enterprise
-
ప్రాక్సిమస్ గ్రూప్ గూటికి రూట్ మొబైల్
న్యూఢిల్లీ: ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ సేవల సంస్థ రూట్ మొబైల్లో బెల్జియంకు చెందిన ప్రాక్సిమస్ గ్రూప్ 84 శాతం వరకు వాటాలను దక్కించుకోనుంది. ఇందులో భాగంగా ముందు దాదాపు 58 శాతం వాటాలను రూ. 5,922 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌తో నిబంధనల ప్రకారం.. 26 శాతం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి రానుండటంతో, ఆ మేరకు షేర్లన్నింటినీ కొనుగోలు చేస్తే మొత్తం 84 శాతం వరకూ వాటాలను పెంచుకునే అవకాశం ఉంది. అయితే, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలనే నిబంధన మేరకు 12 నెలల్లోగా కొన్ని షేర్లను విక్రయించి తన వాటాను 75%కి తగ్గించుకోవాల్సి రానుంది. షేరు ఒక్కింటికి రూ. 1,626.40 చొప్పున అనుబంధ సంస్థ ప్రాక్సిమస్ ఓపల్ ద్వారా ప్రాక్సిమస్ గ్రూప్ తమ సంస్థలో 57.56% వాటాలను కొనుగోలు చేయనున్నట్లు రూట్ మొబైల్ తెలిపింది. లావాదేవీ పూర్తయ్యాక రూట్ మొబైల్ సీఈవో రాజ్‌దీప్ గుప్తా తన ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతూనే.. గ్రూప్ సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారు. రూట్ మొబైల్లో వాటాల కొనుగోలుతో అంతర్జాతీయంగా సీపాస్ విభాగంలో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ప్రాక్సిమస్ గ్రూప్ సీఈవో గిలామ్ బూటిన్ తెలిపారు. ప్రాక్సిమస్ సంస్థలో పెట్టుబడి.. ఒప్పందం ప్రకారం రూట్ మొబైల్ వ్యవస్థాపక వాటాదారుల్లో కొందరు ప్రాక్సిమస్ ఓపల్లో అలాగే ప్రాక్సిమస్కు చెందిన మరో అనుబంధ సంస్థ టెలీసైన్లో మైనారిటీ వాటాలు తీసుకోనున్నారు. ఇందుకోసం 299.6 మిలియన్ యూరోలను వెచి్చంచనున్నారు. రూట్ మొబైల్ మరింత ముందుగానే బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు టెలీసైన్తో భాగస్వామ్యం ఉపయోగపడగలదని గుప్తా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీఎస్ఈలో రూట్ మొబైల్ షేరు సుమారు 9% క్షీణించి రూ. 1,486 వద్ద క్లోజైంది. -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్‌పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్‌కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్‌పూర్ వస్తుంటారు. -
నాలుగు విభాగాలపై విప్రో ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: క్లయింట్ల వ్యాపార అవసరాలకు అనుగుణంగా మెరుగైన సర్వీసులు అందించడంపై, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై విప్రో మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నాలుగు వ్యూహాత్మక వ్యాపార విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. క్లౌడ్, ఎంటర్ప్రైజ్ సాంకేతికత .. వ్యాపార పరివర్తన, ఇంజినీరింగ్, కన్సల్టింగ్ వీటిలో ఉంటాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. నిర్ణయాల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, పెట్టుబడుల విషయంలో సమర్ధమంతంగా వ్యవహరించేందుకు ఇవి తోడ్పడగలవని విప్రో ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. క్లౌడ్ సామరధ్యలన్నింటినీ విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ విభాగం కిందికి తేనున్నారు. ప్రస్తుతం క్లౌడ్ ఇన్ఫ్రా సర్వీసుల విభాగానికి హెడ్‌గా ఉన్న జో డెబెకర్ దీనికి సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం విప్రో ఐకోర్ వ్యాపార హెడ్‌గా ఉన్న నాగేంద్ర బండారు .. విప్రో ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్కు గ్లోబల్ హెడ్‌గా ఉంటారు. క్యాప్కో, డిజైనిట్ మొదలైనవన్నీ విప్రో కన్సల్టింగ్ విభాగం కింద ఉంటాయి. -
హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన కంపెనీ.. వత్తులు, బొట్టు బిల్లల వ్యాపారమంటూ..
కుషాయిగూడ (హైదరాబాద్): ఉపాధి చూపుతానంటూ ముగ్గులోకి దించి అందిన కాడికి దండుకొని బోర్డు తిప్పేసిన ఘటన సోమవారం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. రావులకొల్లు రమేశ్ అనే వ్యక్తి ఏఎస్ రావునగర్‌లో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ (గ్రోయింగ్ టుగెదర్) కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. వత్తులు, బొట్టుబిల్లలు తయారు చేసే మిషన్లు సరఫరా చేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. మిషన్లు కొనుగోలు చేసేవారికి అవసరమైన ముడిసరుకు తానే సరఫరా చేస్తానని, తయారు చేసిన వత్తులు, బొట్టుబిల్లలను కూడా తానే కొనుగోలు చేసి ఉపాధి చూపుతానంటూ నమ్మించాడు. ఆకర్షితులైన వారు వత్తుల మిషన్‌కు రూ.1.50 లక్షలు, బొట్టు బిల్లల మిషన్‌కు రూ.2.20 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసి వత్తులు, బొట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. వారి వద్ద నుంచి కిలో వత్తులకు రూ.300, కిలో బొట్లకు రూ. 600 చెల్లిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో గొలుసు కట్టు మాదిరిగా ఆంధ్ర, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల వారూ మిషన్లు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. ఇలా వేల మంది యంత్రాలు కొనుగోలు చేయడంతో దాదాపు రూ.30 కోట్లు ఆర్జించాడు. కొన్నిరోజులుగా తయారీదారుల నుంచి వత్తులు, బొట్టుబిల్లలు తీసుకుంటున్నారే తప్ప డబ్బులు చెల్లించడం లేదు. ఈ క్రమంలో నాగర్జుననగర్ కాలనీకి చెందిన రుద్రరాజు రామసీత అనే మహిళకు చెందిన యంత్రాలు రిపేర్‌కు వచ్చాయి. ఆఫీసుకు వెళ్లగా ఆమెలా ఇబ్బందులు పడుతున్న చాలామంది అక్కడ కనిపించారు. దీంతో తాము మోసపోయా మని గ్రహించిన వారు.. వారం రోజులుగా ఆ ఆఫీసుకు వెళ్తున్నా రమేష్ అందుబాటులోకి రాలేదు. దీంతో బాధితులంతా కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
మోసానికో స్కీం!
ఆకర్షణీయమైన బ్రోచర్లు.. వాటిపై బంపర్ డ్రాలు, బహుమతులంటూ రాతలు.. ప్రతినెల కొద్దిమొత్తంలో చెల్లిస్తే చాలు ఖచ్చితమైన బహుమతి అంటూ ఎర.. ఆపై బంపర్‌డ్రాలో కార్లు, బైక్‌లు గెలుచుకునే అవకాశం మీదేనంటూ మాయమాటలు చెప్పే ఏజెంట్లు.. నేతల అండదందలు.. పట్టించుకోని అధికారులు.. వెరసి ఎంటర్‘ప్రైజెస్’ పేరుతో చట్టవ్యతిరేక దందా యథేచ్ఛగా సాగుతోంది. వారి వలలో చిక్కి అమాయకులు మోసపోతూనే ఉన్నారు. సాక్షి, కామారెడ్డి : జిల్లాలో నిషేధిత ఎంటర్‌ప్రైజెస్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అమాయ కులకు గాలం వేస్తూ ముంచేస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ శాఖ చూసీచూడనట్లుగా వదిలేస్తుండడంతో వారి మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రభుత్వం ఏనాడో ఇలాంటి స్కీమ్‌లను నిషేధించింది. అయితే రాజకీయ అండదండలతో కొంత మంది ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కామారెడ్డిలో ఇది బహిరంగ రహస్యమే.. జోరుగా లాటరీ స్కీంలు మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు.. ఎంటర్ప్రైజెస్లవైపు కన్నెత్తి చూడకపోవడంతో నిషేధించబడిన లాటరీలు, స్కీంలు జిల్లా కేం ద్రంలో విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఇటీవల కామారెడ్డిలోని ప్రముఖ వ్యాపారులు కొందరు సిండికేట్‌గా ఏర్పడి ఓ భారీ లాటరీ స్కీంను తెరపైకి తీసుకువచ్చారు. దీని ప్రకారం నెలకు రూ. 1000 చొప్పున 15 నెలల పాటు చెల్లిస్తే.. సభ్యుడు చెల్లించిన మొత్తానికి సరిపడా ఖచ్చితమైన బహుమతి ఉంటుంది. అంతేకాకుండా ప్రతినెల బంపర్ డ్రా పేరుతో స్కీంలో కార్లు, బైక్‌లు, బంగారం కాయిన్లు సొంతం చేసుకోవచ్చని సభ్యులను చేర్చుకున్నారు. ఓ ఎంటర్ప్రైజెస్ పేరుతో మూడు నెలల క్రితం ఈ స్కీం ప్రారంభమైంది. ప్రతినెల రెండో లేదా మూడో గురువారం సిరిసిల్లారోడ్లోని ఓ ఫంక్షన్హాల్లో డ్రా నిర్వహిస్తున్నారు. స్కీంలో మొత్తం 3 వేల మంది సభ్యులను చేర్చుకున్నారు. మొత్తం స్కీం పూర్తయ్యే సరికి రూ. 4.50 కోట్లు వసూలు చేయాలన్నది నిర్వాహకుల లక్ష్యమని తెలుస్తోంది.. దీంట్లో 2.50 కోట్ల వరకు దండుకునే విధంగా స్కీంను రూపొందించారని సమాచారం. ప్రజలను నిలువునా దోపిడీకి గురిచేసే ఇలాంటి లాటరీ స్కీమ్‌ను జిల్లా కేంద్రం నడిబొడ్డున నిర్వహిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది సైతం కామారెడ్డి పాతబస్టాండ్ ప్రాంతంలోని ఓ భవనంలో కార్యాలయాన్ని తెరిచి ఇలాంటి స్కీమ్‌లు నడిపించారు. ప్రస్తుతం మరో ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు కూడా తాజాగా లాటరీ స్కీమ్‌ను ప్రారంభించినట్లు తెలిసింది. పట్టించుకోని అధికారులు లాటరీ పద్ధతిన నిర్వహించే స్కీంలను ప్రభుత్వం ఏనాడో నిషేధించింది. ఇటీవలే నిజామాబాద్‌లో ఇలాంటి స్కీం నిర్వహిస్తున్న ఓ భవనంపై పోలీసులు, అధికారులు దాడులు నిర్వహించి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో నిర్వహిస్తున్న స్కీమ్‌లను మాత్రం పట్టించుకునే వారు కరువయ్యారు. నిర్వాహకులు ఎవరో, స్కీం వివరాలు ఏమిటో అన్నీ తెలిసినా పోలీసులు కానీ, సంబంధిత అధికారులు కానీ అటువైపు వెళ్లడం లేదు. రాజకీయ అండదండలు ఉన్న కొందరు నిర్వాహకులు ఇప్పటికే పోలీసుశాఖలోని కొందరికి, స్థానిక నేతలకు ముడుపులు ఇచ్చి, తమ దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వారి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్కీమ్‌ల పేరుతో ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్న ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుల ఆట కట్టించాలని జనం కోరుతున్నారు. -
ప్రైవేట్ 'ఎంటిటీ' కాదు 'ఎంటర్ప్రైజ్'!
న్యూఢిల్లీ: భూసేకరణ చట్టానికి చేపట్టిన సవరణలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. సవరణ బిల్లులో 'ప్రైవేటు ఎంటిటీ' అనే పదాన్ని 'ప్రైవేట్ ఎంటర్ప్రైజ్'గా మార్చేందుకు.. తద్వారా ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టే ప్రయివేటు వ్యవస్థ నిర్వచనాన్ని పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విపక్షాలకు సర్కారు సంకేతమిచ్చింది. భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు (సవరణ) బిల్లు సోమవారం పార్లమెంటులో పరిశీలనకు, ఆమోదానికి రానుంది. ఈ బిల్లులో ‘ప్రైవేట్ ఎంటిటీ’ (ఎంటిటీ అంటే ఎటువంటి వ్యవస్థ కానీ, వ్యక్తి కానీ ఏదైనా కావచ్చు) అన్న పదాన్ని వినియోగించటం వల్ల ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే భూసేకరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో.. ‘ప్రైవేట్ ఎంటిటీ’ పదం స్థానంలో.. ‘ప్రైవేట్ ఎంటర్ప్రైజ్’ (ప్రైవేట్ సంస్థ) పదాన్ని చేర్చేందుకు బిల్లుకు అధికారిక సవరణ తెస్తామని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్‌సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడులు ఆదివారం సమావేశమై చర్చించారని తెలిసింది. వీరు సోమవారం ఉదయం లోక్‌సభలోని రాజకీయ పక్షాల నేతలతో సమావేశమై చర్చిస్తారని సమాచారం. గత యూపీఏ సర్కారు 2013లో భూసేకరణ చట్టం చేసినపుడు.. అందులో ‘ప్రైవేట్ కంపెనీల’ కోసం భూసేకరణ చేపట్టవచ్చని పేర్కొంది. ఈ చట్టానికి ఎన్డీఏ సర్కారు ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన సవరణలోనూ, ఆ ఆర్డినెన్స్ స్థానంలో చట్టం చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లులోనూ ‘ప్రైవేట్ కంపెనీ’ పదాన్ని 'ప్రైవేటు ఎంటిటీ'గా మార్చింది. కార్పొరేట్ల కోసమే: జైరాం రమేశ్ కొచ్చి: కార్పొరేట్ల కోసమే భూసేకరణ చట్టానికి సవరణలు చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. రైతుల క్షేమం కోసం 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి సవరణలు చేయడం దారుణమని అన్నారు. నితీశ్ నిరశన... భూ సేకరణ ఆర్డినెన్స్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 14న 24 గంటల నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ మేరకు జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ సింగ్ ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.