హలో భాయ్... చలో దుబాయ్! | dubai fest starting to january 1st | Sakshi
Sakshi News home page

హలో భాయ్... చలో దుబాయ్!

Published Sun, Dec 27 2015 3:14 AM | Last Updated on Sat, Sep 29 2018 5:41 PM

హలో భాయ్... చలో దుబాయ్! - Sakshi

హలో భాయ్... చలో దుబాయ్!

♦  సిటీజనులను  ఆకట్టుకుంటున్న
♦  దుబాయ్ ఫెస్ట్ జనవరి 1 నుంచి ప్రారంభం
♦  ఏటా పెద్ద సంఖ్యలో వెళుతున్న  షాపింగ్ ప్రియులు


 ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక నగరంగా దుబాయ్‌కి పేరు. ఎడారి ప్రాంతమైనా ఆధునిక నిర్మాణ రంగంలో దుబాయ్ ప్రగతికి ఆకాశమే హద్దని అక్కడి నిర్మాణాలు నిరూపిస్తాయి. విలాసవంతమైన జీవన శైలికి పెట్టింది పేరైన ఈ షేక్‌ల రాజ్యం ఎందరో పర్యాటకులకు విందు... వినోదాల కేంద్రం. అతిపెద్ద షాపింగ్ సెంటర్ కూడా. కేవలం షాపింగ్‌కు మాత్రమే అక్కడికి వెళ్లి రావాలని కోరుకునే సిటీజనులకు కొదువలేదు. అందుకే జనవరి 1న ప్రారంభమయ్యే దుబాయ్ ఫెస్ట్‌కు కొన్ని రోజుల ముందే సందడి మొదలైంది.  దీని ఆదరణను దృష్టిలో పెట్టుకొని వివిధ ట్రావెల్స్ సంస్థలు భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి.    
                                             - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి
 
   ఇవీ లెక్కలు
 నగరం నుంచి నిత్యం దుబాయ్ మీదుగా వెళ్లే విమానాలు : 7 నుంచి 8
 దుబాయ్ ఫెస్టివల్‌ను గతంలో సందర్శించిన నగర వాసులు : సుమారు 25 వేల మంది
 మొత్తంగా సందర్శించేవారు : సుమారు 50 లక్షల మంది (అన్ని దేశాలకు చెందినవారు)
 నగర వాసుల ఖర్చు : సుమారు రూ.100 కోట్లు (మార్కెట్ వర్గాల అంచనా)
 అధికంగా కొనుగోలు చేసే వస్తువులు : బంగారం, వజ్రాలు, రత్నాలు, లెదర్ వస్తువులు
 దుబాయ్ ఫెస్ట్‌ది 20 ఏళ్ల చరిత్ర. యూఏఈలో వ్యాపార కార్యకలాపాలకు ఊపునిచ్చే ఉద్దేశంతో 1996 ఫిబ్రవరిలో దీనికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇది ఒక వార్షిక ఈవెంట్‌గా మారిపోయింది. కొత్త ఏడాది ప్రథమార్ధంలో కనీసం నెల రోజులకు తగ్గకుండా ఈ షాపింగ్ పండుగ కొనసాగుతుంది. ఏటా దాదాపు 30 లక్షల మంది పర్యాటకులను ఇది దుబాయ్‌లో అడుగిడేలా చేస్తోందని అంచనా.

 సిటీజనులపై ఆఫర్ల వర్షం...    
 ‘దుబాయ్ చూడాలి’ అని ఎవరైనా అంటే చాలు... ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న వాళ్లెవరైనా ‘జనవరిలో వెళ్లు.. అదిరిపోతుంది’ అనే ఠపీమని సలహా ఇచ్చేస్తారు. అంతగా దుబాయ్ ఫెస్ట్ సిటీజనులకు దగ్గరైపోయింది. షాపింగ్ కోసం కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్‌కి వెళుతున్న వారు మన నగరంలో ఎందరో ఉన్నారు. నగర వాసుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని టూర్ ఆపరేటర్లు ఇక్క డ బ్రాంచిలలో ప్రత్యేక ప్యాకేజీలతో బ్రోచర్లను విడుదల చేస్తున్నారు. పోటాపోటీగా ఆఫర్లను అందిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉండే టారిఫ్‌తో పోలిస్తే బాగా తక్కువ ధరల్లోనే ఇవి అందుతున్నాయి.

 షాపింగ్‌తో పాటు అక్కడి పర్యాటక కేంద్రాలను కూడా చుట్టి రావాలని ఆశించే వారే ఎక్కువ కాబట్టి అందుకు అనుగుణమైన ప్యాకేజీలతో ఇవి ఆకట్టుకుంటున్నాయి. షాపింగ్, సిటీ టూర్ వంటివి ముగించడానికి సగటున 4 రోజులు పడుతుంది. దీనికి అనుగుణంగా 4 పగళ్లు, 5 రాత్రుల ప్యాకేజీలను ఎక్కువ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. మేక్ మై ట్రిప్ సంస్థ ఒక వ్యక్తికి రూ.45 వేల నుంచి రూ. 1.50 లక్షల మధ్య ప్యాకేజీ అందిస్తోంది.   దీనికి పోటీగా ఎదుగుతున్న వింగో వెకేషన్స్ అదే ప్యాకేజీని రూ.35 వేలకే అందిస్తోంది. రాకపోకలు, విమాన ప్రయాణంతో పాటు వీసా ఖర్చులు, భోజనం, స్టార్ హోటల్ బస, అక్కడ వాహనంలో సైట్ సీయింగ్ వగైరాలన్నీ ఇందులోనే ముడిపడి ఉన్నాయి. యా త్రా డాట్‌కామ్ రూ.79 వేలు, థామస్ కుక్ రూ.45 వేలు, కాక్స్ అండ్ కింగ్స్ రూ.44 వేలు.. ఇలా రకరకాల ధరలను ఈ సంస్థలు దుబాయ్ ఫెస్టివల్ ప్రియులకు ఆఫర్ చేస్తున్నాయి.
 
 బంగారు అవకాశం
 దుబాయ్ ఫెస్ట్‌లో షాపింగ్‌దే ప్రధాన  పాత్ర. ఆ సమయంలో నగర వ్యాప్తంగా దాదాపు అన్ని షాప్‌లూ డిస్కౌంట్ రేట్లను ప్రకటిస్తాయి. బంగారం కూడా తక్కువ ధరలోనే లభిస్తుందని చెబుతారు. ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే బంగారు బిస్కెట్ ధరలో కనీసం రూ.20 వేలకు పైగా వ్యత్యాసం ఉంటుందట. ఈ ఫెస్ట్‌లో తాత్కాలికంగా ప్రభుత్వ పరమైన పన్నులు తగ్గించడమే వివిధ ఉత్పత్తులను తక్కువ ధరలకు లభించేలా చేస్తోంది.

సెలబ్రిటీ ప్రదర్శనలు... ఫ్యాషన్ ఫ్లాష్ మాబ్‌లు... ఈ ఫెస్ట్‌కు మాత్రమే ప్రత్యేకం అనిపించే ఫైర్ వర్క్స్... ఈసారి దుబాయ్‌లోని రెండు లోకేషన్లలో మెరుపులు విరజిమ్మనున్నాయి. దీనికోసం మైడిఎస్‌ఎఫ్ 2016 (కడఈఊ2016) యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా ఫెస్టివల్ ప్రత్యేకతలు తెలుసుకోవడానికి... రాయితీలు పొందడానికి... అక్కడ జరిగే రోజువారీ లాటరీలు గెలుపొందడానికి వీలు కలుగుతుంది. ప్రపంచంలోనే దీర్ఘకాలం కొనసాగే ఈ తరహా ఈవెంట్ ఇదొక్కటే అని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఇది కొనసాగనుంది.
 
 బంగారు బిస్కెట్ల ధర తక్కువే
 గత ఏడాది దుబాయ్ షాపింగ్ ఫెస్ట్‌కి కుటుంబంతో వెళ్లాం. చాలా ఎంజాయ్ చేశాం. షాపింగ్ ఇష్టపడే వారికి ఈ ఫెస్ట్ సూపర్బ్. బంగారు ఆభరణాల ధరలు పెద్ద తేడా అనిపించలేదు. కానీ బంగారు బిస్కెట్‌ల ధర మాత్రం తక్కువే అనిపించింది. అటు షాపింగ్, ఇటు నగర పర్యటనకు ఇది సరైన సమయం.
                                        - గుబ్బా రమేష్
 
 ఇదీ బుర్జ్‌ఖలీఫా ప్రత్యేకత దుబాయ్ నగరంలోని బుర్జ్ ఖలీఫా భవనం పర్యాటకుల మది దోచుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవంతిగా  ప్రసిద్ధిగాంచింది. ఆ విశేషాలు...
 భవనం ఎత్తు: 829.8 మీటర్లు
 అంతస్తులు: 154. ఇవి కాక నిర్వహణకు సంబంధించినవి మరో 9 అంతస్తులు అదనం.
 నిర్మాణం: 2004లో మొదలుపెట్టారు. 2010 జనవరిలో దీన్ని ప్రారంభించారు.
 వాణిజ్య స్థలం: 33.31 లక్షల చదరపు అడుగులు.
 అక్కడ దొరికేవి: గుండు పిన్ను మొదలు బంగారం, వజ్రాలు, రత్నాలతో పాటు ఖరీదైన హోటల్స్, వైద్య సేవలు, వినోదం, ఆటలు వంటి సకల సౌకర్యాలున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన యంత్రాంగం పటిష్టంగా ఉంది.
 
 అద్భుతాల లోకం...
 ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ దుబాయ్‌లో ఉంది. దీనిలో 12 వేల రిటైల్ షాపులు ఉన్నాయి. 635 రిటైల్ సంస్థలు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. డాల్ఫిన్లతో కనువిందు చేసే తొలి పూర్తి స్థాయి ఏసీ డాల్ఫినేరియం మరో ఆకర్షణ, దాదాపు 54 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ డాల్ఫినేరియం చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం కూడా ఇక్కడే ఉంది. దాదాపు 10 మిలియన్ లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న ఈ అక్వేరియం ప్యానెల్‌లో వేల సంఖ్యలో సముద్ర జంతువులున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మానవ నిర్మిత కట్టడం బుర్జ్ ఖలీఫా కూడా ఇక్కడే ఉంది. దీని ఎత్తు 829.8 మీటర్లు. బుర్జ్ ఖలీఫాను ఎలివేటర్ల ద్వారా చూడడానికి టూరిజం సంస్థలు ముందే ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. టూరిజం ప్యాకేజీలో భాగంగా చూపించే ఎడారి సఫారీ కూడా అద్భుతం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement