శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిబ్రవరి 8న తీసుకున్న టికెట్‌కు రూ.కోటీ పాతిక లక్షల ప్రైజ్‌మనీ తగిలినట్లు డ్రా ఫలితాల్లో వచ్చింది. అయితే, ఆ టికెట్ తాము విక్రయించలేదని సదరు వ్యాపారి చెప్పేశాడు. అసలా టికెట్టే నకిలీ అని తేల్చి పారేశారు. లాటరీ డబ్బును ఇచ్చేది లేదని మొండికేశాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు, గత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపాలని డీఎస్పీ మహేంద్రను ఆదేశించారు. కొన్నాళ్లు అంతర్గత విచారణ చేపట్టి ఒకే రోజు నగరంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసేసరికి లాటరీల గుట్టు రట్టయ్యింది. చెప్పాలంటే ఇదొక పెద్ద రాకెట్.
– సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
ఒక్కసారిగా లక్షాధికారి కావాలనే ఆశతో పేద, బడుగు వర్గాలకు చెందిన ప్రజలు లాటరీలకు బానిసలుగా మారుతున్నారు. నిత్యం లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ నష్టాల్లో కూరుకుపోతున్నారు. బోడోల్యాండ్, తమిళనాడు, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, గోవాలతో పాటు ఇతర దేశాలైన భూటాన్, నేపాల్ టికెట్లు విక్రయిస్తుంటారు. వాటిపై మన రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు. శ్రీకాకుళం కేంద్రంగా చేసుకుని కొందరు వ్యాపారులు ఈ దందాను మూడు పూలు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి టికెట్లు సరఫరా చేస్తున్నారు.
వీరు ఇతర రాష్ట్రాల్లోని ఏజెంట్లకు ముందస్తుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ రూపంలో చెల్లించి ఆ కంపెనీల లాటరీ టికెట్లను బల్క్‌లో తెప్పించుకుంటున్నారు. విక్రయించిన వాటిలో లాటరీ ప్రైజ్‌మనీ తగలగానే రెండో రోజు వ్యాపారి ఖాతాలో నగదు జమ అవుతుంది. అందులో 5 నుంచి 10 శాతం వ్యాపారి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని లాటరీ తగిలిన వ్యక్తికి అందజేస్తున్నారు. టిక్కెట్ల విక్రయాల దగ్గర నుంచి నగదు పంపిణీ వరకు ఒక ప్రణాళికా బద్ధంగా చేపడుతున్నారు.
వ్యూహాత్మకంగా నకిలీ లాటరీలు..
ఇతర రాష్ట్రాల లాటరీల ముసుగులో నకిలీ లాటరీలు కూడా నడుపుతున్నారు. సొంతంగా వెబ్‌సైట్ తయారు చేసుకుని, పలు పేర్లతో లాటరీ టికెట్లు ముద్రించి విక్రయాలు జరుపుతున్నారు. ఏఆర్ డైమండ్, సిక్కిం డాటా, ఏఆర్ లక్ష్మీ, సిక్కిం సూపర్ తదితర పేర్లతో టిక్కెట్లు ముద్రించి విక్రయిస్తున్నారు. అంతా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. ఎవరికెంత ప్రైజ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుని ఆ మేరకు డ్రా తీస్తారు. తక్కువ మొత్తం ప్రైజ్‌ను టికెట్లు కొనుగోలు చేసినోళ్లకి ప్రకటిస్తారు. ఎక్కువ మొత్తం ప్రైజ్ టికెట్లను తమ వద్దే అట్టి పెట్టుకుని ఉంచుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా లాటరీ విక్రయాలు, డ్రా తీయడం చేస్తారు. కొనుగోలు చేసిన వారికి ప్రైజ్ వస్తున్నట్టుగా విజేతలను ప్రకటిస్తారు. పెద్ద మొత్తంలో ప్రైజ్‌లను తమ వద్ద ఉంచుకుని, చిన్న మొత్తం ప్రైజ్‌లను ప్రకటిస్తారు. ఇక్కడ చదవండి: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు..
రూ.20 నుంచి రూ.500 వరకు..
మార్కెట్‌లో విక్రయించే నిషేధిత లాటరీ టికెట్ ఒక్కొక్కటి రూ.20 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. కుయల్, రోసా, తంగం, నల్లనేరమ్, కుమరన్, విష్ణు పేర్లతో లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. వీటికి లక్షల్లో, కోట్లలో లాటరీ బహుమతులు ఉన్నట్టు చెప్పి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. బహుమతి తమకే తగులుతుందన్న ఆశతో ప్రజలు నిత్యం టికెట్లు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. పలు కంపెనీల లాటరీలకు సంబంధించి నంబర్లను వ్యాపారులు తెల్ల స్లిప్పులపై రాసి విక్రయిస్తున్నారు. డ్రా తేదీకి వారం ముందు నుంచే విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఫలితాలను తెలుసుకుంటున్నారు.
ఇదొక పెద్ద రాకెట్..
లాటరీ టికెట్ల వ్యాపారం పెద్ద రాకెట్‌గా నడుస్తోంది. ఇటీవల దొరికిన 16 మందే కాదు...ఆ జాబితా ఇంకా పెద్దదే. ఒక్క శ్రీకాకుళం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే ముసుగులో నకిలీ లాటరీల చెలామణి కూడా జరుగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు జిల్లా వ్యాప్తంగా నిఘా పెడితే లాటరీల గుట్టు మరింత బయటపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment