయటకు తీసి శరీరాన్ని శుభ్రం చేశారు. చుట్టుపక్కల ఎవ రూ కనిపించకపోవడంతో ఎవరో కావాలనే వది లి వెళ్లిపోయారని నిర్ధారించుకుని ఆ పసివాడిని ఇంటికి తీసుకెళ్లారు. చంద్రమణి బెహరా దంపతులకు వివాహమై 30 ఏళ్లయినా సంతానం లేదు. దీంతో ఈ మగ శిశువును పెంచుకోవచ్చని ఆశ పడ్డారు.
బాబుకు స్నానం చేయించి వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది చంద్రమణి బెహరా దంపతుల నుంచి శిశువును స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం శ్రీకాకుళంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే బాబును చంద్రమణి బెహరా దంపతులకే ఇచ్చేయాలని స్థానికులంతా అధికారులను కోరినా వారు ఒప్పుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రీకాకుళంలోని శిశు సంరక్షణ కేంద్రం నుంచి తెచ్చుకోవాలని గెస్ట్ చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ జాస్మిన్ వారికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment