లాటరీ పేరిట రూ. 4,193 కోట్ల మోసం
న్యూడిల్లీ: అమాయక ప్రజల అత్యాశను ఆసరా చేసుకొని లాటరీల పేరిట కోట్ల రూపాయలు దండుకొంటున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 4,193 కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాయని, దీని వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్ హస్తం ఉందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇటీవల కేంద్ర హోం శాఖకు సమర్పించిన ఓ నివేదికలో వెల్లడించింది. అయితే అధికారికంగా భారత ప్రభుత్వంగానీ, ఐబీగానీ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. లాటరీల కుంభకోణాలకు సంబంధించి 4,193 కోట్ల రూపాయల సొమ్ము ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లోని భారతీయ స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, భారతీయ యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా మొత్తం 1,162 బ్యాంక్‌ల బ్రాంచిల ద్వారా విత్ డ్రా చేసి పాకిస్థాన్ తరలించారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన హవాల నెట్‌వర్క్ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ గుండా ఈ సొమ్మును పాకిస్థాన్ చేర్చింది. కరాచీ నుంచి హవాలా లావాదేవీలు నిర్వహించే దావూద్‌కు బారత్‌లో కూడా బలమైన నెట్‌వర్క్ ఉన్న విషయం తెల్సిందే. ఆర్థిక ఇంటెలీజెన్స్ వర్గాల ద్వారా అనుమానిత బ్యాంక్ ఖాతాలను గుర్తించి, వాటి నుంచి నగదు విత్‌డ్రాలను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఐబీ కోరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను కూడా ఐబీ అప్రమత్తం చేసింది.
పాకిస్థాన్ నుంచి 1175 ఫోన్ నెంబర్ల ద్వారా లాటరీల పేరిట మోసం చేసినట్టు తాము గుర్తించామని, ఆ ఫోన్లకు 305 నెంబర్ల ద్వారా భారత ఏజెంట్లు అక్రమదారులకు సహకరించినట్టు గుర్తించామని ఐబీ వర్గాలు తెలిపాయి. ఆ ఫోన్ నెంబర్ వివరాల ద్వారా కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళుతున్నట్టు హోం శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయి. ‘మీ ఫోన్ నెంబర్‌కు బంపర్ బహుమతి తగిలింది. వాటిని పంపించేందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద ఇంత మొత్తాన్ని ఫలానా బ్యాంకులోని ఫలానా ఖాతాలో జమచేయండి’ అంటూ భారతీయ ఏజెంట్లు అమాయక ప్రజలను బుట్టలో వేస్తారు. ఆఫర్‌చేసే లాటరీ బంపర్ బహుమతి మొత్తాన్నిబట్టి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు గుంజుతారు. బ్యాంకు ఖాతా నెంబర్ల ద్వారానే లావాదేవీలు జరుగుతున్నందున మోసం జరిగే అవకాశం ఉండదని ప్రజలు భ్రమపడతారు. అప్పటికీ అనుమానపడే వారిని ఏజెంట్లు కొంత డబ్బును కూడా పంపించి నిజంగా లాటరీ తగిలినట్టు నమ్మిస్తారు. వారు ప్రాసెసింగ్ ఫీజు కింద అడిగిన మొత్తాన్ని జమ చేసిన మరుక్షణంలోనే విత్ డ్రా చేస్తారు. ఈ విషయంలో భారతీయ ఏజెంట్లకు కూడా బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.