lottery scam
-
Hyderabad: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!
సాక్షి, హైదరాబాద్: సార్, మీరు చాలా అదృష్టవంతులు మీ ఫోన్ నంబర్ రూ. 25 లక్షల లాటరీ మనీ గెలుచుకుంది. వెంటనే మేం అడిగిన డాక్యుమెంట్స్‌ను అందించండి.. మీ రూ. 25 లక్షల చెక్కును సొంతం చేసుకోండి.. అంటూ నాలుగేళ్ల క్రితం ఓ అనామకుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌కు స్పందించాడు చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు. డాక్యుమెంట్స్ ఇచ్చి కొంత డబ్బు పంపగా.. రూ. 25 లక్షలు.. ఇపుడు కోట్లకు చేరుకుందని ఆశపెట్టి ఇప్పుడు అప్పులబారిన పడేలా చేశారు సైబర్ కేటుగాళ్లు. చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు వృత్తి రీత్యా ఐటీ కంపెనీలో చేస్తున్నాడు. అతిపిన్న వయస్సులో రూ. 25 లక్షల లాటరీ గెలిచాననే ఆనందంలో ఇదంతా ఫేక్ అనేది గ్రహించలేకపోయాడు. రూ. 25 లక్షలు ఫ్రీగా వస్తున్నప్పుడు కొంత సొంత డబ్బు ఖర్చు చేస్తే పోయేదేముందనుకుని సైబర్ కేటుగాళ్లు అడిగినప్పుడల్లా వేలకు వేలు పంపాడు. ఇతను పంపుతున్న కొద్దీ అక్కడ లాటరీ మనీ పెరుగుతుందని నమ్మించారు. రూ. 25 లక్షల నుంచి రూ. 14 కోట్లు గెలుచుకున్నావంటూ ఊహల్లో కోటీశ్వరుడిని చేసేశారు. ఆ రూ.14 కోట్ల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 2 కోట్లు వారికి చెప్పిన అకౌంట్లకు పంపాడు. ఈ నాలుగేళల్లో తన సొంత డబ్బు, కుటుంబీకుల దగ్గర తీసుకున్నవి, స్నేహితుల దగ్గర అప్పుల చేసి మరీ వెచ్చించాడు. వారు లాటరీ డబ్బు పెంచుతూ ఇతని వద్ద డబ్బు కాజేస్తున్నారే తప్ప.. ఇతనికి వచ్చిన లాటరీ డబ్బు మాత్రం ఇవ్వట్లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన యువకుడు ఇదంతా ఫేక్ అని గ్రహించి సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎ ప్రసాద్ తెలిపారు. లాభాలంటూ రూ. 16 లక్షలు లూటీ అంబర్‌పేటకు చెందిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ ఒత్తిడి చేశారు. కోటీశ్వరుడివి అవుతావంటూ ఆశ పెట్టడంతో క్యాట్ డీడీ డాట్‌కామ్, క్యాట్ జీఎస్టీ డాట్‌కామ్‌లలో ఇప్పటి వరకు రూ. 16.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వకపోవడంతో బాధితుడు సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.75 లక్షల లాటరీ తగిలింది.. చిన్న ప్రక్రియ అంతే! రూ.34 లక్షలు స్వాహా!
గూడూరు: ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. చిన్న ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేస్తాం...’ అంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా నమ్మబలికి గూడూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి విడతల వారీగా రూ.34లక్షలు స్వాహా చేశాడు. పది నెలల నుంచి గుట్టుగా సాగుతున్న ఈ మోసం గురించి బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. ఆ మొత్తాన్ని మీ అకౌంట్లో జమ చేసేందుకు కొన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేయాల్సి ఉంది’ అని ఫోన్ చేసిన వ్యక్తి నమ్మబలికాడు. దీంతో అతను అడిగిన పత్రాలను బాధితుడు ఆన్లైన్లో పంపించాడు. ఆ తర్వాత ‘మీకు మేము అందజేసే డబ్బులకు ఇన్కమ్ ట్యాక్స్ రూ.5.75లక్షలు ముందుగా కట్టాలి. అప్పుడే ఆ మొత్తాన్ని మీ అకౌంట్‌కు బదిలీ చేయగలం...’ అని చెప్పాడు. దీంతో అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా, కాస్త సమయం ఇస్తున్నామని, ఎలాగైనా డబ్బులు చెల్లించి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అజ్ఞాత వ్యక్తి నమ్మబలికాడు. ఎట్టకేలకు బాధితుడు రూ.5.75లక్షలను అజ్ఞాత వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్లో జమ చేశాడు. మళ్లీ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆదాయపన్ను చెల్లించామని, జీఎస్టీ కోసం కొంత మొత్తం పంపాలని చెప్పగా, అకౌంట్లో బాధితుడు డబ్బులు వేశాడు. ఇలా పలుమార్లు డబ్బులు జమ చేశాడు. చివరిగా ఇటీవల అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ‘ఇక ప్రాసెస్ మొత్తం పూర్తయింది. రూ.4.5లక్షలు చెల్లిస్తే రూ.75లక్షలు మీ అకౌంట్లో జమ అవుతుంది’ అని చెప్పాడు. దీంతో అంత డబ్బు తన వద్ద లేవని బాధితుడు చెప్పగా, రూ.50వేలు పంపాలని, మిగిలినవి తామే జమ చేస్తామని నమ్మబలికాడు. బాధితుడు మళ్లీ రూ.50వేలు అకౌంట్లో వేశాడు. ఈ విధంగా వివిధ పేర్లు చెప్పి విడతల వారీగా రూ.34లక్షలు అజ్ఞాత వ్యక్తి తన అకౌంట్లలో జమ చేయించుకున్నాడు. అయినా బాధితుడికి లాటరీ డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గూడూరు వన్‌టౌన్ ఎస్ఐ హజరత్‌బాబు తెలిపారు. గతంలోనూ మహిళకు టోకరా... అదే విధంగా గతంలోనూ గూడూరు రూరల్ పరిధిలోని కంభంపాటి లక్ష్మీదేవి అనే మహిళకు లాటరీ వచ్చిందని గుర్తుతెలియని వ్యక్తులు నమ్మబలికి ఆమె నుంచి రూ.5.9లక్షలు స్వాహా చేశారు. ఈ మేరకు జనవరిలో గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. -
సైబర్ టాక్: కొనకుండానే లాటరీ వచ్చిందా?!
లాటరీలో గెలుపొందినట్టు మీకు ఫోన్ కాల్ లేదా ఇ–మెయిల్ లేదా ఎసెమ్మెస్, వాట్సప్ ల ద్వారా లింక్స్, స్క్రాచ్కార్డ్లు వచ్చాయా?! అయితే, వాటిని ఉపయోగించాలనుకునేముందు ఒక్కమాట.. ఇటీవల అధికంగా జరుగుతున్న మోసాలలో ఆన్లైన్లో లాటరీ స్కామ్ ఒకటి అనే విషయాన్ని గ్రహించండి. జాగ్రత్తగా ఉండండి. ఇటీవల ఢిల్లీ వాసికి రూ.25 లక్షల కెబిసి లాటరీ వచ్చిందని ఫోన్‌కాల్ వచ్చింది. ఆ ఫోన్‌ని రిసీవ్ చేసుకొన్న వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి రూ3.50 లక్షలు పోగొట్టుకున్నాడు. లాటరీ మొత్తం బ్యాంకు ఖాతాలోకి రావాలంటే ముందు టాక్స్, ఇతరత్రా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కాలర్ మాటలను నమ్మి ఓటీపి చెప్పినందుకు తన ఖాతా నుంచి డబ్బు కోల్పోయాడు. ఇలాంటి లాటరీ మోసాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయి. వాటిలో మోసగాళ్లు చెప్పేవి.. ‘వెయ్యి ఫోన్ నెంబర్లలో మీ నెంబర్ లక్కీ డిప్ ద్వారా సెలక్ట్ అయ్యింది, ఫ్రీ హాలీడే కూపన్స్ మీకోసమే, లక్కీ డిప్ ద్వారా కార్ బహుమతిగా గెలుచుకున్నారు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్‌లో మీకు ఓచర్స్ వచ్చాయి..’ ఇలా రకరకాల లాటరీ పద్ధతులతో మిమ్మల్ని ఆకట్టుకునేలా చేస్తారు నేరగాళ్లు. మోసాలకు రెండు సంకేతాలు ► మీ బహుమతిని పొందడానికి మీరు అడ్వా¯Œ ్స మొత్తం ముందే చెల్లించాల్సి ఉంటుంది. ► మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని అందించమని మిమ్మల్ని మోసగాళ్లు కోరుతారు. ఇలా మోసపోయే అవకాశం ► మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి మీకు సందేశం (ఇ–మెయిల్, లేదా ఎస్సెమ్మెస్ లేదా వాట్సప్ లేదా సోషల్ మీడియా ద్వారా) పంపుతారు. ► మోసగాళ్లు తాము ప్రభుత్వ లాటరీ ఏజెన్సీల (ఆర్బిఐ లాటరీ) నుండి అప్రోచ్ అవుతున్నామని చెబుతారు. ► బహుమతి అందుకోవడానికి ఇదే మంచి సమయం ‘వెంటనే చేయండంటూ..’ మోసగాళ్లు మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. మీరు అడ్వా¯Œ ్స లేదా పన్నులు లేదా జీఎస్టీ మొత్తాల వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు త్వరగా చెల్లించాలని కోరుతారు. ► మోసగాళ్లు మనకు తెలిసిన సంస్థల పేర్లనే ఉపయోగిస్తారు (ఉదాహరణకు: కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీ, షాపింగ్ యాప్స్ లాటరీ మొదలైనవి) ► బహుమతిని గెలుచుకున్న ఏకైక వ్యక్తి మీరేనని మోసగాళ్లు మిమ్మల్ని నమ్మిస్తారు. అయితే ఇలాగే, వేలాది మందికి బల్క్ మెసేజ్‌లు పంపుతారని గ్రహించాలి. ► మోసగాళ్లు మీకు కాల్ చేసి మీరు విదేశీ లాటరీని గెలుచుకున్నారని చెప్పవచ్చు (ఉదాహరణకు: యూరో లాటరీ) ► నమ్మకం కలిగించడానికి మోసగాళ్లు మీకు వారి చెక్కులు/డిమాండ్ డ్రాఫ్ట్‌ల కాపీలను కూడా పంపుతారు. కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజు లేదా కన్వీనియ¯Œ ్స ఫీజు లేదా పన్నులు లేదా జీఎస్టీ మొత్తాలు మొదలైనవాటిగా పంపమని మిమ్మల్ని అడుగుతారు. నిషేధం ఉందని గుర్తించండి... భారతప్రభుత్వం లాటరీల నియంత్రణ చట్టం 1998 లో తీసుకువచ్చింది. దేశంలో 13 రాష్ట్రాలు లాటరీలను నిషేధించాయి. ► పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ –1867 తో పాటు, అన్ని రకాల జూదం మన దేశంలో చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్ లేదా ప్లేయర్‌పై (ఆ¯Œ లైన్, ఆఫ్‌లైన్ రెండూ) పందెం వేయడం చట్టవిరుద్ధం. బెట్టింగ్ గేమ్‌ల లాటరీ రెండు రకాలు ► గేమ్ ఆఫ్ ఛా¯Œ ్స. ఇవి అదృష్ట ఆధారితంగా కొనసాగేవి. ► నైపుణ్యం, విశ్లేషణాత్మక నిర్ణయం, తార్కిక ఆలోచన, శారీరక సామర్థ్యం వంటి ఆటల రూపంలో కొనసాగుతాయి. ప్రైజ్ మనీ లేదా అవార్డుల కోసం లాటరీ స్కీమ్‌లు లేదా మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో పాల్గొనడానికి ఏ రూపంలోనైనా డబ్బు డిపాజిట్ చేయడం విదేశీ మారకపు నిర్వహణ చట్టం ప్రకారం నిషేధించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది. మోసాలకు చెక్ ఇలా! ► ఇమెయిల్/ ఎసెమ్మెస్ ద్వారా పంపబడిన చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు ► HTTP://తో ప్రారంభమయ్యే వెబ్సైట్లపై క్లిక్ చేయండి (ఇది ప్యాడ్ లాక్ సింబల్ కలిగి ఉంటుంది) ► మెసేజ్ ఇచ్చినవారు మీ పేరుతో మిమ్మల్ని సంబోధించడం లేదని గ్రహించాలి. ► వ్యక్తిగతంగా కొనుగోలు చేసి, పోటీలో పాల్గొనకపోతే లాటరీ లేదా పోటీలో డబ్బు గెలవలేమని తెలుసుకోవాలి. ► పోటీలు, లాటరీలలో గెలుపొందిన బహుమతిని తీసుకోవడానికి మీరు ముందస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ► అధిక రాబడిని ఆశించి తెలియని వ్యక్తులు లేదా సంస్థలకు నిధులను ఎప్పుడూ బదిలీ చేయవద్దు. ► లాటరీలపై అన్ని ఇ–మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌లు, సోషల్ మీడియా సందేశాలను పట్టించుకోవద్దు. ► మీరు లాటరీని గెలుచుకున్నారని పేర్కొంc టూ యాహూ, హాట్‌మెయిల్, జిమెయిల్ నుండి వచ్చే ఇ–మెయిల్స్‌ను వదిలేయండి. ► క్యూఆర్ కోడ్, ఓటీపీ నెంబర్.. ఇస్తే మోసగాళ్లకు అందిస్తే మీ డబ్బులు పోతాయన్న నిజాన్ని గ్రహించాలి. మీరు లాటరీ మోసానికి గురయ్యారా? మీరు లాటరీ మోసానికి గురైనట్లయితే, 155260కి ఫోన్ చేయండి. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnకు లాగిన్ అవ్వండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు / ఎస్సెమ్మెస్ / ఇ–మెయిల్, కొరియర్ ద్వారా స్వీకరించిన మోసగాళ్ల సంప్రదింపు వివరాలతో పాటు మీ వ్యక్తిగత గుర్తింపు వివరాల సమాచారాన్నీ ఇవ్వాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
లాటరీలో రూ.కోటికి పైగా ప్రైజ్‌మనీ: ఆ టికెట్ నకిలీదట!
శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిబ్రవరి 8న తీసుకున్న టికెట్‌కు రూ.కోటీ పాతిక లక్షల ప్రైజ్‌మనీ తగిలినట్లు డ్రా ఫలితాల్లో వచ్చింది. అయితే, ఆ టికెట్ తాము విక్రయించలేదని సదరు వ్యాపారి చెప్పేశాడు. అసలా టికెట్టే నకిలీ అని తేల్చి పారేశారు. లాటరీ డబ్బును ఇచ్చేది లేదని మొండికేశాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు, గత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపాలని డీఎస్పీ మహేంద్రను ఆదేశించారు. కొన్నాళ్లు అంతర్గత విచారణ చేపట్టి ఒకే రోజు నగరంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసేసరికి లాటరీల గుట్టు రట్టయ్యింది. చెప్పాలంటే ఇదొక పెద్ద రాకెట్. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఒక్కసారిగా లక్షాధికారి కావాలనే ఆశతో పేద, బడుగు వర్గాలకు చెందిన ప్రజలు లాటరీలకు బానిసలుగా మారుతున్నారు. నిత్యం లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ నష్టాల్లో కూరుకుపోతున్నారు. బోడోల్యాండ్, తమిళనాడు, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, గోవాలతో పాటు ఇతర దేశాలైన భూటాన్, నేపాల్ టికెట్లు విక్రయిస్తుంటారు. వాటిపై మన రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు. శ్రీకాకుళం కేంద్రంగా చేసుకుని కొందరు వ్యాపారులు ఈ దందాను మూడు పూలు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి టికెట్లు సరఫరా చేస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని ఏజెంట్లకు ముందస్తుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ రూపంలో చెల్లించి ఆ కంపెనీల లాటరీ టికెట్లను బల్క్‌లో తెప్పించుకుంటున్నారు. విక్రయించిన వాటిలో లాటరీ ప్రైజ్‌మనీ తగలగానే రెండో రోజు వ్యాపారి ఖాతాలో నగదు జమ అవుతుంది. అందులో 5 నుంచి 10 శాతం వ్యాపారి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని లాటరీ తగిలిన వ్యక్తికి అందజేస్తున్నారు. టిక్కెట్ల విక్రయాల దగ్గర నుంచి నగదు పంపిణీ వరకు ఒక ప్రణాళికా బద్ధంగా చేపడుతున్నారు. వ్యూహాత్మకంగా నకిలీ లాటరీలు.. ఇతర రాష్ట్రాల లాటరీల ముసుగులో నకిలీ లాటరీలు కూడా నడుపుతున్నారు. సొంతంగా వెబ్సైట్ తయారు చేసుకుని, పలు పేర్లతో లాటరీ టికెట్లు ముద్రించి విక్రయాలు జరుపుతున్నారు. ఏఆర్ డైమండ్, సిక్కిం డాటా, ఏఆర్ లక్ష్మీ, సిక్కిం సూపర్ తదితర పేర్లతో టిక్కెట్లు ముద్రించి విక్రయిస్తున్నారు. అంతా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. ఎవరికెంత ప్రైజ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుని ఆ మేరకు డ్రా తీస్తారు. తక్కువ మొత్తం ప్రైజ్‌ను టికెట్లు కొనుగోలు చేసినోళ్లకి ప్రకటిస్తారు. ఎక్కువ మొత్తం ప్రైజ్ టికెట్లను తమ వద్దే అట్టి పెట్టుకుని ఉంచుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా లాటరీ విక్రయాలు, డ్రా తీయడం చేస్తారు. కొనుగోలు చేసిన వారికి ప్రైజ్ వస్తున్నట్టుగా విజేతలను ప్రకటిస్తారు. పెద్ద మొత్తంలో ప్రైజ్‌లను తమ వద్ద ఉంచుకుని, చిన్న మొత్తం ప్రైజ్‌లను ప్రకటిస్తారు. ఇక్కడ చదవండి: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు.. రూ.20 నుంచి రూ.500 వరకు.. మార్కెట్లో విక్రయించే నిషేధిత లాటరీ టికెట్ ఒక్కొక్కటి రూ.20 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. కుయల్, రోసా, తంగం, నల్లనేరమ్, కుమరన్, విష్ణు పేర్లతో లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. వీటికి లక్షల్లో, కోట్లలో లాటరీ బహుమతులు ఉన్నట్టు చెప్పి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. బహుమతి తమకే తగులుతుందన్న ఆశతో ప్రజలు నిత్యం టికెట్లు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. పలు కంపెనీల లాటరీలకు సంబంధించి నంబర్లను వ్యాపారులు తెల్ల స్లిప్పులపై రాసి విక్రయిస్తున్నారు. డ్రా తేదీకి వారం ముందు నుంచే విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఇదొక పెద్ద రాకెట్.. లాటరీ టికెట్ల వ్యాపారం పెద్ద రాకెట్‌గా నడుస్తోంది. ఇటీవల దొరికిన 16 మందే కాదు...ఆ జాబితా ఇంకా పెద్దదే. ఒక్క శ్రీకాకుళం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే ముసుగులో నకిలీ లాటరీల చెలామణి కూడా జరుగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు జిల్లా వ్యాప్తంగా నిఘా పెడితే లాటరీల గుట్టు మరింత బయటపడనుంది. -
అదృష్ట దేవతమీదేనంటూ వల
సాక్షి, కామారెడ్డి: ‘లాటరీలో అదృష్ట దేవత మీ తలుపు తట్టొచ్చు.. దాంతో డబ్బులు సులువుగా సంపాదించొచ్చు.. కారో, బంగారు నగలో.. ఏదో ఒకటి మీ సొంతం’అంటూ లాటరీ స్కీంల నిర్వాహకులు ప్రజలను బుట్టలో వేస్తున్నారు. నెలనెలా ఊహించని బహుమతులు మీ సొంతం కావొచ్చంటూ అందమైన బ్రోచర్లను ముద్రించి సభ్యులను చేర్పిస్తున్నారు. అక్రమ దందాతో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మొదలైన ఈ అక్రమ దందా ప్రస్తుతం పది జిల్లాలకు విస్తరిం చింది. కొంతకాలం కిందట రూ.30 వేలు కడితే నెలనెలా రూ.10 వేల చొప్పున పది నెలల పాటు మొత్తంగా రూ.లక్ష ఇస్తామంటూ నమ్మబలికిన ‘బీర్షేబా’అనే సంస్థ ప్రజల నుంచి రూ.వందల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఇది మరచిపోకముందే లాటరీల పేరుతో లూటీ జరుగుతోంది. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే ఇలాంటివి 45 స్కీంలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులే స్కీంల నిర్వాహకులుగా అవతారం ఎత్తడంతో అడ్డుకునే వారు లేకుండా పోయారు. 3 వేలకు పైగా సభ్యులతో.. ఒక స్కీం నిర్వాహకులు 2,999 మంది సభ్యులను చేర్చుకుని, నెలకు రూ.వెయ్యి చొప్పున 15 నెలల పాటు వసూలు చేశారు. మరో స్కీం నిర్వాహకులు 3 వేల మంది సభ్యులతో, నెలకు రూ.1,500 చొప్పున 12 నెలల పాటు వసూలు చేశారు. మరో స్కీం నిర్వాహకులు 3,500 మంది సభ్యులను చేర్చుకుని నెలకు రూ.1,200 చొప్పున 12 నెలల పాటు నడిచే స్కీం పెట్టారు. ఇలా జిల్లాలో దాదాపు 45 స్కీంలు కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో మొదలైన దందా మెదక్, సిద్దిపేట, నిర్మల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ తదితర జిల్లాలకూ విస్తరించింది. కామారెడ్డికి చెందిన నిర్వాహకులు అక్కడి వారిని ఏజెంట్లుగా చేర్చుకుని దందాను నడుపుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్కీంలలో దాదాపు 1.3 లక్షల మంది సభ్యులు ఉన్నట్లు అంచనా. ఆకర్షణీయ బహుమతులు స్కీంల నిర్వాహకులు మంచి బహుమతులంటూ అమాయకులను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. 2,999 మంది సభ్యులు ఉంటే అందరికీ కచ్చితమైన బహుమతి అని చెబుతున్నారు. ఇందులో బంపర్ డ్రాలుగా కార్లు, బంగారు ఆభరణాలు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, స్కూటీలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, సెల్ఫోన్ల వంటివి ఇస్తున్నారు. మొత్తం సభ్యుల్లో 200 మంది వరకు బంపర్ డ్రాలో పెద్ద పెద్ద బహుమతులు వస్తాయి. ఆఖరుకు మిగిలిన సభ్యులకు తలా ఒక చిన్నపాటి బహుమతి ఇస్తారు. సభ్యుడు నెలకు వెయ్యి చొప్పున రూ.15 వేలు చెల్లిస్తే, అతనికి ఇచ్చే బహుమతి విలువ రూ.5 వేల లోపే ఉంటుంది. కానీ సభ్యులకు బంపర్ డ్రాల ఆశ చూపి సభ్యులుగా చేర్పిస్తున్నారు. రూ. కోట్ల దందా.. జిల్లా కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో కోట్లకొద్దీ రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక స్కీంలో 15 నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున 3 వేల మంది సభ్యులు చెల్లించే మొత్తం రూ.4.5 కోట్లు అవుతుంది. ఇందులో బంపర్ బహుమతులు, మిగతా సభ్యులందరికీ ఇచ్చే సాధారణ బహుమతులన్నింటికీ కలిపి రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఏజెంట్లకు కమీషన్‌గా రూ.20 లక్షల వరకు చెల్లిస్తున్నారు. మరో రూ.50 లక్షల వరకు ఇతర ఖర్చులు పోయినా ఒక్కో స్కీం ద్వారా రూ.2 కోట్ల వరకు మిగులుబాటు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏ కష్టం లేకుండా రూ.కోట్లు వస్తుండడంతో ఒక్కో స్కీం నిర్వాహకుడు కొత్తగా మరికొన్ని స్కీంలు రూపొందించి ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వీటిపై దృష్టి సారించారు. నిర్వాహకులపై కఠినచర్యలు బంపర్ డ్రాల పేరుతో కొందరు లాటరీలను నడుపుతున్నారు. అలాంటి వాటికి ఏ రకమైన అనుమతులు లేవు. ఇలాంటి స్కీంలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ప్రజలు అత్యాశకు పోయి డబ్బులు పెట్టి మోసపోతున్నారు. లక్కీ డ్రాల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వండి. 08468–226633 నంబరుకు కాల్ చేయండి. – శ్వేత, కామారెడ్డి ఎస్పీ -
కారు గెలుపొందారంటూ టోకరా
కర్నూలు, బొమ్మలసత్రం: కారు గెలుపొందారంటూ ఫోన్‌చేసి రూ. 1.90 లక్షలు దండుకొని గుర్తు తెలియని వ్యక్తి టోకరా వేశాడు. బాధితుడు సోమవారం స్థానిక రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన బాలస్వామి అదే గ్రామంలో ఆర్సీఎం చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల కిందట కొత్త నంబర్ నుంచి సెల్‌కు ఫోన్ వచ్చింది. ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడుతూ..లాటరీ తగిలిందని, కొత్త కారు మీరు గెలుచుకున్నారని, జీఎస్టీ చెల్లిస్తే కారు మీ ఇంటికి పంపుతామని నమ్మించాడు. నగదు వేసేందుకు అకౌంట్ నంబర్ ఇవ్వటంతో బాలస్వామి..అదులో విడతల వారిగా 1.90 లక్షలు నగదు బదిలీ చేశాడు. నగదు పంపి రెండునెలలు గడిచినా ఇంతవరకూ కారు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాలస్వామి.. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
జియో లాటరీ పేరుతో లూటీ!
సాక్షి, సిటీబ్యూరో: జియో లాటరీ పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వివాహిత నుంచి రూ.41,300 కాజేశారు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాంపల్లిలోని ఆగపుర ప్రాంతానికి చెందిన వివాహిత భార్గవికి ఈ నెల 9న +923008140684 నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు తాము జియో టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ చెప్పారు. తమ సంస్థ నిర్వహించిన ఉత్తమ కస్టమర్ల లక్కీడ్రాలో ప్రథమ బహుమతి వచ్చిందని, దీనికింద రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ డబ్బు తీసుకునేందుకు వివరాలు తెలపాలని కోరడంతో భార్గవి చెప్పారు. ఆ మరుసటి రోజు జియో విన్నర్స్ సర్టిఫికెట్ పేరుతో ఓ ధ్రువీకరణ పత్రాన్ని పంపారు. దానిపై ఉన్న లోగో, ఇతర వివరాలు చూసిన భార్గవి వారిని పూర్తిగా నమ్మింది. ఆ తర్వాత అసలు వ్యవహారం ప్రారంభించిన నేరగాళ్లు లాటరీ సొమ్ము తీసుకోవడానికి జీఎస్టీ తదితరాలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అలా మూడు దఫాల్లో రూ.41,300 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. అయినా ఆగకుండా వివిధ కారణాలు చెబుతూ మరికొంత మొత్తం డిపాజిట్ చేయమని కోరారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. -
మోసానికో స్కీం!
ఆకర్షణీయమైన బ్రోచర్లు.. వాటిపై బంపర్ డ్రాలు, బహుమతులంటూ రాతలు.. ప్రతినెల కొద్దిమొత్తంలో చెల్లిస్తే చాలు ఖచ్చితమైన బహుమతి అంటూ ఎర.. ఆపై బంపర్‌డ్రాలో కార్లు, బైక్‌లు గెలుచుకునే అవకాశం మీదేనంటూ మాయమాటలు చెప్పే ఏజెంట్లు.. నేతల అండదందలు.. పట్టించుకోని అధికారులు.. వెరసి ఎంటర్‘ప్రైజెస్’ పేరుతో చట్టవ్యతిరేక దందా యథేచ్ఛగా సాగుతోంది. వారి వలలో చిక్కి అమాయకులు మోసపోతూనే ఉన్నారు. సాక్షి, కామారెడ్డి : జిల్లాలో నిషేధిత ఎంటర్‌ప్రైజెస్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అమాయ కులకు గాలం వేస్తూ ముంచేస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ శాఖ చూసీచూడనట్లుగా వదిలేస్తుండడంతో వారి మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రభుత్వం ఏనాడో ఇలాంటి స్కీమ్‌లను నిషేధించింది. అయితే రాజకీయ అండదండలతో కొంత మంది ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కామారెడ్డిలో ఇది బహిరంగ రహస్యమే.. జోరుగా లాటరీ స్కీంలు మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు.. ఎంటర్ప్రైజెస్లవైపు కన్నెత్తి చూడకపోవడంతో నిషేధించబడిన లాటరీలు, స్కీంలు జిల్లా కేం ద్రంలో విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఇటీవల కామారెడ్డిలోని ప్రముఖ వ్యాపారులు కొందరు సిండికేట్‌గా ఏర్పడి ఓ భారీ లాటరీ స్కీంను తెరపైకి తీసుకువచ్చారు. దీని ప్రకారం నెలకు రూ. 1000 చొప్పున 15 నెలల పాటు చెల్లిస్తే.. సభ్యుడు చెల్లించిన మొత్తానికి సరిపడా ఖచ్చితమైన బహుమతి ఉంటుంది. అంతేకాకుండా ప్రతినెల బంపర్ డ్రా పేరుతో స్కీంలో కార్లు, బైక్‌లు, బంగారం కాయిన్లు సొంతం చేసుకోవచ్చని సభ్యులను చేర్చుకున్నారు. ఓ ఎంటర్ప్రైజెస్ పేరుతో మూడు నెలల క్రితం ఈ స్కీం ప్రారంభమైంది. ప్రతినెల రెండో లేదా మూడో గురువారం సిరిసిల్లారోడ్లోని ఓ ఫంక్షన్హాల్లో డ్రా నిర్వహిస్తున్నారు. స్కీంలో మొత్తం 3 వేల మంది సభ్యులను చేర్చుకున్నారు. మొత్తం స్కీం పూర్తయ్యే సరికి రూ. 4.50 కోట్లు వసూలు చేయాలన్నది నిర్వాహకుల లక్ష్యమని తెలుస్తోంది.. దీంట్లో 2.50 కోట్ల వరకు దండుకునే విధంగా స్కీంను రూపొందించారని సమాచారం. ప్రజలను నిలువునా దోపిడీకి గురిచేసే ఇలాంటి లాటరీ స్కీమ్‌ను జిల్లా కేంద్రం నడిబొడ్డున నిర్వహిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది సైతం కామారెడ్డి పాతబస్టాండ్ ప్రాంతంలోని ఓ భవనంలో కార్యాలయాన్ని తెరిచి ఇలాంటి స్కీమ్‌లు నడిపించారు. ప్రస్తుతం మరో ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు కూడా తాజాగా లాటరీ స్కీమ్‌ను ప్రారంభించినట్లు తెలిసింది. పట్టించుకోని అధికారులు లాటరీ పద్ధతిన నిర్వహించే స్కీంలను ప్రభుత్వం ఏనాడో నిషేధించింది. ఇటీవలే నిజామాబాద్‌లో ఇలాంటి స్కీం నిర్వహిస్తున్న ఓ భవనంపై పోలీసులు, అధికారులు దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో నిర్వహిస్తున్న స్కీమ్‌లను మాత్రం పట్టించుకునే వారు కరువయ్యారు. నిర్వాహకులు ఎవరో, స్కీం వివరాలు ఏమిటో అన్నీ తెలిసినా పోలీసులు కానీ, సంబంధిత అధికారులు కానీ అటువైపు వెళ్లడం లేదు. రాజకీయ అండదండలు ఉన్న కొందరు నిర్వాహకులు ఇప్పటికే పోలీసుశాఖలోని కొందరికి, స్థానిక నేతలకు ముడుపులు ఇచ్చి, తమ దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వారి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్కీమ్‌ల పేరుతో ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్న ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుల ఆట కట్టించాలని జనం కోరుతున్నారు. -
సట్టా @ వాట్సాప్!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటివరకు రోడ్డు సైడ్‌కే పరిమితమైన నిషేధిత సింగిల్ నంబర్ లాటరీని పోలి ఉండే సట్టా గేమ్‌ను నగరానికి చెందిన కుమార్ సంజయ్ అనే ప్రధాన నిర్వాహకుడు ఆన్లైన్ వరకు తీసుకువెళ్లాడు. దీనిని గుర్తించిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి రెండు ముఠాలను పట్టుకున్నారు. ఈ రెంటిలోనూ సంజయ్ గ్యాంగ్ వాట్సాప్‌తో పాటు ఇతర యాప్స్‌ను వినియోగించి, కుమార్ జైశ్వాల్ గ్యాంగ్ ‘సంప్రదాయ పద్దతి’లో సట్టా జూదం నిర్వహిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. కుమార్ సంజయ్ ‘కేఎస్ ఆన్లైన్ ప్లే వాట్సాప్’ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఇతడి వద్ద లాలగూడకు చెందిన వి.శ్రవణ్‌కుమార్ సబ్–బ్రోకర్‌గా పని చేస్తున్నాడు. ఇతడితో పాటు మరికొందరు నిర్వాహకులు, పంటర్లు కొన్ని యాప్స్ వాడుతున్నారు. మట్కా.మోబీ, సట్టామట్కా07.కామ్, సట్టామట్కా143 వంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీని ఆధారంగా సట్టా జూదాన్ని వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్నారు. మరోపక్క జైశ్వాల్ వద్ద సబ్–బ్రోకర్‌గా పని చేస్తున్న లాలాపేట్ వాసి ఎస్.సుధాకర్ పాత పద్దతిలోనే సట్టా స్లిప్పులు, పుస్తకాలతో దందా నడుపుతున్నాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం శుక్రవారం లాలగూడ ప్రాంతంలో దాడులు చేసి శ్రవణ్, సుధాకర్‌లతో పాటు 10 మంది పంటర్లను పట్టుకున్నారు. వీరిని తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. -
స్కీములు.. స్కాములు!
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అనుమతులు లేకుండా స్కీమ్‌లు నిర్వహిస్తూ నిషేధిత లాటరీ దందాకు పాల్పడటంతో పాటు అనేక మందిని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో, ఒకే భవనంలో దందా చేస్తున్నారని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.91 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్వాన్కు చెందిన మహ్మద్ అబేద్, మహ్మద్ షకీర్ టప్పాచబుత్రలోని ఎస్ఏ ప్లాజాలో ఆరిమ్ ఎంటర్ప్రైజెస్, న్యూ యువÆ్టŠ‡ నీడ్స్ ఎంటర్ప్రైజెస్ పేర్లతో దుకాణాలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల స్కీములు నిర్వహిస్తున్న వీరిద్దరూ నిషేధిత లాటరీ దందా నడుపుతున్నారు. ఒక్కో స్కీమ్‌లో సభ్యులుగా ఉండే 3 వేల మంది 16 నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 5, 18 తేదీల్లో డ్రాలు తీస్తుంటారు. అబేద్ మొదటి బహుమతి కింద బుల్లెట్, రెండో బహుమతిగా మూడు తులాల బంగారం, మూడో బహుమతి కింద బైక్... షకీర్ కారు, బైక్ తదితరాలను ప్రకటించారు. ఇలా ప్రతి నెలా సభ్యుల నుంచి దాదాపు రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్న వీరు గరిష్టంగా రూ.15 లక్షల విలువైన బహుమతులే ఇస్తున్నారు. ఇలా మొదటి నెల మినహా మిగిలిన 15 నెలల్లో నెలకు 10 మంది చొప్పున మొత్తం 150 మందికే ఈ బహుమతులు ఇస్తున్నారు. మిగిలిన 2850 మందికీ లాటరీ రాని కారణంగా వారు చెల్లించిన రూ.16 వేలకు బదులుగా గరిష్టంగా రూ.10 వేల విలువైన టీవీలు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వీరి అక్రమ దందాపై సమాచారం అందుకున్న పశ్చిమ మండ ల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎల్.భాస్కర్‌రెడ్డి ఏకకాలంలో దాడి చేసి మంగళవారం ఇరువురినీ అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసులను టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు. -
లాటరీ పేరుతో లూఠీ!
ఒంగోలు: కేరళ లాటరీతో బడుగులు నష్టపోతున్నారు. అది శ్రమజీవుల పాలిట శాపంగా మారింది. వాట్స్ యాప్‌ల్లో సైతం లాటరీకి సంబంధించి దుష్ప్రచారం జరుగుతుండటంతో అమాయకులు అక్రమార్కుల వలలో పడుతున్నారు. ఒక్క రోజులో దశ తిరిగింది.. ఈ రోజు లాటరీలో మీకు ఈ లక్కీ నంబర్లు అదృష్టం కలిగించనున్నాయంటూ ఊదరగొడుతుండంతో సామాన్యులు లాటరీ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యవహారం పోలీసు వర్గాల దృష్టికి చేరినా స్పందన లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేరళ లాటరీ విధానం ఇలా.. కేరళ ప్రభుత్వం అధికారికంగా లాటరీ నిర్వహిస్తోంది. దానికి రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిల్లో సైతం అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఏజెంట్ వ్యాపారం చేసుకోవాలంటే తప్పక లైసెన్స్ తీసుకోవాలి. లక్ష రూపాయల లోపు జిల్లాస్థాయి అధికారి, రూ.20 లక్షల వరకు అయితే డిప్యూటీ డైరెక్టర్, 20 లక్షలకు మించితే డైరెక్టర్ ఆఫ్ లాటరీస్ నుంచి ఏజెంటు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బంకు, సొంత షాపు, వెహికల్ మీద తరుగుతూ ఆన్లైన్ లేదా కాలినడకన విక్రయించదలుచుకున్నారా అనేది కూడా ఏజెన్సీ తీసుకునే సమయంలో స్పష్టం చేయాల్సి ఉంటుంది. వారంలో ఏడు రోజులకు ఏడు రకాల లాటరీలు అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. సోమవారం విన్–విన్, మంగళవారం స్త్రీశక్తి, బుధవారం అక్షయ, గురువారం కారుణ్య ప్లస్, శుక్రవారం నిర్మల్ వీక్లీ, శనివారం కారుణ్య, ఆదివారం పౌర్ణమి అనే లాటరీలు కేరళ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించే లాటరీ గరిష్ట బహుమతి రూ.60 లక్షలుకాగా, శని, ఆదివారాలు నిర్వహించే లాటరీ గరిష్ట బహుమతి రూ.80 లక్షలు. మిగిలిన రోజుల్లో లాటరీ గరిష్ట బహుమతి రూ.50 లక్షలుగా ఉంది. ఈ టిక్కెట్లకు సంబంధించి ధరలు రూ.30లు, రూ.40లు, రూ.50లుగా ఉన్నాయి. ఏజెంటు అనుమతి పొందిన వారు లాటరీలపై నిషేధం ఉన్న రాష్ట్రాల్లో వ్యాపారం నిర్వహించేందుకు వీల్లేదు. పలువురికి ద్వితీయ బహుమతిగా రూ.5 లేదా రూ.10 లక్షలు, తృతీయ బహుమతిగా రూ. ఒకటి లేదా రూ.2 లక్షలు, నాలుగో బహుమతిగా రూ.5 వేలు, 5వ బహుమతి రూ.2 వేలు, ఆరో బహుమతిగా రూ.వెయ్యి, 7వ బహుమతి రూ.500, 8వ బహుమతి రూ.100లుగా ప్రకటిస్తారు. కేరళ లాటరీస్ వెబ్సైట్లో ఏ రోజు ఫలితాలు ఆ రోజు కనిపిస్తుంటాయి. బహుమతి పొందాలంటే దానికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. టిక్కెట్ రసీదు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు గజిటెడ్ అధికారి లేదా బ్యాంక్ అథారిటీ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు/రేషన్ కార్డు/ ఓటు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ పాన్ కార్డు వంటివి కూడా జత చేసి 30 రోజుల్లోగా పంపుకోవాల్సి ఉంటుంది. మొదటి, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులకు లాటరీ టిక్కెట్ మొత్తం మ్యాచ్ కావాలి. నాలుగో బహుమతి నుంచి మాత్రం చివరి నాలుగు అంకెలు మ్యాచ్ అయితే సరిపోతుంది. ఒంగోలులో ఇందుకు భిన్నం ఒంగోలులో జరుగుతున్న కేరళ లాటరీ వ్యవహారం భిన్నంగా సాగుతోంది. ఒక్కో టిక్కెట్ ఖరీదు రూ.60లు వసూలు చేస్తున్నారు. వారు ఎవరి నుంచి లైసెన్స్ పొందారన్న గుర్తింపు పత్రాలు బహిరంగా కనిపించవు. దానికితోడు గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారు. త్రోవగుంట వద్ద ఆటోనగర్‌లో అయితే మెకానిక్‌లు, డ్రైవర్లు, క్లీనర్ల పాలిట శాపంగా మారింది. రోజువారీ తాము సంపాదించిన మొత్తంతో ఏకంగా లక్షాధికారులు అవుతామనే ఆశతో అనేకమంది రూ.60ల చొప్పున అనేక నంబర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు. అద్దంకి బస్టాండ్, పాత కూరగాయల బస్టాండ్ సెంటర్, బండ్లమిట్ట, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్‌కు సమీపంలో ఇలా దాదాపు ఆరుగురు కేరళ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అంచనా. వీరు కేవలం ఒక పేపర్‌పై వ్యక్తి పేరు, వారు చెల్లించిన మొత్తం, వారు కోరుకుంటున్న లక్కీ మూడంకెల నంబర్లు నోట్ చేసుకుంటున్నారు. ఫలితాల విషయానికి వస్తే వారు పేర్కొన్న మూడంకెలు టిక్కెట్లోని నంబర్లో ఉంటే రూ. 25 వేలు, రెండు అంకెలు మాత్రమే ఉంటే రూ.వెయ్యిలు, ఒక అంకె మాత్రమే ఉంటే రూ.100లు ఇస్తున్నారు. ఇందులో పదిశాతం ఏజెంట్ కమిషన్‌గా తీసుకుంటున్నారు. మిగిలిన వాటిలో నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంటూ ఏజెంట్ కమిషన్‌కు సమానంగా తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇలా ముఠా కూలీలు, రోజువారీ వృత్తి పనులు చేసుకునేందుకు వస్తున్న వారు, మెట్టు పనులకు వెళ్లే వారు, తోపుడు బండ్ల వ్యాపారులు ఈ వలలో చిక్కుకుంటున్నారు. నిషేధం ఉన్నట్లా? లేనట్లా? గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారాన్ని ఛేదించి నిందితులపై చర్యలు తీసుకోవాలంటే పోలీసులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. లేకుంటే అక్రమార్కుల వద్ద ఎటువంటి ఆధారాలు కనిపించవు. చాటుమాటుగా సాగించే ఈ వ్యవహారం కొంతమంది పోలీసు అధికారులకు కూడా తెలుసని, వారు ఎందుకు స్పందించడంలేదో తెలియదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా రాష్ట్రంలో లాటరీ నిషేధ చట్టం ఉన్నప్పుడు కేరళ గుర్తింపు లాటరీ అయినా ఆన్లైన్ ద్వారా జిల్లాలో కొనసాగించేందుకు అవకాశం ఉండదని, అందువల్లే రహస్యంగా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని కొందరు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు సాగుతోంది కేరళ లాటరీనా లేక దానికి ప్రత్యామ్నాయంగా కేరళ లాటరీ పేరుతో స్థానికంగా లాటరీలో అనుభవం ఉన్న వారు నిర్వహిస్తున్నారా.. అనేది తేలాల్సి ఉంది. -
లాటరీ పేరుతో మోసం!
ఆదోని టౌన్: నిరుపేదల ఆశలను లక్ష్యంగా చేసుకొని కొందరు స్వార్థపరులు లాటరీల పేరుతో మోసం చేస్తున్నారు. లాటరీ, స్కీమ్‌లు నిర్వహించడం చట్ట విరుద్ధమైనా పోలీసుల అండతోనే అమాయకులను దోచుకుంటున్నారు. జిల్లాలో తరచూ స్కీమ్‌ల పేరుతో భారీగా వసూళ్లు చేసుకుని బోర్డు తిప్పేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నా ఆదోని పోలీసులు మాత్రం ఏమీ ఎరుగనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆదోని పట్టణంలోని ఓ ఎంటర్‌ప్రైజస్ యజమాని నిర్వహిస్తున్న లాటరీ స్కీం వివాదాస్పదమైంది. నాలుగు నెలల గడువుతో ఏర్పాటు చేసిన లాటరీ స్కీంలో మొత్తం వెయ్యి మంది సభ్యులను చేర్చుకున్నారు. సభ్యత్వ రుసుం కింద రూ.వంద చొప్పున వసూలు చేశారు. స్కీంలో చేరిన సభ్యులతో నాలుగు నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున రూ.40 లక్షలు కట్టించారు. ప్రతి నెలా లాటరీ డిప్ ద్వారా పది మంది విజేతలను ఎంపిక చేసి వారికి మాత్రమే బహుమతులు అందించారు. నాలుగు నెలల్లో 40 మంది విజేతలు బహుమతులు పొందారు. అయితే మిగిలిన వారికి కన్సొలేషన్ బహుమతులు అందించారు. అయితే అవి చాలా తక్కువ ధర ఉండటంతో పాటు నాణ్యత లేక పోవడంతో కూడా పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కీమ్ నిర్వాహకులు మాత్రం నాలుగు నెలల్లో రూ.20 లక్షల వరకు లబ్ధి పొందినట్లు అంచనా. ఈ విషయమై స్కీంకు ఏజెంటుగా వ్యవహరించిన కౌతాళానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల ఆదోని పట్టణంలోని 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. నిర్వాహకులకు పోలీసులు వంత పాడడంతో తానేమీ చేయలేక పోయానని స్కీంకు ఏజెంటుగా వ్యవహరించిన శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మా దృష్టికి రాలేదు ఆదోని పట్టణంలో ఎంటర్ప్రైజెస్ పేరుతో మోసం చేసినట్లుగా మా దృష్టికి రాలేదు. ఇప్పటి వరకు ఎవరూ మమ్మల్ని ఆశ్రయించలేదు. బాధితులు నష్టపోయినట్లు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వాసుకృష్ణ, సీఐ, ఆదోని -
ఆన్లైన్ లాటరీ పేరుతో బురిడీ
విజయవాడ: ఆన్లైన్ లాటరీ పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి డబ్బు దండుకునే ఇద్దరు నిందితులను కమిషనరేట్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో లా అండ్ ఆర్డర్ డీసీపీ గజరావు భూపాల్ వెల్లడించారు. ‘హలో, మాదొక ప్రముఖ కంపెనీ, లాటరీ తీశాం, అందులో మీరు అధిక మొత్తంలో నగదు గెలుచుకున్నారంటూ’ మెసేజ్ పంపి, ఆ డబ్బు మీకు రావాలంటే పూర్తి వివరాలు చెప్పి కొంత డబ్బును అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుందని మెయిల్ ఇస్తారు. దాన్ని నమ్మి బ్యాంకు ఖాతాలకు నగదు పంపిన వారి డబ్బులు గల్లంతు చేసే ఇద్దరిని ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. పై విధంగా నేరాలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బుధేరా గ్రామానికి చెందిన సోను కుమార్, యూపీకి చెందిన ఒసిక్క గ్రామస్తుడు సి.చమాల్ అలియాస్ అరుణ్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించటంతో వారు చేసిన సైబర్ నేరాలు వెల్లడించారు. మోసం ఎలా అంటే.. గత ఫ్రిబవరి 6వ తేదీ ఉయ్యూరు సర్కిల్ పరిధిలో తోట్లవల్లూరు పోలీస్టేషన్ ఏరియాలో ఓ మహిళకు రూ.5.35కోట్లు లక్కీడ్రా ఇచ్చినట్లుగా మోసపూరిత మెసేజ్ పెట్టారు. ఆమె వద్ద నుంచి మూడు దఫాలుగా రూ.1.61లక్షలు తమ అకౌంట్లో డిపాజిట్ చేయించుకుని మోసం చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోట్లవలూర్లు పోలీసులు కేసు నమోదు చేసి సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరిని పట్టుకుని విచారించారు. నిందితులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 345 మందితో కాంట్రాక్ట్ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు హైదరాబాద్‌లో ఇద్దరిని, వైజాగ్‌లో ఇద్దరిని లాటరీ పేరుతో మోసగించి రూ. 3లక్షలు అపహరించినట్లు చెప్పారు. తోట్లవల్లూరు పోలీసులు సూచనల మేరకు హైదరాబాద్, వైజాగ్‌లో డబ్బుపోగొట్టుకున్న బాధితులు ఆక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తోట్లవల్లూరు కేసుకు సంబంధించి రూ.1.60లక్షలు నగదు, 15 బ్యాంక్ అకౌంట్లు, 5మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది. నిందితులకు సంబంధించి 15 అనుమానాస్పద బ్యాంకు అకౌంట్లను గుర్తించి వాటిలో 8 అకౌంట్ల నుంచి రూ. 50వేల నగదును సీజ్ చేశారు. ఆయా అకౌంట్లలో రూ. 44లక్షల అనుమానాస్పద నగదు లావాదేవీలను గుర్తించారు. విలేకరుల సమావేశంలో ఉయ్యూరు సీఐ సత్యానందం పాల్గొన్నారు. -
గంటకు రూ.2 లక్షలు హుష్‌కాకి
⇔ మీకు రూ.3 కోట్ల యూరో లాటరీ తగిలింది. ప్రాసెసింగ్ ఫీజుల కింద తక్షణమే రూ. 5 లక్షలు ఈ ఖాతాలో జమచేయండి ⇔ హలో.. మీ డెబిట్ కార్డు సర్వీస్ బ్లాక్ అయ్యింది, పిన్, ఓటీపీ చెబితే వెంటనే పునరుద్ధరిస్తాం.. ⇔ హాయ్ డియర్, నేను అమెరికా నుంచి నీ కోసం రూ.50 లక్షల విలువైన వజ్రాలు, నగలను పంపించా. కస్టమ్స్ ఫీజుల కోసం రూ.12 లక్షలు పంపించవూ ప్లీజ్.. ఇలాంటి మాటలతో ఆన్లైన్ నేరగాళ్లు ప్రజలకు బురిడీ కొట్టిస్తున్నారు. రాష్ట్రంతో పాటు బెంగళూరులో ఒక్క ఏడాదిలోనే రూ. 9.16 కోట్లను దోచేశారు. సాక్షి, బెంగళూరు: దేశాన్ని డిజిటల్ చెల్లింపుల వైపునకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తుంటే మరోవైపు దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి గంటకు రూ. 2 లక్షలు బ్యాంకు ఖాతాల నుంచి పక్కదారి పడుతున్నట్లు తెలిసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులను ఉపయోగించుకుని నేరగాళ్లు సైబర్ దోపిడీకి పాల్పడుతున్నారు. గతేడాది ఇంటర్నెట్ బ్యాకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా రూ. 178 కోట్లను ఆన్లైన్ దొంగలు కొట్టేశారు. ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లు దోచుకున్నది ఇదే అతిపెద్ద మొత్తం. ఇలా రోజుకు సగటున రూ. 48 లక్షలను నొక్కేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2017, డిసెంబర్ 21 వరకు జరిగిన సైబర్ దోపిడీపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ బ్యాంకులు నివేదికలు అందజేశాయి. బెంగళూరులోనే అధికం భారతీయ రిజర్వ్ బ్యాంకు నివేదికల ప్రకారం, 2016–17 ఆర్థిక సంవత్సరంలో జరిగిన సైబర్ నేరాల్లో కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది. మొత్తం రూ. 9.16 కోట్ల విలువైన డబ్బు సైబర్దొంగల పాలైంది. దీనిపై 221 కేసులు నమోదయ్యాయి. కాగా, మహారాష్ట్ర రూ. 12.10 కోట్ల మోసంతో తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఒక్క నెలలోనే 250 కేసులు బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో నమోదయ్యాయి. బ్యాంకింగ్ లావాదేవీలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రజలు మోసపోతున్నారని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకింగ్ మోసాలు జరిగినట్లు అనుమానం వచ్చినా లేదా గుర్తించిన వెంటనే సంబంధిత బ్యాంక్ సహాయక కేంద్రానికి ఫోన్ చేసి బ్యాంక్ ఖాతాను తక్షణమే బ్లాక్ చేయించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల దర్యాప్తు వేగంగా జరిగే అవకాశముంది. అవగాహన లేకపోవడమే కారణం.. గతంలో బ్యాంకింగ్ మోసాలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ ప్రకటించినప్పటికీ ఏటికేడాది వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. సైబర్ మోసగాళ్లు హ్యాకింగ్‌లో ఆధునిక టెక్నాలజీతో పాటు జనం అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. ప్రజల్లో బ్యాంకింగ్ లావాదేవీలు, విధివిధానాలపై అవగాహన కల్పించాలని గత నెల చివరి వారం అన్ని రాష్ట్ర డీజీపీలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. యూజర్ ఐడీ, పాస్వర్డ్, డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్ నంబర్లు, ఓటీపీ నంబర్ తదితర వాటిని బహిర్గత పరచకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించింది. ఈ విషయంలో ఆర్థిక సంస్థలు, ఎన్జీవోలు, విద్యా సంస్థలు సహకరించి ప్రజలకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించాలని కోరింది. ఆన్లైన్ మోసాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. -
ఆశ చూపి..మోసగించి
సాక్షి, కామారెడ్డి : జిల్లాకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్ కేంద్రంగా లాటరీ దందా నడిచింది. దెగ్లూర్‌కు చెందిన లాటరీ నిర్వాహకులు కొందరు ఏజెంట్లను పెట్టుకుని వారి ద్వారా కామారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో లాటరీ టికెట్లను విక్రయించారు. రూ. 3 వేలు పెడితే ఏదో ఒక బహుమతి తప్పనిసరిగా వస్తుందని నమ్మించడంతో ఆశకుపోయి టికెట్లు కొనుగోలు చేశారు. మొత్తం 17,500 మంది నుంచి రూ. 3 వేల చొప్పున మొత్తం రూ. 5.25 కోట్లు వసూలు చేశారు. పథకం ప్రకారమే... దెగ్లూర్ ప్రాంతానికి చెందిన కొందరు లాటరీ నిర్వాహకులు ఓ ఎంటర్ప్రైజెస్ పేరుతో లాటరీ స్కీం నిర్వహిస్తున్నట్టు బ్రోచర్లు ముద్రించారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, బిచ్కుంద తదితర ప్రాంతాలకు చెందిన సాధారణ, మధ్యతరగతి ప్రజలను టార్గెట్‌గా చేసుకున్నారు. రూ. 3 వేలు చెల్లించి లాటరీ టికెట్టు కొంటే.. డ్రా తీసినపుడు తప్పనిసరిగా బహుమతి వస్తుందని నమ్మించారు. లాటరీలో ఇన్నోవా కారు, జేసీబీ, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు, బైకులు... ఇలా వందలాది వాహనాలతో పాటు గృహోపకరణాలను బ్రోచర్ల ద్వారా చూపించి బురిడీ కొట్టించారు. లాటరీ తగిలితే లాభపడొచ్చనే ఆశతో జిల్లాకు చెందిన దాదాపు 4 వేల మంది వరకు టికెట్లు కొనుగోలు చేశారు. వివాదాస్పదమైన డ్రా.... ఈ నెల 14న దెగ్లూర్లో లాటరీ డ్రాకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ డ్రాలో తమకు ఏదో ఒక బహుమతి వస్తుందన్న ఆశతో టికెట్టు కొన్నవారు అంతదూరం వెళ్లారు. డ్రా సమయానికి అక్కడి పోలీసులు రంగ ప్రవేశం చేసి లాటరీలు చట్టవిరుద్ధమని చెప్పి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరి వద్ద టికెట్లు కొన్నారు వారి వద్దనుంచి డబ్బులు వాపస్ తీసుకోండని ఉచిత సలహా ఇచ్చారు. చేసేదేమీ లేక బాధితులు వెనుదిరిగి వచ్చారు. తర్వాత నిర్వాహకులకు ఫోన్లు చేసి లాటరీ విషయమై నిలదీయగా.. ఈ నెల 20న డ్రా నిర్వహిస్తామని, మన జిల్లా సరిహద్దుల్లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినట్లు తెలిసింది. దీంతో డబ్బులు చెల్లించిన వారిలో మళ్లీ ఆశలు రేకెత్తాయి. ఆదివారం ఉదయం రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి చాలా మంది వెళ్లారు. అక్కడ కొన్ని డ్రాలు తీసిన నిర్వాహకులు అందరికీ ఫోన్ ద్వారా మెసేజ్ పంపుతామని చెప్పడంతో బాధితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో అక్కడి నుంచి నిర్వాహకులు పారిపోయారు. టికెట్లు కొన్నవారు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. కేసు నమోదు మద్నూర్(జుక్కల్): సలాబత్పూర్ శివారులోని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా లక్కీ డ్రా తీస్తున్న దెగ్లూర్‌కు చెందిన మారుతి అనే వ్యక్తిని సోమవారం పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్సై మహమ్మద్ సాజిద్ తెలిపారు. తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని వ్యవసాయ భూమిలో డ్రా నిర్వహించగా కొందరి పేరిట డ్రా తీసి మిగతా సభ్యులకు అన్యాయం చేశాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. లక్కీ డ్రా పేరిట ప్రచారం చేసే స్కీంలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. నిలదీస్తే పారిపోయిండ్రు బ్రోచర్లల్ల పెద్ద పెద్ద కార్లు, జేసీబీలు, వ్యా న్లు, బైకులు చూయించిండ్రు. నమ్మి టికెట్లు కొన్నం. నేను రూ. 6 వేలు కట్టి రెండు టికెట్లు కొన్న. మొన్న డ్రా ఉందంటే అంతదూరం పోయిన. అంతా మోసమే. మోసం చేశారని గుర్తించి నిలదీస్తే నిర్వాహకులు పారిపోయిండ్రు. మాకు న్యాయం చేయాలి. – రాజు, కామారెడ్డి మూడు టికెట్లు కొన్న... లాటరీలో ఏదో ఒక బహుమతి వస్తుందంటే నమ్మిన. రూ. 3 వేలకు ఒకటి చొప్పున రూ. 9 వేలు కట్టి మూడు టికెట్లు కొన్న. పండుగ పూట లాటరీలో ఏదన్న ఒకటి తగులుతదని ఎంతో ఆశపడ్డ. డ్రా అంతా మోసం. మెసేజే వస్తదని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఎలాంటి మెసేజ్ రాలేదు. లాటరీ పేరుతో మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – కుమార్, కామారెడ్డి -
లక్కీ లాటరీ పేర రూ.5 లక్షలకు టోకరా
వేములవాడ: లక్కీ లాటరీ తగిలిందంటూ వచ్చిన ఫోన్ కాల్‌కు మోసపోయాడో వ్యక్తి. ఆ అగంతకులు చెప్పిన ప్రకారం కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసి మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లక్నో నుంచి లక్కీ లాటరీ తగిలిందంటూ మారుపాకకు చెందిన అంజయ్యకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది నిజమేనని నమ్మిన ఆయన ఫోన్ చేసిన వ్యక్తులు తెలిపినట్లు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని ఓ బ్యాంకు అకౌంట్లో రూ.5 లక్షలను జమ చేశాడు. ఎంతకీ లాటరీ డబ్బు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న అంజయ్య శనివారం వేములవాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
లాటరీ పేరిట రూ. 4,193 కోట్ల మోసం
న్యూడిల్లీ: అమాయక ప్రజల అత్యాశను ఆసరా చేసుకొని లాటరీల పేరిట కోట్ల రూపాయలు దండుకొంటున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 4,193 కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాయని, దీని వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ హస్తం ఉందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇటీవల కేంద్ర హోం శాఖకు సమర్పించిన ఓ నివేదికలో వెల్లడించింది. అయితే అధికారికంగా భారత ప్రభుత్వంగానీ, ఐబీగానీ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. లాటరీల కుంభకోణాలకు సంబంధించి 4,193 కోట్ల రూపాయల సొమ్ము ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లోని భారతీయ స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, భారతీయ యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా మొత్తం 1,162 బ్యాంక్‌ల బ్రాంచిల ద్వారా విత్ డ్రా చేసి పాకిస్థాన్ తరలించారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన హవాల నెట్వర్క్ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ గుండా ఈ సొమ్మును పాకిస్థాన్ చేర్చింది. కరాచీ నుంచి హవాలా లావాదేవీలు నిర్వహించే దావూద్‌కు బారత్‌లో కూడా బలమైన నెట్వర్క్ ఉన్న విషయం తెల్సిందే. ఆర్థిక ఇంటెలీజెన్స్ వర్గాల ద్వారా అనుమానిత బ్యాంక్ ఖాతాలను గుర్తించి, వాటి నుంచి నగదు విత్‌డ్రాలను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఐబీ కోరింది. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్‌ను కూడా ఐబీ అప్రమత్తం చేసింది. పాకిస్థాన్ నుంచి 1175 ఫోన్ నెంబర్ల ద్వారా లాటరీల పేరిట మోసం చేసినట్టు తాము గుర్తించామని, ఆ ఫోన్లకు 305 నెంబర్ల ద్వారా భారత ఏజెంట్లు అక్రమదారులకు సహకరించినట్టు గుర్తించామని ఐబీ వర్గాలు తెలిపాయి. ఆ ఫోన్ నెంబర్ వివరాల ద్వారా కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళుతున్నట్టు హోం శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయి. ‘మీ ఫోన్ నెంబర్‌కు బంపర్ బహుమతి తగిలింది. వాటిని పంపించేందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద ఇంత మొత్తాన్ని ఫలానా బ్యాంకులోని ఫలానా ఖాతాలో జమచేయండి’ అంటూ భారతీయ ఏజెంట్లు అమాయక ప్రజలను బుట్టలో వేస్తారు. ఆఫర్‌చేసే లాటరీ బంపర్ బహుమతి మొత్తాన్నిబట్టి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు గుంజుతారు. బ్యాంకు ఖాతా నెంబర్ల ద్వారానే లావాదేవీలు జరుగుతున్నందున మోసం జరిగే అవకాశం ఉండదని ప్రజలు భ్రమపడతారు. అప్పటికీ అనుమానపడే వారిని ఏజెంట్లు కొంత డబ్బును కూడా పంపించి నిజంగా లాటరీ తగిలినట్టు నమ్మిస్తారు. వారు ప్రాసెసింగ్ ఫీజు కింద అడిగిన మొత్తాన్ని జమ చేసిన మరుక్షణంలోనే విత్ డ్రా చేస్తారు. ఈ విషయంలో భారతీయ ఏజెంట్లకు కూడా బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.