సమగ్ర విద్యపై యునెస్కోలో ప్రత్యేక సదస్సు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేయడాన్ని అంతర్జాతీయ వేదికపై విద్యావేత్తలు ప్రశంసించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మూడు రోజుల ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు శుక్రవారం ముగిసింది. చివరిరోజు అసమానతలు లేని సమాజం కోసం సమగ్ర సమీకృత విద్యా బోధన ప్రతి ఒక్కరికీ అందించాలన్న అంశంపై చర్చ జరిగినట్టు యూఎన్‌వో స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 38 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు అంతర్జాతీయ వేదికపై చెప్పామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మారిన పరిస్థితులు, విద్యార్థి–ఉపాధ్యాయుల మధ్య బలపడిన సత్సంబంధాలపై ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కెపాసిటీ బిల్డింగ్, అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సహకరిస్తామని యునెస్కో ఇన్‌క్లూజన్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ హెడ్ తమరా మార్టి కసాడో హామీ ఇచ్చినట్టు షకిన్ పేర్కొన్నారు.
ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషనల్ అవార్డు గ్రహీత డోనా రైట్ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను ప్రశంసించారన్నారు. ప్రాథమిక విద్యపై ఎన్నో పరిశోధనలు చేసిన రైట్... ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం గొప్పదని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని ఐబీ సంస్థ ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ మేనేజర్ డాక్టర్ కళా పరశురామ్ “పాఠశాలల్లో స్థిరమైన సమ్మిళిత పద్ధతులు’పై పాన్ ఆసియా కమిటీ చర్చలో పాల్గొన్నారు.
ఆమె మాట్లాడుతూ.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు సంబంధించిన అవసరాలు, విశ్లేషణలో భాగంగా తాము ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించామని, ప్రభుత్వం గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment