పసిబిడ్డలకు పాలిచ్చే కేంద్రాల ఏర్పాటుకు జిల్లా ప్లానింగ్ కమిటీ నిర్ణయం
స్థలసేకరణ, అనుమతుల ప్రక్రియ పూర్తి...త్వరలో పనుల ప్రారంభం
ప్రస్తుతం ముంబై, ఉపనగరాల్లో ఎక్కడా ఈ తరహా సౌకర్యం లేదని వెల్లడి
బాలింతలు, పసిపిల్లల తల్లులకు భారీ ఉపశమనం
దాదర్: బహిరంగ ప్రదేశాల్లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బాలింతలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఉపనగరాల్లో 50 చోట్ల ఆణిముత్యం (పసిబిడ్డలకు పాలిచ్చే) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉపనగర జిల్లా ప్లానింగ్ కమిటీ రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. అవసరమైన స్ధల సేకరణ, అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నగరం, ఉప పనగరాల్లో పాలిచ్చే కేంద్రాలు ఎక్కడ లేవు దీంతో బాలింతలు, పసిపిల్లల తల్లులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ కేంద్రాలు వినియోగంలోకి వస్తే పసిపిల్లల తల్లులు, బాలింతలకు ఊరట లభించనుంది. ఆణిముత్యం కేంద్రాల నిర్వాహణ మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మాడా)కు చెందిన సుధార్ సమితి పర్యవేక్షించనుంది.
50 చోట్ల ఆణిముత్యం కేంద్రాలు
నేటి ఆధునిక సాంకేతిక యుగంలో పురుషులతోపాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్ధల్లో పనిచేస్తున్నారు. వివాహానికి పూర్వమే కాక ఆ తరువాత కూడా ఎన్నో సమస్యలను, సవాళ్లను అధిగమించి ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలా విధులకు లేదా రొటీన్ చెకప్‌ల కోసం ఆసుపత్రులు, లేదా ఇతర పనులు నిమిత్తం వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలింతలు, పసిపిల్లల తల్లులకు మార్గమధ్యంలో పాలిచ్చేందుకు చాటు దొరకడంలేదు.
రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వాలంటే ఎవరైన ఆకతాయిలు దొంగచాటుగా తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేస్తారని భయం. దీంతో గత్యంతరం లేక కొందరు బస్టాపుల్లో లేదా దుకాణాల వెనక, నివాస సొసైటీ కాంపౌండ్లలో చాటు వెతుక్కుని తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇది వారికెంతో ఇబ్బందికరంగా, అసౌకర్యవంతంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఆణిముత్యం కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. 125 చదరపుటడుగుల ఒక్కో ఆణిముత్యం కేంద్రానికి రూ.10 లక్షలు ఖర్చు చేయనుంది. అందులో తాగునీరు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్, వాష్ బేసిన్, ఒక బెడ్డు, మూడు కుర్చీలలు, శానిటరీ ప్యాడ్ మెషీన్, గాలి, వెలుతురు ఆడేందుకు వీలుగా విశాలమైన కిటికీలను ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ కేంద్రాల బయట సీసీ టీవీ కెమరాలుంటాయి. దీంతో సౌకర్యంతో పాటు భద్రత కూడా లభిస్తుందని జిల్లా ప్లానింగ్ కమిటీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment