లాటరీ పేరుతో లూఠీ! | Kerala Lottery Cheated Common People In Prakasam | Sakshi
Sakshi News home page

లాటరీ పేరుతో లూఠీ!

Published Fri, Jun 8 2018 11:15 AM | Last Updated on Fri, Jun 8 2018 11:29 AM

Kerala Lottery Cheated Common People In Prakasam - Sakshi

ఒంగోలు: కేరళ లాటరీతో బడుగులు నష్టపోతున్నారు. అది శ్రమజీవుల పాలిట శాపంగా మారింది. వాట్స్‌ యాప్‌ల్లో సైతం లాటరీకి సంబంధించి దుష్ప్రచారం జరుగుతుండటంతో అమాయకులు అక్రమార్కుల వలలో పడుతున్నారు. ఒక్క రోజులో దశ తిరిగింది.. ఈ రోజు లాటరీలో మీకు ఈ లక్కీ నంబర్‌లు అదృష్టం కలిగించనున్నాయంటూ ఊదరగొడుతుండంతో సామాన్యులు లాటరీ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యవహారం పోలీసు వర్గాల దృష్టికి చేరినా స్పందన లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

కేరళ లాటరీ విధానం ఇలా..
కేరళ ప్రభుత్వం అధికారికంగా లాటరీ నిర్వహిస్తోంది. దానికి రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిల్లో సైతం అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఏజెంట్‌ వ్యాపారం చేసుకోవాలంటే తప్పక లైసెన్స్‌ తీసుకోవాలి. లక్ష రూపాయల లోపు జిల్లాస్థాయి అధికారి, రూ.20 లక్షల వరకు అయితే డిప్యూటీ డైరెక్టర్, 20 లక్షలకు మించితే డైరెక్టర్‌ ఆఫ్‌ లాటరీస్‌ నుంచి ఏజెంటు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బంకు, సొంత షాపు, వెహికల్‌ మీద తరుగుతూ ఆన్‌లైన్‌ లేదా కాలినడకన విక్రయించదలుచుకున్నారా అనేది కూడా ఏజెన్సీ తీసుకునే సమయంలో స్పష్టం చేయాల్సి ఉంటుంది. వారంలో ఏడు రోజులకు ఏడు రకాల లాటరీలు అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. సోమవారం విన్‌–విన్, మంగళవారం స్త్రీశక్తి, బుధవారం అక్షయ, గురువారం కారుణ్య ప్లస్, శుక్రవారం నిర్మల్‌ వీక్లీ, శనివారం కారుణ్య, ఆదివారం పౌర్ణమి అనే లాటరీలు కేరళ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించే లాటరీ గరిష్ట బహుమతి రూ.60 లక్షలుకాగా, శని, ఆదివారాలు నిర్వహించే లాటరీ గరిష్ట బహుమతి రూ.80 లక్షలు. మిగిలిన రోజుల్లో లాటరీ గరిష్ట బహుమతి రూ.50 లక్షలుగా ఉంది.

ఈ టిక్కెట్లకు సంబంధించి ధరలు రూ.30లు, రూ.40లు, రూ.50లుగా ఉన్నాయి. ఏజెంటు అనుమతి పొందిన వారు లాటరీలపై నిషేధం ఉన్న రాష్ట్రాల్లో వ్యాపారం నిర్వహించేందుకు వీల్లేదు. పలువురికి ద్వితీయ బహుమతిగా రూ.5 లేదా రూ.10 లక్షలు, తృతీయ బహుమతిగా రూ. ఒకటి లేదా రూ.2 లక్షలు, నాలుగో బహుమతిగా రూ.5 వేలు, 5వ బహుమతి రూ.2 వేలు, ఆరో బహుమతిగా రూ.వెయ్యి, 7వ బహుమతి రూ.500, 8వ బహుమతి రూ.100లుగా ప్రకటిస్తారు. కేరళ లాటరీస్‌ వెబ్‌సైట్‌లో ఏ రోజు ఫలితాలు ఆ రోజు కనిపిస్తుంటాయి. బహుమతి పొందాలంటే దానికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. టిక్కెట్‌ రసీదు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు గజిటెడ్‌ అధికారి లేదా బ్యాంక్‌ అథారిటీ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు/రేషన్‌ కార్డు/ ఓటు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్‌ లైసెన్స్‌/ పాన్‌ కార్డు వంటివి కూడా జత చేసి 30 రోజుల్లోగా పంపుకోవాల్సి ఉంటుంది. మొదటి, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్‌ బహుమతులకు లాటరీ టిక్కెట్‌ మొత్తం మ్యాచ్‌ కావాలి. నాలుగో బహుమతి నుంచి మాత్రం చివరి నాలుగు అంకెలు మ్యాచ్‌ అయితే సరిపోతుంది.

ఒంగోలులో ఇందుకు భిన్నం
ఒంగోలులో జరుగుతున్న కేరళ లాటరీ వ్యవహారం భిన్నంగా సాగుతోంది. ఒక్కో టిక్కెట్‌ ఖరీదు రూ.60లు వసూలు చేస్తున్నారు. వారు ఎవరి నుంచి లైసెన్స్‌ పొందారన్న గుర్తింపు పత్రాలు బహిరంగా కనిపించవు. దానికితోడు గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారు. త్రోవగుంట వద్ద ఆటోనగర్‌లో అయితే మెకానిక్‌లు, డ్రైవర్లు, క్లీనర్ల పాలిట శాపంగా మారింది. రోజువారీ తాము సంపాదించిన మొత్తంతో ఏకంగా లక్షాధికారులు అవుతామనే ఆశతో అనేకమంది రూ.60ల చొప్పున అనేక నంబర్లను రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. అద్దంకి బస్టాండ్, పాత కూరగాయల బస్టాండ్‌ సెంటర్, బండ్లమిట్ట, బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌కు సమీపంలో ఇలా దాదాపు ఆరుగురు కేరళ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అంచనా. వీరు కేవలం ఒక పేపర్‌పై వ్యక్తి పేరు, వారు చెల్లించిన మొత్తం, వారు కోరుకుంటున్న లక్కీ మూడంకెల నంబర్లు నోట్‌ చేసుకుంటున్నారు. ఫలితాల విషయానికి వస్తే వారు పేర్కొన్న మూడంకెలు టిక్కెట్‌లోని నంబర్‌లో ఉంటే రూ. 25 వేలు, రెండు అంకెలు మాత్రమే ఉంటే రూ.వెయ్యిలు, ఒక అంకె మాత్రమే ఉంటే రూ.100లు ఇస్తున్నారు. ఇందులో పదిశాతం ఏజెంట్‌ కమిషన్‌గా తీసుకుంటున్నారు. మిగిలిన వాటిలో నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంటూ ఏజెంట్‌ కమిషన్‌కు సమానంగా తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇలా ముఠా కూలీలు, రోజువారీ వృత్తి పనులు చేసుకునేందుకు వస్తున్న వారు, మెట్టు పనులకు వెళ్లే వారు, తోపుడు బండ్ల వ్యాపారులు ఈ వలలో చిక్కుకుంటున్నారు.

నిషేధం ఉన్నట్లా? లేనట్లా?
గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారాన్ని ఛేదించి నిందితులపై చర్యలు తీసుకోవాలంటే పోలీసులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. లేకుంటే అక్రమార్కుల వద్ద ఎటువంటి ఆధారాలు కనిపించవు. చాటుమాటుగా సాగించే ఈ వ్యవహారం కొంతమంది పోలీసు అధికారులకు కూడా తెలుసని, వారు ఎందుకు స్పందించడంలేదో తెలియదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా రాష్ట్రంలో లాటరీ నిషేధ చట్టం ఉన్నప్పుడు కేరళ గుర్తింపు లాటరీ అయినా ఆన్‌లైన్‌ ద్వారా జిల్లాలో కొనసాగించేందుకు అవకాశం ఉండదని, అందువల్లే రహస్యంగా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని కొందరు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు సాగుతోంది కేరళ లాటరీనా లేక దానికి ప్రత్యామ్నాయంగా కేరళ లాటరీ పేరుతో స్థానికంగా లాటరీలో అనుభవం ఉన్న వారు నిర్వహిస్తున్నారా.. అనేది తేలాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement