మనబడి ‘ఐబీ’కి అనుకూలం | AP Govt Arrangements for teaching IB from First Class in June 2025 | Sakshi
Sakshi News home page

మనబడి ‘ఐబీ’కి అనుకూలం

Published Mon, Mar 11 2024 5:31 AM | Last Updated on Mon, Mar 11 2024 6:59 PM

AP Govt Arrangements for teaching IB from First Class in June 2025 - Sakshi

అంతర్జాతీయ ప్రతినిధుల కితాబు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల పరిశీలన.. సదుపాయాలపై సంతృప్తి

ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ బోధనకు అనువుగా ఉన్నట్లు ప్రకటన

బహుభాషా బోధన, టీచర్‌–విద్యార్థి మధ్య అనుబంధంపై ప్రశంస 

2025 జూన్‌లో ఒకటో తరగతి నుంచి ఐబీ బోధనకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా­లల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన, బహు భాషలు మాట్లాడే విద్యార్థులు, చదువులో తమ అనుమా­నా­లు నివృత్తి చేసుకునేందుకు తొట్రుపాటు లేకుండా ఆ­త్మవిశ్వాసంతో ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు.. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడేతత్వం, పిల్లల్లో సహకార గుణం, క్లాస్‌రూమ్‌లో విద్యా­ర్థులు –టీచర్ల మధ్యనున్న అన్యోన్యత తదితర అంశాలు అంతర్జాతీయ విద్యావేత్తలను ఆశ్చర్యపరిచాయి.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్‌ మొ­దలు ఐబీ సిలబస్‌ను ఒకటో తరగతి నుంచి ప్రభు­త్వం అమలుచేయనున్న నేపథ్యంలో.. ఇంటర్నే­షనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) ప్రతినిధులు ఫిబ్రవరి 26 నుంచి ఈనెల ఏడో తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటికే రాష్ట్రంలో అమలుచేస్తున్న ఏపీ విద్యా సంస్కరణలు, విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం వారిని ఆశ్చర్యపరిచాయి.

తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పాఠశాల పరిశు­భ్రతపై కేంద్రీకృత పరిశీలన, పాఠశాలల పనితీరు.. సమీక్షలో రోజువారి యాప్స్‌ వినియోగం, కేంద్రీకృత మానిటరింగ్‌ సిస్టం, టోఫెల్‌ శిక్షణ, కంటెంట్‌ అనుసంధానం, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్, గ్రంథాలయాల వినియోగం, మెరుగైన అసెస్‌మెంట్, యూనిఫారం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, పోషకాలతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణపై ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అభినందించారు. 

విద్యార్థుల్లో నేర్చుకునే తత్వంపై అభినందన..
ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ సిలబస్‌ అమలుచేసే స్కూళ్లల్లో విద్యార్థుల వ్యక్తిగత ప్రొఫైల్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారు. బహు భాషలు, విద్యేతర అంశాలపై దృష్టిపెడతారు. వివిధ రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఒకేచోట కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకునే గుణం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. ఇలాంటి వాతావరణాన్ని ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో గుర్తించినట్లు వారు తెలిపారు.

తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియాతో పాటు సవర, కొండ, కోయ, సుగాలి, ఆదివాసి, కువి వంటి గిరిజన భాషలు మాట్లాడే పిల్లలు కలిసి ఉన్నప్పుడు వారివారి భాషలను గౌరవించుకోవడం, ఇతర భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడాన్ని ఐబీ ప్రతినిధులు గమనించి అభినందించారు.

తరగతి గదులలో బహుభాషావాదం, ఉపాధ్యాయ–విద్యార్థి సంబంధం, విద్యార్థుల మధ్య ఆత్మవిశ్వాసం, పాఠశాల విద్యా వ్యవస్థపై సమాచారాన్ని పంచుకోవడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులు ఆసక్తి చూపిన తీరు ఐబీ విద్యా విధానానికి దగ్గరగా ఉన్నట్లు ఆ ప్రతినిధులు తెలిపారు. ఇక ఐబీ అమలు విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయని, ఉపాధ్యాయులకూ తగిన అర్హతలు ఉన్నాయన్నారు.

ఇక్కడి విద్యార్థులు ప్రపంచ పోకడలను అర్థంచేసుకునేందుకు, అవకాశాలను అందుకునేందుకు ఐబీ పాఠ్యాంశాలను సులభంగా అనుసరించగలరన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేశారు. మరోవైపు.. ఐబీ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి అందజేయనుంది. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బంది శిక్షణనివ్వాలని అధికారులు నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement