చిన్నారులకు ఆర్నెల్ల వయసు వచ్చాక, వారికి ఇచ్చే తల్లిపాలతో పాటు క్రమంగా ఘనాహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇలా తల్లిపాలతో పాటు చిన్నారిని ఘనహారం వైపునకు మళ్లించడానికి ఇచ్చే ఆహారాన్ని కాంప్లిమెంటరీ డైట్‌గా చెప్పవచ్చు. అయితే పిల్లలకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఎలాంటి ఇతర ఆహారాలూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ఆర్నెల్ల వయసు వరకు పిల్లలకు నీళ్లు కూడా తాగించాల్సిన అవసరమూ ఉండదు.
వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఇలా చిన్నారులను ఘనాహారం వైపునకు మళ్లించేందుకు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆహారం గురించి మార్కెట్ ప్రకటనల హడావుడి ఇటీవలి రోజుల్లో చాలా ఎక్కువగానే ఉంటోంది. నిజానికి కాంప్లిమెంటరీ డైట్ అనేది... తల్లిపాలతో పాటు పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం మాత్రమే. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమంటే అదేదో మార్కెట్‌లో మాత్రమే లభ్యమయ్యే ఆహారం అని అపోహపడాల్సిన అవసరం లేదు.
కాంప్లిమెంటరీ డైట్ ఇవ్వాల్సిందిలా...
ఘనాహారంలో భాగంగా పిల్లలకు ఉడికించిన అన్నం (రైస్), ఉడికించిన పప్పు (దాల్), అరటిపండు, ఉడకబెట్టిన కూరగాయలు (ఆలూ వంటివి) చిదిమి, మెత్తగా చేసి పెట్టాలి. అలాగే ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి వాళ్లకు కాచి చల్లార్చిన నీళ్లు పట్టాలి. ఇది మినహా మార్కెట్‌లో లభించే వాణిజ్య ప్రయోజనాలతో తయారు చేసిన ఎలాంటి ఆహారమూ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన ఈ ఆహారాన్ని ఆర్నెల్ల పిల్లలకు రోజూ 150 నుంచి 200 ఎమ్‌ఎల్ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు తినిపించవచ్చు.
ఇక ఎనిమిది/తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక... ఇకపై మెత్తగా చిదిమిన రోటీ, కాస్తంత గట్టిగా వండిన పప్పు, ఇడ్లీ, రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్), సపోటా, బొ΄్పాయి వంటి ఆహారం ఇవ్వవచ్చు. ఇక్కడ మనం పైన పేర్కొన్న ఆహారం కూడా కాంప్లిమెంటరీ ఆహారమే.
కాంప్లిమెంటరీ ఆహారానికి నిర్వచమిదీ...
అసలు కాంప్లిమెంటరీ ఆహారానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే... పిల్లలకు సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, భరించగలిగే ఆర్థిక స్తోమతను బట్టి చూస్తే చవకగా లభించేది అని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడు దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా అభివర్ణిస్తున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అనేవారు. కానీ ఈ ప్రక్రియను వీనింగ్ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభి్రపాయం. నిజానికి వీనింగ్ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ / నిలిపేస్తూ ఘనాహారానికి మళ్లడం అని అర్థం.
కానీ... పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడం కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్) అంటున్నారు. ఇక ఆరు నెలలు నిండిన పిల్లలకు ఈ వయసు నుంచి ఎదుగుదలకు దోహదం చేసే ఆహారం అవసరం కాబట్టి ఈ టైమ్‌లో దీన్ని మొదలుపెట్టాలి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 30% నుంచి 35% మంది మాత్రమే పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అనుబంధ ఆహారాన్ని మొదలుపెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంటోంది.
త్వరగా మొదలుపెట్టడమూ, లేట్ చేయడం ఈ రెండూ సరి కాదు...
ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసు నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో తట్టుకోవడం (చోకింగ్), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే ఆలస్యంగా మొదలుపెడితే అది వాళ్ల సాధారణ పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అలాగే ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం మేలు. అదే ఆరోగ్యకరం కూడా.
Comments
Please login to add a commentAdd a comment