సాక్షి హైదరాబాద్: పదేళ్ల క్రితం లండన్ నుంచి తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు తెప్పిస్తామని మాయమాటలు చెప్పి రూ.12 కోట్లతో పరారైన ఓ తల్లీ కొడుకులు.. తాజాగా భార్యతో కలిసి జాబ్ చీటింగ్‌లు చేయడం మొదలుపెట్టారు. రైల్వే, మెట్రోలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులకు రూ.2 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కటకటాలపాలయ్యారు... ఇదీ ఓ తల్లి–కొడుకు– మధ్యలో భార్య చీటింగ్ కహానీ!
- కాకరపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్ రెడ్డి (37), తల్లి కాకరపర్తి భాగ్యలక్ష్మి (60)తో కలిసి ఖమ్మం జిల్లా మధిరలో ఉండేవాడు. 2012లో లండన్‌లోని తన స్నేహితుల నుంచి తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు తెప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.12 లక్షలు వసూలు చేసి అక్కడ్నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయడంతో సురేంద్ర, అతని తల్లి భాగ్యలక్ష్మి మీద మధిర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.
- అక్కడ్నుంచి పరారయిన తల్లి కొడుకులు 2013లో హైదరాబాద్‌కు వచ్చారు. పేరు, గుర్తింపు కార్డ్‌లు అన్నీ మార్చేశాడు. తన పేరును పుట్టా సురేష్ రెడ్డిగా మార్చుకొని... సికింద్రాబాద్‌లో నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డులను తీసుకున్నాడు. వీటి సహాయంతో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో బ్యాంకు ఖాతాలను తెరిచాడు. భానోత్ నాగలక్ష్మి (30)ని పెళ్లి చేసుకొని బోడుప్పల్‌లో స్థిరపడ్డాడు.
- ఈ క్రమంలో సురేంద్రకు సికింద్రాబాద్‌కు చెందిన ఆలం, ఖమ్మంకు చెందిన శ్రీనివాస్ రావులతో పరిచయం ఏర్పడింది. రైల్వే, మెట్రోలలో బ్యాక్‌డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.5–10 లక్షల వరకు చెల్లించే స్థోమత ఉన్న నిరుద్యోగులను తీసుకొస్తే మంచి మొత్తం వస్తుందని ఆశ చూపించారు. 20 మంది విద్యార్థుల వద్ద నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు.
- నిరుద్యోగులను నమ్మించేందుకు రైల్ నిలయంలోనే సురేంద్ర మోసగాళ్లను పరిచయం చేశాడు. మెడలో రైల్వే గుర్తింపు కార్డ్‌లు, రైల్వే నిలయంలోని సెక్షన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ రావు, ఆలంలను కలిసిన విద్యార్థులు నిజంగానే వీరు ఉద్యోగులని భ్రమపడ్డారు. డబ్బు చెల్లించి నెలల పాటు ఎదురుచూసినా ఆఫర్ లెటర్ రాకపోవటంతో అనుమానం వచ్చిన నిరుద్యోగులు ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని లేదా ఆర్డర్ ఇప్పించాలని సురేంద్రపై ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ప్రెషర్ వస్తుందని గమనించిన నిందితులు నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను విద్యార్థులకు అందించి... సెల్‌ఫోన్లు స్విచాఫ్ చేసి పరారయ్యారు. నకిలీ ఆర్డర్లు పట్టుకొని రైల్వే నిలయానికి ఉద్యోగానికి వెళ్లిన నిరుద్యోగులకు అవి బోగస్ నియామక ఉత్తర్వులని తెలిసిపోయింది. దీంతో సురేంద్రను నిలదీశారు. నిరుద్యోగులు సురేంద్రను వదిలిపెట్టకుండా వెంటపడుతుండటంతో జూన్‌లో సురేంద్ర, తన భార్యతో కలిసి ఫోన్లు స్విచాఫ్ చేసి పరారయ్యాడు.
- దీంతో బాధితులు అక్టోబర్‌లో మేడిపల్లి, ఉప్పల్ పోలీస్‌లను ఆశ్రయించారు. సురేంద్ర, అతని భార్య నాగలక్ష్మి మీద కేసులు నమోదు చేశారు. అప్పట్నుంచి వాళ్లను ట్రాకింగ్‌లో పెట్టారు. బోడుప్పల్‌లోని తన ఫ్లాట్‌లోని ఖరీదైన గృహోపకరణాలను తరలించేందుకు మంగళవారం ఉదయం సురేంద్ర, అతని భార్య నగరానికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వీళ్లతో పాటు దాచిపల్లి సురేష్‌లను అరెస్ట్ చేసినట్లు రాచకొండ కమిషన్ మహేశ్ భగవత్ తెలిపారు.
సొమ్మొకరిది.. సోకొకరిది..
రూ.2 కోట్లు మోసం చేసిన సొమ్ముతో సురేంద్ర, అతని భార్య లగ్జరీ లైఫ్‌ను గడుపుతున్నారు. నాలుగు వాహనాలు కొనుగోలు చేసి ఉప్పల్‌లో ఓం సాయి ట్రావెల్స్‌ను, ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. జడ్చర్లలో రూ.25 లక్షల పెట్టుబడితో క్యాంటీన్ తెరిచాడు. రూ.40 లక్షలు పెట్టి బోడుప్పల్‌లో తన తల్లి భాగ్యలక్ష్మి పేరు మీద అపార్ట్‌మెంట్ కొన్నాడు. ఇంట్లో ఖరీదైన గృహోపకరణాల కొనుగోలు చేశాడు. సురేంద్ర వ్యాపార కార్యకలాపాలను ఉప్పల్, స్వరూప్‌నగర్ కాలనీకి చెందిన దాచిపల్లి సురేష్ (33) చూసుకునేవాడు
Comments
Please login to add a commentAdd a comment