చిత్తూరు అర్బన్: పోలీసు శాఖలో భాగమైన హోంగార్డుల్లో ఇద్దరు అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు. హోంగార్డులుగా పని చేస్తూనే లొసుగులను పసిగట్టి మరో ఇద్దరికి హోంగార్డు ఉద్యోగాలను కట్టబెట్టిన బాగోతం వెలుగుచూసింది. ఒక్కో పోస్టుకు రూ.3లక్షల చొప్పున వసూలు చేయడం గమనార్హం! వివరాలు.. చిత్తూరులోని ఆర్మ్‌డ్ రిజర్వు(ఏఆర్) విభాగంలో 11 మంది హోంగార్డులు రైల్వేలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూలైకు సంబంధించి వేతనాల కోసం 13 మంది పేర్లతో డ్యూటీ సర్టిఫికెట్ రావడంతో ఏఆర్ ఇన్‌స్పెక్టర్ మురళీధర్ ఈనెల 19న టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: 8 కిలోల బంగారంతో వ్యాపారి అదృశ్యం
కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు మండలంలోని తుమ్మిందకు చెందిన డి.రాఘవేంద్ర(46), మిట్టూరు వాసి జె.కె.గురుభూషన్(34), ఓటిచెరువు వాసి టి.యువరాజ్ (39), మురకంబట్టుకు చెందిన ఆర్.మణిగండన్(39ను 20వ తేదీన అరెస్టు చేశారు. వీరిలో యువరాజ్, మణిగండన్ ఇద్దరూ కూడా ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరికీ గుంతకల్లు డివిజన్‌లోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలిస్తున్నట్లు నకిలీ రిక్రూట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి డ్యూటీలు కేటాయించారు. ఇందుకోసం ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హోంగార్డు విభాగానికి డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఏఆర్‌ఐ, ముగ్గురు పర్యవేక్షకులున్నా ఇవేమీ పట్టకుండా పనిచేస్తుండటం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
బయటపడిందిలా...
జూలైకు సంబంధించి తమవద్ద ఉన్న జాబితా కాకుండా అదనంగా ఇద్దరి డ్యూటీ సర్టిఫికెట్లు రావడాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్ గుర్తించారు. వీళ్లకు జీతాలు ఎలా ఇవ్వాలో తెలియక అధికారులకు విషయాన్ని చెప్పడంతో నకిలీ బాగోతం బయటపడింది. అసలు రెగ్యులర్ హోంగార్డులు ఎందరు ఉన్నారు? పేమెంట్ హోంగార్డులు ఎందరు ఉన్నారనే పక్కా సమాచారం అధికారుల వద్ద లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని నిందితులు నకిలీ రిక్రూట్‌మెంట్ ఆర్డర్లు, డ్యూటీ పాస్‌పోర్టులు ఇచ్చి మోసాలకు పాల్పడ్డారు.
గతంలో ఎన్నో..
హోంగార్డుల నియామకానికి సంబంధించి జిల్లా పోలీసుశాఖ పలుమార్లు నవ్వులపాలైంది. పదేళ్ల క్రితం 34 మంది హోమ్‌గార్డులను అక్రమంగా నియమించినందుకు అప్పట్లో జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగిని అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం చిత్తూరు ట్రాఫిక్ స్టేషన్‌లో పనిచేసే హోమ్‌గార్డు.. పలువురికి ఉద్యోగాలిప్పిస్తామంటూ భారీగా వసూళ్లకు పాల్పడడంతో అతడ్ని కూడా అరెస్టు చేశారు. తాజా ఘటనలో ఇద్దరు హోమ్‌గార్డులు అరెస్టు కావడం ఈ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోంది. ఉన్నతాధికారులు హోమ్‌గార్డులను ఆర్డర్లీ వ్యవస్థకే పరిమితం చేయకుండా వారి సాధక బాధలపై కూడా దృష్టిపెట్టి, హోంగార్డు విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటోంది.
చర్యలు తీసుకున్నాం
నకిలీ పత్రాలతో హోంగార్డు పోస్టు రిక్రూట్‌మెంట్, డ్యూటీ పాస్‌పోర్టు ఇచ్చిన ఇద్దరితో పాటు క్రైమ్ జరుగుతోందని తెలిసి డ్యూటీలకు వెళ్లిన వారిని అరెస్టు చేశాం. ఇంకా ఎవరైనా డబ్బులిచ్చి మోసపోయి ఉంటే డయల్–100కు ఫోన్‌చేసి చెప్పండి. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు
చదవండి: రాహుల్ హత్యకేసు కొలిక్కి
Comments
Please login to add a commentAdd a comment