gold biscuit
-
తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
శ్రీవారి పరకామణిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం
తిరుమల: శ్రీవారి పరకామణిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి బంగారు బిస్కెట్లను చోరీ చేయగా టీటీడీ విజిలెన్స్ అధికారుల అప్రమత్తతో నిందితుడు పట్టుబడ్డాడు. తిరుమల వన్‌టౌన్ పీఎస్ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన వీలిశెట్టి పెంచలయ్య తిరుమలలోని యూనియన్ బ్యాంక్ వారి అబ్రిబోస్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను పరకామణిలో నగదు, బంగారు, ఇతర విలువైన వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పరకామణి సిబ్బందికి అందిస్తుంటాడు. ఈ క్రమంలో పరకామణి భవనంలోని మొదటి అంతస్తు నుంచి పైన ఉన్న మరో అంతస్తుకు ట్రాలీలో వస్తువులను తీసుకెళ్లే సమయంలో సమీపంలోని ఓ బంగారు వస్తువులు ఉన్న ట్రే వద్దకు వెళ్లివచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ విజలెన్స్ సిబ్బంది సదరు ట్రాలీని తనిఖీ చేయగా అందులో ఉన్న ఓ కన్నంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీ కెమేరా నిఘా కేంద్రంలో వీడియో ఫుటేజీని పరిశీలించి.. వన్‌టౌన్ పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తల్లి, కుమారుడు.. మధ్యలో భార్య
సాక్షి హైదరాబాద్: పదేళ్ల క్రితం లండన్ నుంచి తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు తెప్పిస్తామని మాయమాటలు చెప్పి రూ.12 కోట్లతో పరారైన ఓ తల్లీ కొడుకులు.. తాజాగా భార్యతో కలిసి జాబ్ చీటింగ్‌లు చేయడం మొదలుపెట్టారు. రైల్వే, మెట్రోలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులకు రూ.2 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కటకటాలపాలయ్యారు... ఇదీ ఓ తల్లి–కొడుకు– మధ్యలో భార్య చీటింగ్ కహానీ! కాకరపర్తి సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్ రెడ్డి (37), తల్లి కాకరపర్తి భాగ్యలక్ష్మి (60)తో కలిసి ఖమ్మం జిల్లా మధిరలో ఉండేవాడు. 2012లో లండన్‌లోని తన స్నేహితుల నుంచి తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు తెప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.12 లక్షలు వసూలు చేసి అక్కడ్నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయడంతో సురేంద్ర, అతని తల్లి భాగ్యలక్ష్మి మీద మధిర పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అక్కడ్నుంచి పరారయిన తల్లి కొడుకులు 2013లో హైదరాబాద్‌కు వచ్చారు. పేరు, గుర్తింపు కార్డ్‌లు అన్నీ మార్చేశాడు. తన పేరును పుట్టా సురేష్ రెడ్డిగా మార్చుకొని... సికింద్రాబాద్‌లో నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డులను తీసుకున్నాడు. వీటి సహాయంతో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో బ్యాంకు ఖాతాలను తెరిచాడు. భానోత్ నాగలక్ష్మి (30)ని పెళ్లి చేసుకొని బోడుప్పల్లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో సురేంద్రకు సికింద్రాబాద్‌కు చెందిన ఆలం, ఖమ్మంకు చెందిన శ్రీనివాస్ రావులతో పరిచయం ఏర్పడింది. రైల్వే, మెట్రోలలో బ్యాక్‌డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.5–10 లక్షల వరకు చెల్లించే స్థోమత ఉన్న నిరుద్యోగులను తీసుకొస్తే మంచి మొత్తం వస్తుందని ఆశ చూపించారు. 20 మంది విద్యార్థుల వద్ద నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు. నిరుద్యోగులను నమ్మించేందుకు రైల్ నిలయంలోనే సురేంద్ర మోసగాళ్లను పరిచయం చేశాడు. మెడలో రైల్వే గుర్తింపు కార్డ్‌లు, రైల్వే నిలయంలోని సెక్షన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ రావు, ఆలంలను కలిసిన విద్యార్థులు నిజంగానే వీరు ఉద్యోగులని భ్రమపడ్డారు. డబ్బు చెల్లించి నెలల పాటు ఎదురుచూసినా ఆఫర్ లెటర్ రాకపోవటంతో అనుమానం వచ్చిన నిరుద్యోగులు ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని లేదా ఆర్డర్ ఇప్పించాలని సురేంద్రపై ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ప్రెషర్ వస్తుందని గమనించిన నిందితులు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను విద్యార్థులకు అందించి... సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి పరారయ్యారు. నకిలీ ఆర్డర్లు పట్టుకొని రైల్వే నిలయానికి ఉద్యోగానికి వెళ్లిన నిరుద్యోగులకు అవి బోగస్ నియామక ఉత్తర్వులని తెలిసిపోయింది. దీంతో సురేంద్రను నిలదీశారు. నిరుద్యోగులు సురేంద్రను వదిలిపెట్టకుండా వెంటపడుతుండటంతో జూన్‌లో సురేంద్ర, తన భార్యతో కలిసి ఫోన్లు స్విచాఫ్ చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు అక్టోబర్‌లో మేడిపల్లి, ఉప్పల్ పోలీస్‌లను ఆశ్రయించారు. సురేంద్ర, అతని భార్య నాగలక్ష్మి మీద కేసులు నమోదు చేశారు. అప్పట్నుంచి వాళ్లను ట్రాకింగ్‌లో పెట్టారు. బోడుప్పల్‌లోని తన ఫ్లాట్‌లోని ఖరీదైన గృహోపకరణాలను తరలించేందుకు మంగళవారం ఉదయం సురేంద్ర, అతని భార్య నగరానికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వీళ్లతో పాటు దాచిపల్లి సురేష్లను అరెస్ట్ చేసినట్లు రాచకొండ కమిషన్ మహేశ్ భగవత్ తెలిపారు. సొమ్మొకరిది.. సోకొకరిది.. రూ.2 కోట్లు మోసం చేసిన సొమ్ముతో సురేంద్ర, అతని భార్య లగ్జరీ లైఫ్‌ను గడుపుతున్నారు. నాలుగు వాహనాలు కొనుగోలు చేసి ఉప్పల్‌లో ఓం సాయి ట్రావెల్స్‌ను, ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. జడ్చర్లలో రూ.25 లక్షల పెట్టుబడితో క్యాంటీన్ తెరిచాడు. రూ.40 లక్షలు పెట్టి బోడుప్పల్లో తన తల్లి భాగ్యలక్ష్మి పేరు మీద అపార్ట్మెంట్ కొన్నాడు. ఇంట్లో ఖరీదైన గృహోపకరణాల కొనుగోలు చేశాడు. సురేంద్ర వ్యాపార కార్యకలాపాలను ఉప్పల్, స్వరూప్‌నగర్ కాలనీకి చెందిన దాచిపల్లి సురేష్ (33) చూసుకునేవాడు -
చిన్న ముంబైలో పెద్ద మోసం..
చీరాల: జిల్లాలో చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలో భారీ బంగారం మోసం వెలుగు చూసింది. మోసగాళ్లు కొందరు బంగారం వ్యాపారులకు బంగారం బిస్కెట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని నిలువునా మోసం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో మోసగాళ్ల ముఠాలోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలతో విషయం బయటపడింది. సుమారు రూ.35 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఒక్కో బిస్కెట్ బరువు 100 గ్రాములు. అలాంటివి 700 బంగారం బిస్కెట్ల క్రయవిక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన కొందరికి బంగారం బిస్కెట్లు ఇవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. అందరి ‘బంధువు’గా వ్యవహరించే ఓ వ్యక్తి ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పాటు స్వయంగా ఎస్పీ మలికా గర్గ్‌కు ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదీ..జరిగింది గతంలో చీరాల రూరల్ ప్రాంతాల్లో ర్యాప్‌లు (దొంగ బంగారం విక్రయం) జరిగాయి. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి తీరా డబ్బులు తీసుకుని వారిపైనే దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇటీవల చౌకగా బంగారం దొరుకుతుందని కొందరు ఏజెంట్లు బంగారం వ్యాపారులకు ఆశ కల్పించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామని వారిని బురిడీ కొట్టించారు. ఎటువంటి బిల్లులు లేకున్నా వ్యాపారులు కూడా బిస్కెట్ల కోసం డబ్బులు కట్టి ఇప్పుడు నిలువునా మోసపోయారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కస్టమ్స్ ఆఫీసర్‌గా చెప్పుకున్న వ్యక్తి, ఏజెంట్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. -
బంగారు బిస్కెట్లతో పరారైన గోల్డ్‌స్మిత్ అరెస్ట్
సనత్‌నగర్: ఆభరణాలు చేసి ఇస్తానని ఓ వ్యక్తి నుంచి బంగారు బిస్కెట్లను తీసుకుని పరారైన గోల్డ్‌స్మిత్‌ను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 129.5 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఏసీపీ రాంరెడ్డి, డీఐ శ్రీనివాసరావు బుధవారం వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, మల్దా జిల్లా, షాపూర్ ప్రాంతానికి చెందిన రంజన్ కాంచన్ అధికారి అలియాస్ సుజాయా సనా అలియాస్ సుభంకర్ హాజీ బతుకుదెరువు నిమిత్తం స్నేహితుడు సునీల్ ద్వారా నగరానికి వలసవచ్చి గోల్డ్‌స్మిత్‌గా పని చేస్తున్నాడు. రసూల్‌పురా ప్రాంతంలోని బీహెచ్ఈఎల్ కాలనీలో ఉంటూ ఆభరణాలు తయారు చేసేవాడు. ఈ నేపథ్యంలో సునీల్ ఆభరణాలు తయారు చేయాలని తనకు పరిచయం ఉన్న ఓ వ్యాపారి ఫోన్ నంబర్ ఇచ్చాడు. అప్పటి నుంచి పలుమార్లు సదరు వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్లు తీసుకుని ఆభరణాలు చేసి ఇస్తున్న రంజన్ నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 26న సదరు వ్యక్తి నుంచి రూ.4.5 లక్షల విలువైన 149.88 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకున్న రంజాన్ ఆభరణాలు చేసి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం నిందితుడు రంజన్ పాట్ మార్కెట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రూ.3.9 లక్షల విలువైన 129.5 గ్రాముల రెండు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, డీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో కాంచన్‌ను అరెస్టు చేసిన డీఎస్ఐ ముత్యంరాజు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
బంగారు బిస్కట్ పేరుతో మోసం
► మహిళ మెడలోని తులంనర చైన్ అపహరణ ► సిరిసిల్లలో సినీఫక్కీలో చోరీ సిరిసిల్ల టౌన్ : రోడ్డుపై బంగారు బిస్కెట్ దొరికిందని.. అందరం పంచుకుందామని ఇద్దరు మహిళలు మరో మహిళ మెడలోని తులంన్నర బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ ఘటన సిరిసిల్లలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమణమ్మ ఉదయం కరీంనగర్ వెళ్లింది. మధ్యాహ్నం స్వగ్రామానికి వెళ్లేందుకు సిరిసిల్లకు చేరుకుంది. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి, బస్సు కోసం బస్టాండుకు బయల్దేరింది. స్థానిక పత్తిపాక వీధిలో ఇద్దరు మహిళలు తమకు బంగారం బిస్కెట్ దొరికిందని రమణమ్మకు తెలిసేలా మాట్లాడారు. రమణమ్మ దగ్గరకు వచ్చి నకిలీ బంగారు బిస్కెట్ చూపించి, ముగ్గురం కలిసి పంచుకుందామన్నారు. వారించిన రమణమ్మ పోగొట్టుకున్నవాళ్లకు అప్పగించాలని కోరగా.. మనం దొంగతనం చేయలేదని, ఎవరికీ ఇచ్చే అవసరం లేదని నచ్చజెప్పారు. ఇంతలో అటువైపు నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. తాను స్వర్ణకారుడినని చెప్పి దొరికింది నిజమైన బంగారమేనని నమ్మబలికాడు. ఈ బిస్కెట్ తీసుకుని రమణమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును మహిళలకు ఇవ్వమని సూచించాడు. వారి మోసాన్ని గుర్తించని రమ ణమ్మ మెడలోని తులంన్నర బంగారు గొలుసును వారికిచ్చింది. సుమారు పదితులాల బరువుగల నకిలీ బంగారు బిస్కెట్‌ను తీసుకుంది. కొద్ది సేపట్లో ఇద్దరు మహిళలు, స్వర్ణకారుడు అక్కడి నుంచి ఉడాయించారు. అనుమానం వచ్చిన రమణమ్మ మరో స్వర్ణకారుడి వద్దకు వెళ్లి బిస్కెట్ చూపించగా, అది నకిలీదని తేలింది. ఐడీ పార్టీ పోలీసులు రాజేందర్, బాబు దొంగల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన దొంగల ముఠా ఈ పని చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
హలో భాయ్... చలో దుబాయ్!
♦ సిటీజనులను ఆకట్టుకుంటున్న ♦ దుబాయ్ ఫెస్ట్ జనవరి 1 నుంచి ప్రారంభం ♦ ఏటా పెద్ద సంఖ్యలో వెళుతున్న షాపింగ్ ప్రియులు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక నగరంగా దుబాయ్‌కి పేరు. ఎడారి ప్రాంతమైనా ఆధునిక నిర్మాణ రంగంలో దుబాయ్ ప్రగతికి ఆకాశమే హద్దని అక్కడి నిర్మాణాలు నిరూపిస్తాయి. విలాసవంతమైన జీవన శైలికి పెట్టింది పేరైన ఈ షేక్‌ల రాజ్యం ఎందరో పర్యాటకులకు విందు... వినోదాల కేంద్రం. అతిపెద్ద షాపింగ్ సెంటర్ కూడా. కేవలం షాపింగ్‌కు మాత్రమే అక్కడికి వెళ్లి రావాలని కోరుకునే సిటీజనులకు కొదువలేదు. అందుకే జనవరి 1న ప్రారంభమయ్యే దుబాయ్ ఫెస్ట్‌కు కొన్ని రోజుల ముందే సందడి మొదలైంది. దీని ఆదరణను దృష్టిలో పెట్టుకొని వివిధ ట్రావెల్స్ సంస్థలు భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి. - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి ఇవీ లెక్కలు నగరం నుంచి నిత్యం దుబాయ్ మీదుగా వెళ్లే విమానాలు : 7 నుంచి 8 దుబాయ్ ఫెస్టివల్‌ను గతంలో సందర్శించిన నగర వాసులు : సుమారు 25 వేల మంది మొత్తంగా సందర్శించేవారు : సుమారు 50 లక్షల మంది (అన్ని దేశాలకు చెందినవారు) నగర వాసుల ఖర్చు : సుమారు రూ.100 కోట్లు (మార్కెట్ వర్గాల అంచనా) అధికంగా కొనుగోలు చేసే వస్తువులు : బంగారం, వజ్రాలు, రత్నాలు, లెదర్ వస్తువులు దుబాయ్ ఫెస్ట్ది 20 ఏళ్ల చరిత్ర. యూఏఈలో వ్యాపార కార్యకలాపాలకు ఊపునిచ్చే ఉద్దేశంతో 1996 ఫిబ్రవరిలో దీనికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇది ఒక వార్షిక ఈవెంట్‌గా మారిపోయింది. కొత్త ఏడాది ప్రథమార్ధంలో కనీసం నెల రోజులకు తగ్గకుండా ఈ షాపింగ్ పండుగ కొనసాగుతుంది. ఏటా దాదాపు 30 లక్షల మంది పర్యాటకులను ఇది దుబాయ్‌లో అడుగిడేలా చేస్తోందని అంచనా. సిటీజనులపై ఆఫర్ల వర్షం... ‘దుబాయ్ చూడాలి’ అని ఎవరైనా అంటే చాలు... ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న వాళ్లెవరైనా ‘జనవరిలో వెళ్లు.. అదిరిపోతుంది’ అనే ఠపీమని సలహా ఇచ్చేస్తారు. అంతగా దుబాయ్ ఫెస్ట్ సిటీజనులకు దగ్గరైపోయింది. షాపింగ్ కోసం కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్‌కి వెళుతున్న వారు మన నగరంలో ఎందరో ఉన్నారు. నగర వాసుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని టూర్ ఆపరేటర్లు ఇక్క డ బ్రాంచిలలో ప్రత్యేక ప్యాకేజీలతో బ్రోచర్లను విడుదల చేస్తున్నారు. పోటాపోటీగా ఆఫర్లను అందిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉండే టారిఫ్‌తో పోలిస్తే బాగా తక్కువ ధరల్లోనే ఇవి అందుతున్నాయి. షాపింగ్‌తో పాటు అక్కడి పర్యాటక కేంద్రాలను కూడా చుట్టి రావాలని ఆశించే వారే ఎక్కువ కాబట్టి అందుకు అనుగుణమైన ప్యాకేజీలతో ఇవి ఆకట్టుకుంటున్నాయి. షాపింగ్, సిటీ టూర్ వంటివి ముగించడానికి సగటున 4 రోజులు పడుతుంది. దీనికి అనుగుణంగా 4 పగళ్లు, 5 రాత్రుల ప్యాకేజీలను ఎక్కువ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. మేక్ మై ట్రిప్ సంస్థ ఒక వ్యక్తికి రూ.45 వేల నుంచి రూ. 1.50 లక్షల మధ్య ప్యాకేజీ అందిస్తోంది. దీనికి పోటీగా ఎదుగుతున్న వింగో వెకేషన్స్ అదే ప్యాకేజీని రూ.35 వేలకే అందిస్తోంది. రాకపోకలు, విమాన ప్రయాణంతో పాటు వీసా ఖర్చులు, భోజనం, స్టార్ హోటల్ బస, అక్కడ వాహనంలో సైట్ సీయింగ్ వగైరాలన్నీ ఇందులోనే ముడిపడి ఉన్నాయి. యా త్రా డాట్‌కామ్ రూ.79 వేలు, థామస్ కుక్ రూ.45 వేలు, కాక్స్ అండ్ కింగ్స్ రూ.44 వేలు.. ఇలా రకరకాల ధరలను ఈ సంస్థలు దుబాయ్ ఫెస్టివల్ ప్రియులకు ఆఫర్ చేస్తున్నాయి. బంగారు అవకాశం దుబాయ్ ఫెస్ట్‌లో షాపింగ్దే ప్రధాన పాత్ర. ఆ సమయంలో నగర వ్యాప్తంగా దాదాపు అన్ని షాప్లూ డిస్కౌంట్ రేట్లను ప్రకటిస్తాయి. బంగారం కూడా తక్కువ ధరలోనే లభిస్తుందని చెబుతారు. ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే బంగారు బిస్కెట్ ధరలో కనీసం రూ.20 వేలకు పైగా వ్యత్యాసం ఉంటుందట. ఈ ఫెస్ట్‌లో తాత్కాలికంగా ప్రభుత్వ పరమైన పన్నులు తగ్గించడమే వివిధ ఉత్పత్తులను తక్కువ ధరలకు లభించేలా చేస్తోంది. సెలబ్రిటీ ప్రదర్శనలు... ఫ్యాషన్ ఫ్లాష్ మాబ్లు... ఈ ఫెస్ట్‌కు మాత్రమే ప్రత్యేకం అనిపించే ఫైర్ వర్క్స్... ఈసారి దుబాయ్‌లోని రెండు లోకేషన్లలో మెరుపులు విరజిమ్మనున్నాయి. దీనికోసం మైడిఎస్ఎఫ్ 2016 (కడఈఊ2016) యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా ఫెస్టివల్ ప్రత్యేకతలు తెలుసుకోవడానికి... రాయితీలు పొందడానికి... అక్కడ జరిగే రోజువారీ లాటరీలు గెలుపొందడానికి వీలు కలుగుతుంది. ప్రపంచంలోనే దీర్ఘకాలం కొనసాగే ఈ తరహా ఈవెంట్ ఇదొక్కటే అని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఇది కొనసాగనుంది. బంగారు బిస్కెట్ల ధర తక్కువే గత ఏడాది దుబాయ్ షాపింగ్ ఫెస్ట్‌కి కుటుంబంతో వెళ్లాం. చాలా ఎంజాయ్ చేశాం. షాపింగ్ ఇష్టపడే వారికి ఈ ఫెస్ట్ సూపర్బ్. బంగారు ఆభరణాల ధరలు పెద్ద తేడా అనిపించలేదు. కానీ బంగారు బిస్కెట్ల ధర మాత్రం తక్కువే అనిపించింది. అటు షాపింగ్, ఇటు నగర పర్యటనకు ఇది సరైన సమయం. - గుబ్బా రమేష్ ఇదీ బుర్జ్‌ఖలీఫా ప్రత్యేకత దుబాయ్ నగరంలోని బుర్జ్ ఖలీఫా భవనం పర్యాటకుల మది దోచుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవంతిగా ప్రసిద్ధిగాంచింది. ఆ విశేషాలు... భవనం ఎత్తు: 829.8 మీటర్లు అంతస్తులు: 154. ఇవి కాక నిర్వహణకు సంబంధించినవి మరో 9 అంతస్తులు అదనం. నిర్మాణం: 2004లో మొదలుపెట్టారు. 2010 జనవరిలో దీన్ని ప్రారంభించారు. వాణిజ్య స్థలం: 33.31 లక్షల చదరపు అడుగులు. అక్కడ దొరికేవి: గుండు పిన్ను మొదలు బంగారం, వజ్రాలు, రత్నాలతో పాటు ఖరీదైన హోటల్స్, వైద్య సేవలు, వినోదం, ఆటలు వంటి సకల సౌకర్యాలున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన యంత్రాంగం పటిష్టంగా ఉంది. అద్భుతాల లోకం... ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ దుబాయ్‌లో ఉంది. దీనిలో 12 వేల రిటైల్ షాపులు ఉన్నాయి. 635 రిటైల్ సంస్థలు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. డాల్ఫిన్లతో కనువిందు చేసే తొలి పూర్తి స్థాయి ఏసీ డాల్ఫినేరియం మరో ఆకర్షణ, దాదాపు 54 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ డాల్ఫినేరియం చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం కూడా ఇక్కడే ఉంది. దాదాపు 10 మిలియన్ లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న ఈ అక్వేరియం ప్యానెల్లో వేల సంఖ్యలో సముద్ర జంతువులున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మానవ నిర్మిత కట్టడం బుర్జ్ ఖలీఫా కూడా ఇక్కడే ఉంది. దీని ఎత్తు 829.8 మీటర్లు. బుర్జ్ ఖలీఫాను ఎలివేటర్ల ద్వారా చూడడానికి టూరిజం సంస్థలు ముందే ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. టూరిజం ప్యాకేజీలో భాగంగా చూపించే ఎడారి సఫారీ కూడా అద్భుతం. -
'పట్టుకున్న కొద్ది దొరుకుతున్న బంగారం'
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకునే కొద్ది బంగారం దొరుకుతోంది. దొంగ బంగారంతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన హుస్సేన్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ. 75 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతగాడు బంగారాన్ని లోదుస్తుల్లో పెట్టుకుని వచ్చినా అధికారుల తనిఖీల్లో బయటపడింది. హుస్సేన్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు బెంగుళూరు నుంచి వచ్చిన నలుగురిని కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇన్‌కంట్యాక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 5 బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగుల్లో బంగారం తీసుకొస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఇన్‌కంట్యాక్స్ అధికారులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని వీరిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఐటీ అధికారులు ... ఎయిర్‌పోర్టు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీరిని విజయవాడ తరలించడం అనుమానాలకు తావిస్తోంది. -
ఎయిర్ పోర్ట్‌లో అరకిలో బంగారం పట్టివేత
మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో బంగారాన్ని అక్రమంగా నగరానికి తీసుకువచ్చిన చెన్నైకు చెందిన అజ్మత్‌ఖాన్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన అజ్మత్ ఖాన్‌ను కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆ క్రమంలో అతడి లో దుస్తులలో దాచి ఉంచిన 5 బంగారు బిస్కెట్లను కనుగొని, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనంతరం వారిని ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.