బంగారు బిస్కట్ పేరుతో మోసం
► మహిళ మెడలోని తులంనర చైన్ అపహరణ
► సిరిసిల్లలో సినీఫక్కీలో చోరీ
సిరిసిల్ల టౌన్ : రోడ్డుపై బంగారు బిస్కెట్ దొరికిందని.. అందరం పంచుకుందామని ఇద్దరు మహిళలు మరో మహిళ మెడలోని తులంన్నర బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ ఘటన సిరిసిల్లలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమణమ్మ ఉదయం కరీంనగర్ వెళ్లింది. మధ్యాహ్నం స్వగ్రామానికి వెళ్లేందుకు సిరిసిల్లకు చేరుకుంది. మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి, బస్సు కోసం బస్టాండుకు బయల్దేరింది. స్థానిక పత్తిపాక వీధిలో ఇద్దరు మహిళలు తమకు బంగారం బిస్కెట్ దొరికిందని రమణమ్మకు తెలిసేలా మాట్లాడారు. రమణమ్మ దగ్గరకు వచ్చి నకిలీ బంగారు బిస్కెట్ చూపించి, ముగ్గురం కలిసి పంచుకుందామన్నారు.
వారించిన రమణమ్మ పోగొట్టుకున్నవాళ్లకు అప్పగించాలని కోరగా.. మనం దొంగతనం చేయలేదని, ఎవరికీ ఇచ్చే అవసరం లేదని నచ్చజెప్పారు. ఇంతలో అటువైపు నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. తాను స్వర్ణకారుడినని చెప్పి దొరికింది నిజమైన బంగారమేనని నమ్మబలికాడు. ఈ బిస్కెట్ తీసుకుని రమణమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును మహిళలకు ఇవ్వమని సూచించాడు.
వారి మోసాన్ని గుర్తించని రమ ణమ్మ మెడలోని తులంన్నర బంగారు గొలుసును వారికిచ్చింది. సుమారు పదితులాల బరువుగల నకిలీ బంగారు బిస్కెట్‌ను తీసుకుంది. కొద్ది సేపట్లో ఇద్దరు మహిళలు, స్వర్ణకారుడు అక్కడి నుంచి ఉడాయించారు. అనుమానం వచ్చిన రమణమ్మ మరో స్వర్ణకారుడి వద్దకు వెళ్లి బిస్కెట్ చూపించగా, అది నకిలీదని తేలింది. ఐడీ పార్టీ పోలీసులు రాజేందర్, బాబు దొంగల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన దొంగల ముఠా ఈ పని చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.