సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 40 లక్షల మంది పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి డిజిటల్ బోధనను ప్రవేశపెట్టింది.
ఇప్పటికే నాడు–నేడు: మనబడి కింద పాఠశాల భవనాలు, తరగతి గదులు, డబుల్ డెస్క్ బెంచీలు, విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలతో పాటు బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. నాడు–నేడు పనులు పూర్తయిన 15,713 పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ప్లస్ 2 వరకు బోధించే 6,731 స్కూళ్లలో అత్యాధునిక టెక్నాలజీ గల 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది.
ఇలాంటి ప్యానెళ్లు దేశవ్యాప్తంగా సుమారు 25 వేలు మాత్రమే ఉండగా.. మనరాష్ట్రంలో 30 వేలకు పైగా అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంపై 1,34,281 మంది ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమైన డిజిటల్ శిక్షణ ఇప్పటికే లక్ష మందికిపైగా పూర్తయింది. మిగిలిన వారికి ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది.
11,455 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ
రెండో దశ నాడు–నేడు పనులు 22 వేల పాఠశాలల్లో జరుగుతున్నాయి. వీటిలో దాదాపు పనులు పూర్తయినవి మొత్తం 11,455 పాఠశాలలు ఉన్నాయి. వీటి నుంచి 1,34,281 మంది ఉపాధ్యాయులను శిక్షణకు ఎంపిక చేశారు. వీరికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగంపై ఇంజనీరింగ్ కాలేజీల్లో నిపుణులతో తర్ఫీదునిస్తున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో 144 ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా చేసి శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతంలో శిక్షణ పొందిన దాదాపు 600 మంది మాస్టర్ ట్రైనర్లతో రెండు లేదా మూడు మండలాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రెండు రోజుల చొప్పున శిక్షణ అందిస్తున్నారు.
కాగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గణితం, భౌతిక, జీవ, రసాయన శాస్త్రాలతో పాటు ఇంగ్లిష్ బోధించే 35 వేల మంది సబ్జెక్టు ఉపాధ్యాయులకు అక్టోబర్ నుంచి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నారు.
నిధులు చెల్లించిన ప్రభుత్వం
ఉపాధ్యాయుల శిక్షణకు, ప్యానెళ్లు బిగించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం గత నెలలోనే విడుదల చేసింది. 1,34,281 మంది టీచర్లకు రూ.5,79,12,000.. ఐఎఫ్‌పీ స్క్రీన్లు తరలింపు, శిక్షణ కేంద్రాల్లో బిగించేందుకు రూ.7.20 లక్షల నిధులను ప్రభుత్వం గత నెలలోనే చెల్లించింది. దీంతో పాటు ఐఎఫ్‌పీ స్క్రీన్లు మంజూరైన పాఠశాలల్లో వాటిని బిగించేందుకు, వైరింగ్, రంగులు వేసేందుకు కూడా నిధులను ఇచ్చింది.
పద్యాలను బాగా నేర్పించొచ్చు
గతంలో విద్యార్థులకు తెలుగు పద్యాలను నేర్పించేందుకు ఫోన్ ను ఉపయోగించేవాళ్లం. అయితే ఇలా ఎక్కువమంది పిల్లలకు చేరేది కాదు. ఇప్పుడు ఐఎఫ్‌పీల ద్వారా తెరపై అందరికీ వినిపించేలా చెప్పొచ్చు. చెప్పిన ప్రతి అంశాన్ని మరోసారి పునశ్చరణ చేసేందుకు వీలుంది. ఇంత మంచి శిక్షణ ప్రతి టీచర్‌కు అవసరం.
– పి.రాణి, తెలుగు టీచర్, కొండపల్లి బాలికల హైసూ్కల్, ఎన్టీఆర్ జిల్లా
శిక్షణ గొప్ప అవకాశం
ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మారకుంటే వెనుకబడిపోతాం, బోధనలో కూడా అంతే. ఉపాధ్యాయుడిగా నాకు 27 ఏళ్ల అనుభవం ఉంది. ఇన్నేళ్ల బోధన ఒక ఎత్తయితే.. డిజిటల్ బోధన మరో ఎత్తు. బ్లాక్ బోర్డుపై చెప్పే దానికన్నా ఐఎఫ్‌పీలపై 3డీలో విద్యార్థికి మరింత సమర్థవంతంగా చదువు చెప్పొచ్చు. బోధనా సామర్థ్యాలు పెంచుకోవడానికి ఇదో గొప్ప అవకాశం. – కె.హరిశరణ్, జెడ్పీ స్కూల్ హెచ్‌ఎం, సూరంపల్లి, కృష్ణా జిల్లా
ప్రభుత్వ బడిలో ఇదో విప్లవం
వేగంగా మారుతున్న ప్రపంచంలో కార్పొరేట్ స్కూళ్లు కూడా అందుకోలేని డిజిటల్ బోధనను ప్రభుత్వ స్కూళ్లల్లో అందుబాటులోకి తేవడం ఓ ఎత్తయితే.. ఉపాధ్యాయులకు వేగంగా శిక్షణనివ్వడం మరో ఎత్తు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులు కొత్త టెక్నాలజీని నేర్చుకునేందుకు నూరుశాతం ఆసక్తి చూపించారు. పిల్లలకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ఇదో గొప్ప అవకాశం. ప్యానెళ్లను ఎలా వినియోగించాలి?, నోట్స్ సేవింగ్, 3డీ పాఠాలు ఎలా చెప్పాలి? వంటి సాంకేతిక అంశాలపై శిక్షణనిచ్చాం. – డాక్టర్ కె.శ్రీనివాసరావు (మాస్టర్ ట్రైనర్), బి.శ్రీనివాస్ (పెదపారుపూడి ఎంఈవో)
బోధనా సమయం ఆదా
బయాలజీ టీచర్‌గా బ్లాక్ బోర్డుపై విద్యార్థికి పాఠాలు అర్థమయ్యేలా చెప్పడం ఒక సవాల్. ఇప్పుడు ఐఎఫ్‌పీలపై తక్కువ సమయంలోనే ఎక్కువ ఉదాహరణలతో అర్థమయ్యేలా బోధించవచ్చు. స్క్రీన్‌పై 3డీ చిత్రాలతో ప్రతి అంశాన్ని విశదీకరించి చెప్పొచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా స్క్రీన్‌పైనే నోట్స్ రాసి సేవ్ చేయడంతో పాటు ఎక్కువ అంశాలను నేర్పించవచ్చు. – వి.అరుణశ్రీ, బయాలజీ టీచర్, పెనమలూరు జెడ్పీ స్కూల్, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment