సాక్షి, హైదరాబాద్: సార్, మీరు చాలా అదృష్టవంతులు మీ ఫోన్ నంబర్ రూ. 25 లక్షల లాటరీ మనీ గెలుచుకుంది. వెంటనే మేం అడిగిన డాక్యుమెంట్స్‌ను అందించండి.. మీ రూ. 25 లక్షల చెక్కును సొంతం చేసుకోండి.. అంటూ నాలుగేళ్ల క్రితం ఓ అనామకుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌కు స్పందించాడు చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు. డాక్యుమెంట్స్ ఇచ్చి కొంత డబ్బు పంపగా.. రూ. 25 లక్షలు.. ఇపుడు కోట్లకు చేరుకుందని ఆశపెట్టి ఇప్పుడు అప్పులబారిన పడేలా చేశారు సైబర్ కేటుగాళ్లు. చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు వృత్తి రీత్యా ఐటీ కంపెనీలో చేస్తున్నాడు. అతిపిన్న వయస్సులో రూ. 25 లక్షల లాటరీ గెలిచాననే ఆనందంలో ఇదంతా ఫేక్ అనేది గ్రహించలేకపోయాడు.
రూ. 25 లక్షలు ఫ్రీగా వస్తున్నప్పుడు కొంత సొంత డబ్బు ఖర్చు చేస్తే పోయేదేముందనుకుని సైబర్ కేటుగాళ్లు అడిగినప్పుడల్లా వేలకు వేలు పంపాడు. ఇతను పంపుతున్న కొద్దీ అక్కడ లాటరీ మనీ పెరుగుతుందని నమ్మించారు. రూ. 25 లక్షల నుంచి రూ. 14 కోట్లు గెలుచుకున్నావంటూ ఊహల్లో కోటీశ్వరుడిని చేసేశారు. ఆ రూ.14 కోట్ల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 2 కోట్లు వారికి చెప్పిన అకౌంట్‌లకు పంపాడు. ఈ నాలుగేళల్లో తన సొంత డబ్బు, కుటుంబీకుల దగ్గర తీసుకున్నవి, స్నేహితుల దగ్గర అప్పుల చేసి మరీ వెచ్చించాడు.
వారు లాటరీ డబ్బు పెంచుతూ ఇతని వద్ద డబ్బు కాజేస్తున్నారే తప్ప.. ఇతనికి వచ్చిన లాటరీ డబ్బు మాత్రం ఇవ్వట్లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన యువకుడు ఇదంతా ఫేక్ అని గ్రహించి సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎ ప్రసాద్ తెలిపారు.
లాభాలంటూ రూ. 16 లక్షలు లూటీ
అంబర్‌పేటకు చెందిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటూ ఒత్తిడి చేశారు. కోటీశ్వరుడివి అవుతావంటూ ఆశ పెట్టడంతో క్యాట్ డీడీ డాట్‌కామ్, క్యాట్ జీఎస్టీ డాట్‌కామ్‌లలో ఇప్పటి వరకు రూ. 16.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వకపోవడంతో బాధితుడు సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment