ఎంటర్‌ప్రైజెస్ ముద్రించిన బ్రోచర్
ఆకర్షణీయమైన బ్రోచర్లు.. వాటిపై బంపర్ డ్రాలు, బహుమతులంటూ రాతలు.. ప్రతినెల కొద్దిమొత్తంలో చెల్లిస్తే చాలు ఖచ్చితమైన బహుమతి అంటూ ఎర.. ఆపై బంపర్‌డ్రాలో కార్లు, బైక్‌లు గెలుచుకునే అవకాశం మీదేనంటూ మాయమాటలు చెప్పే ఏజెంట్లు.. నేతల అండదందలు.. పట్టించుకోని అధికారులు.. వెరసి ఎంటర్‘ప్రైజెస్’ పేరుతో చట్టవ్యతిరేక దందా యథేచ్ఛగా సాగుతోంది. వారి వలలో చిక్కి అమాయకులు
మోసపోతూనే ఉన్నారు.
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో నిషేధిత ఎంటర్‌ప్రైజెస్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అమాయ కులకు గాలం వేస్తూ ముంచేస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ శాఖ చూసీచూడనట్లుగా వదిలేస్తుండడంతో వారి మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రభుత్వం ఏనాడో ఇలాంటి స్కీమ్‌లను నిషేధించింది. అయితే రాజకీయ అండదండలతో కొంత మంది ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కామారెడ్డిలో ఇది బహిరంగ రహస్యమే..
జోరుగా లాటరీ స్కీంలు
మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు.. ఎంటర్‌ప్రైజెస్‌లవైపు కన్నెత్తి చూడకపోవడంతో నిషేధించబడిన లాటరీలు, స్కీంలు జిల్లా కేం ద్రంలో విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఇటీవల కామారెడ్డిలోని ప్రముఖ వ్యాపారులు కొందరు సిండికేట్‌గా ఏర్పడి ఓ భారీ లాటరీ స్కీంను తెరపైకి తీసుకువచ్చారు. దీని ప్రకారం నెలకు రూ. 1000 చొప్పున 15 నెలల పాటు చెల్లిస్తే.. సభ్యుడు చెల్లించిన మొత్తానికి సరిపడా ఖచ్చితమైన బహుమతి ఉంటుంది. అంతేకాకుండా ప్రతినెల బంపర్ డ్రా పేరుతో స్కీంలో కార్లు, బైక్‌లు, బంగారం కాయిన్‌లు సొంతం చేసుకోవచ్చని సభ్యులను చేర్చుకున్నారు. ఓ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో మూడు నెలల క్రితం ఈ స్కీం ప్రారంభమైంది.
ప్రతినెల రెండో లేదా మూడో గురువారం సిరిసిల్లారోడ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో డ్రా నిర్వహిస్తున్నారు. స్కీంలో మొత్తం 3 వేల మంది సభ్యులను చేర్చుకున్నారు. మొత్తం స్కీం పూర్తయ్యే సరికి రూ. 4.50 కోట్లు వసూలు చేయాలన్నది నిర్వాహకుల లక్ష్యమని తెలుస్తోంది.. దీంట్లో 2.50 కోట్ల వరకు దండుకునే విధంగా స్కీంను రూపొందించారని సమాచారం. ప్రజలను నిలువునా దోపిడీకి గురిచేసే ఇలాంటి లాటరీ స్కీమ్‌ను జిల్లా కేంద్రం నడిబొడ్డున నిర్వహిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది సైతం కామారెడ్డి పాతబస్టాండ్ ప్రాంతంలోని ఓ భవనంలో కార్యాలయాన్ని తెరిచి ఇలాంటి స్కీమ్‌లు నడిపించారు. ప్రస్తుతం మరో ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులు కూడా తాజాగా లాటరీ స్కీమ్‌ను ప్రారంభించినట్లు తెలిసింది.
పట్టించుకోని అధికారులు
లాటరీ పద్ధతిన నిర్వహించే స్కీంలను ప్రభుత్వం ఏనాడో నిషేధించింది. ఇటీవలే నిజామాబాద్‌లో ఇలాంటి స్కీం నిర్వహిస్తున్న ఓ భవనంపై పోలీసులు, అధికారులు దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో నిర్వహిస్తున్న స్కీమ్‌లను మాత్రం పట్టించుకునే వారు కరువయ్యారు. నిర్వాహకులు ఎవరో, స్కీం వివరాలు ఏమిటో అన్నీ తెలిసినా పోలీసులు కానీ, సంబంధిత అధికారులు కానీ అటువైపు వెళ్లడం లేదు. రాజకీయ అండదండలు ఉన్న కొందరు నిర్వాహకులు ఇప్పటికే పోలీసుశాఖలోని కొందరికి, స్థానిక నేతలకు ముడుపులు ఇచ్చి, తమ దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వారి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్కీమ్‌ల పేరుతో ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్న ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకుల ఆట కట్టించాలని జనం కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment