సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో పలాస కేంద్రంగా కార్యాలయం పెట్టి.. రూర్బన్ పేరుతో నకిలీ అపా యింట్‌మెంట్లు ఇచ్చి, ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖపట్నం సుధాకర్ తెరవెనుక ఉండి పెద్ద కథే నడుపుతున్నాడు. రూర్బన్ పేరుతో జరిగిన మోసాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవ్వడంతో సుధాకర్ అక్రమార్జన కథ అడ్డం తిరిగింది. దీనితో అసలుకే ఎసరు వస్తోందని భావించిన సుధాకర్ కొత్త ఎత్తుగడల్ని సిద్ధం చేసుకున్నాడు. తీగ దొరికినా డొంక కదలకుండా అడ్డుకుంటున్నాడు. విచారణకు దొరక్కుండా ఎత్తులు వేస్తున్నాడు. మీడియాలో రాకుండా మూడో వ్యక్తుల ద్వారా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. అధికార వర్గాలకు కూడా కొంతమందితో ఫోన్ చేయించి విషయం బయటకు రాకుండా చూడాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
►పలాస, అంబుగాంలోని తన నకిలీ కార్యాలయాల బోర్డులు తీసేశాడు. నకిలీ ఉద్యోగాల జిల్లా కోఆర్డినేటర్‌ను బయటకు కనిపించకుండా దాచిపెట్టాడు.
►విచారణ ముందుకు సాగనీయకుండా తనదైన శైలిలో రెండురోజులుగా జిల్లాలో తిష్ట వేసి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.
►నకిలీ అపాయింట్‌మెంట్లు పొందిన నిరుద్యోగుల్ని అంతర్గతంగా బెదిరింపులకు గురి చేయడంతో వారు నేరుగా ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు.
అక్రమమని తెలిసినా...
జిల్లాలో నకిలీ అపాయింట్‌మెంట్లతో నిరుద్యోగులను మోసగిస్తున్న సుధాకర్ గురించి యంత్రాంగం తూతూమంత్రంగానే వ్యవహరిస్తోంది. సాక్షాత్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ నేరుగా నకిలీ అపాయింట్‌మెంట్లు జారీ అవుతున్నాయని నోట్ విడుదల చేశారు. మరో వైపు పాలకొండ పోలీస్ స్టేషన్‌లో అక్కడి ఎంపీడీఓ ఫిర్యాదు కూడా చేశారు. పలాస కేంద్రంగా వ్యవహారాలు నడుపతున్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. అక్కడ కార్యాలయంలో రూర్బన్ మిషన్‌కు సంబంధించిన మెటీరియల్ పోలీసులకు కనిపించింది. ఇన్ని ఉన్నా విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు.
►పోలీసుల వద్ద సుధాకర్ నంబర్ ఉన్నా ట్రేస్ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
సందేహాలెన్నో..
ఈ నకిలీ బాగోతం వెనుక ఏమీ లేనప్పుడు అక్కడి కార్యాలయాల్లో రూర్బన్ మిషన్, కేంద్ర గ్రామీణ అభి వృద్ధిశాఖ బోర్డులు వంటివి ఎందుకు ఉన్నట్లు.. అక్కడి ఉద్యోగులు ఏం చేస్తున్నారో.. అధికారులు తెలుసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
►నకిలీ అపాయింట్‌మెంట్ పొందిన నిరుద్యోగులు నేరుగా ఫిర్యాదు చేయలేదనే ఒకే ఒక్క కారణంగా అధికారులు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అంబుగాం, పలాసలో బోర్డులు కూడా తీసేయడంతో నిరుద్యోగులు నిండా మునిగినట్లు కనిపిస్తోంది.
►పలాసలో పోలీసులు కొంతమందిని విచారించారు. విచారణ తూతూ మంత్రంగా సాగినట్లు సమాచారం.
గతంలో మోసాలివే...
►మూడేళ్ల క్రితం రాజాం, తాలాడ, మందరాడ కేంద్రాలుగా ఓ యువకుడు ఇండీట్రేడ్ పేరుతో షేర్‌మార్కెట్ పెట్టి, రూ.లక్షకు ప్రతి నెలా రూ.10 వేల అధిక ఆదాయాన్ని చూపించి వందలాదిమందిని నమ్మించాడు. తొలుత ఈ యువకునిపై ఒకరిద్దరు ఫిర్యాదులు చేసిన అధికార యంత్రాంగం పట్టించుకోలేదు.
►ఏడాదిన్నర క్రితం పొందూరులో ఓ వ్యాపారి మినీ స్కీమ్ పేరుతో పెద్ద స్కామ్‌కే తెరలేపాడు. వస్తువు ధరలో 33 శాతం చెల్లిస్తే చాలు నెలరోజుల్లో ఆ వస్తువు ఇస్తామని నమ్మబలికాడు. 300 మందిని చేర్పించుకుని రూ.కోటి వరకూ వసూలయ్యాక రాత్రికిరాత్రే బోర్డు తిప్పేశాడు. అధికారులు పట్టించుకోలేదు. నేరుగా ఫిర్యాదు రాలేదని వదిలేశారు.
►తాజాగా రూర్బన్ మిషన్ పేరుతో సుధాకర్ నకిలీ అపాయింట్‌మెంట్లు ఇచ్చి నిరుద్యోగుల్ని మోసగించాడు.
జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. నేరుగా బాధితుల ఫిర్యాదు లేదని పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా వేలాదిమంది నిరుద్యోగులు, పేదలు నష్టపోతున్నారు. కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. ఇకనైనా అధికారులు ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment