రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు.
ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్‌మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి
తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ
ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్‌గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు.
విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్‌లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.
వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి..
ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్‌లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్‌లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది.
రూ.73 వేల కోట్లతో సంస్కరణలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది.
అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే..
ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్‌ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్‌ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్‌లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్‌లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్‌వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment